Tuesday, April 9, 2013

కొత్తమేడ




-         శ్రీ ఆకుండి రాజేశ్వరరావు
-         రసమయి కధాసంకలనం: 1966 మార్చి తొలి ముద్రణ

              అది కొత్తమేడ నిజానికిది పాతమేడే...కానీ నిజం ఎవరికి కావాలి.. జనం ఇప్పటికీ ఆ పాతమేడను..కొత్తమేడ అనే పిలుస్తున్నారు.

                సరిగ్గా కొత్తమేడ కెదురుగా ఒక యిల్లు వుంది..దాన్ని ఇల్లు అనరేమో పాక అనే అంటారు.. ఎదురెదురుగా వున్న కొత్తమేడకు పాకకు మధ్య ...వున్నవాడికి ..లేనివాడికి మధ్య హద్దులా తార్రోడ్డు పడివుంది..ఆ రోడ్డుమీదనుంచి పోయినవాడికి మేడ ..ఆ మేడను మోస్తున్న పాలరాతి స్తంభాలు కనిపిస్తాయే కానీ .. పాక ..పాకచుట్టూ వున్న బంతిపూలు కనిపించవు..పాకకు, రోడ్డుకు మధ్య నిలువెత్తున కంచె, అంతకన్నా ఎత్తుగా పెరిగిపోతున్న నానారకాలచెట్లు, పాకను అప్యాయంగా దాచేస్తుంటాయి.

                కాని కొత్తమేడమాద నిలబడితేమాత్రం పాక చాలా తమాషాగా,నేలను విరిసిన హరివిల్లులా,బొమ్మరిల్లులా,పికాసో చిత్రంలా, కనిపిస్తుంది, కాని ఆ రమ్యతను చూచేదెవరు? ఒక్క జమిందారు తప్ప-.

                   జమీందారు మాత్రం కొత్తమేడ మాద పెద్దగదిలో నిలబడి అద్దాల కిటికీలోంచి, - సిగరెట్టు పొగలోనుంచి, పల్చని పచ్చని చెట్ల చిగుళ్ళ పైనుంచి, - పాకని ,పాక చుట్టూవున్న బంతిపూలను చూస్తూ కూర్చుంటాడు.

                  ఉబుసుపోక కాదు పనేమీలేకనూ కాదు. అంతులేని విలాసాలు, అతనికోసం వేయి కళ్ళతో నిరీక్షిస్తూ వుంటాయి. అయినా వాటన్నిటినీ ఒదిలేసుకుని ఆ కిటికీ దగ్గర కూర్చుంటాడు.

                 మేనేజరుకు మాత్రం ఆయన అలా కూర్చోవడంలో అర్దం కనిపించలేదు, ప్రభువుల మన ప్రవృత్తులకు అర్ధం ఏమిటని? ఆలోచించటమే అవివేకం... అని తీర్మానం చేసుకున్నాడు. ఏమైనా జమీందారు అలా కిటికీ దగ్గర కూర్చోవడం మాత్రం సరిపడలేదు.

                       *                                 *                        *

                 మెత్తటి సోపాలు అందమైన పాలరాతి శిల్పాలు, గోడలకు బిగించిన పులిబుఱ్ఱలు అన్నీ చీకట్లో మునిగిపోయుంటాయి. జమీందారుగారి చేతిలోని సిగరెట్టు మాత్రం కాలుతూ ,- లోయలో ఆవులించిన పులినోరులా మెరుస్తూ వుంటుంది. వేటలో ఆరితేరిన జమీందారు కళ్లు నిశ్చలంగా పాకపైన నిలుస్తాయి..



                    పాకలోనుంచి సన్నని వెలుగురేఖలు వరండామీదనుంచి జారుకుని బంతిపూలతో మంతనాలాడుతుంటాయి.

                     ఆ వెలుగు నియాన్లైటుది కాదు, ప్రమిదది, ఆ వెలుగును చూచినప్పుడల్లా మంచులో తడిసిన చంద్రకిరణంలా ఎంత చల్లగా పవిత్రంగా వుంది అని ఆశ్చర్యపడక మానడు, -జమీందారు, అందుకే- తన గదిలోని అత్యంతాధునికమైన విద్యుద్దీపాలు ఆర్పేసుకుని, తాను చీకట్లో మునిగిపోయిపాకలోనుంచి లేచే ప్రమిదవెలుగును తన్మయత్వంతో చూస్తూ కూర్చోవడం.

         ఆ వెలుగాతనికి ఆనందాన్ని అందిస్తుంటుంది, ఆవేదననూ రగిలిస్తూ వుంటుంది.

         చీకట్లో బిగబట్టుకుని కూర్చున్న జమీందారుకి ఆ వెలుగులో- పాకకు వున్న చిన్న వసారా, నడుమ చాప, చుట్టూ అల్లుకుపోయిన తీగలువీటన్నిటికీ తోడు వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తూనే వుంటారు, అలౌకికమైన స్వప్నంలా , ఆమెఅనంతవిహాయసపధాల్లో ,వలయాలు చుడుతూవున్న-బట్టలు ఒదిలేసిన కాంతితరంగం.

                     అతడు- ఆ కాంతి తరంగంలో తన అంతరంగాన్ని కలిపేసుకుని , యీ లోకాన్ని మరచిపోయిన అదృష్టవంతుడు,.

                      అతనికి- ఆమె కళ్ళు తప్ప ప్రపంచమే కనిపించదు.

                       ఆమెకు అతని వెడదరొమ్మే ప్రపంచమై కనిపిస్తుంది.

                        వాళ్ళిద్దరూ ...ఇద్దరు కాదు ఒక్కరే.

                 అది...సత్యం....స్వర్గం. ఆ చెదరని స్వర్గాన్ని , తొలగని వసంతాన్ని చూస్తూ, తను జగత్తునుండి విడిపోతూ, అంతకంతకూ, అంతర్ముఖమవుతూవున్న చైతన్యంలో యుగయుగాల జీవన నాదాన్ని వింటూ, తన్ను తాను మరిచిపోతాడు,జమీందారు.

                        ఎన్నో సుధీర్ఘ మైన రాత్రులు యిలానే నడిచిపోతున్నాయి .అంతకు ముందతను ఒక్కడుగు ముందుకు వెయ్యలేదు,తన్మయత్వంగా ఆకర్షిస్తున్నవాళ్ళిద్దరు గురించిఅతనికి బొత్తిగా తెలీదనే చెప్పాలిఅందుకాయన ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యాలని లేక కాదు కానీ ఏదో అడ్డుగా వచ్చేది.

                   అది తరతరాలుగా తన వంశాన్ని పెనవైచుకుని వస్తున్న ఆధిఖ్యత కావచ్చు.

                   అతనొకప్పుడు పెద్దజమీందారు, ప్రస్తుతం మాజీ జమీందారు. ఆ రోజుల్లో ఏనుగులు, గుర్రాలు- ఆడంబరాలు అన్నీ అంతరించాయి.. ఆయినా లోపంలేదు ప్రస్తుతం ఒకటి,రెండు పంచదార మిల్లులు, నాలుగైదు సినీమాహాల్సు, డజనుకు పైగా భవంతులు వున్నాయి.

                      కొన్నాళ్ళపాటు రేసులవెంట పరిగెడుతూ, చిత్తుగా త్రాగి డబ్బిచ్చి తెచ్చుకున్నఆడదాని కౌగిలి వెచ్చదనంలో సోలిపోతూ..జీవితాన్ని తృప్తిగా అనుభవిస్తున్నాను అని కలవరించాడు.

                  ఎటొచ్చీ కిటికీలోంచిపాక వైపు చూడటంఆరంభించాకనే- బ్రతుకు మీద అసహ్యం వేయడం ప్రారంభమైంది. ఎన్నో ప్రశ్నలు పుట్టలోని చీమల్లా బిల,బిలలాడసాగాయి

                 వాళ్ళెవరు? ఉత్త నిరుపేదలు, వాళ్ళకి సోఫాల్లేవు, కార్లులేవు, కనీసం కడుపునిండా యింత తిండైనా లేదు, అయినా వాళ్ళంత ఆనందంగా ఎలా వున్నారు?

                   మనుషులు ఆనందంగా జీవించడానికి, వారికిగల సిరి, సంపదలకూ సంబందం లేదా?.. చాలా నిశితంగా ఆలోచించేవాడు, ఎంత ఆలోచించినా..పేదవాడు ఎలా ఆనందిస్తున్నదీ, సుఖపడుతున్నదీ అతనికి అవగతమయ్యేది కాదు, ఉత్త భ్రాంతి, వాళ్ళకు సుఖమంటే ఏమిటో తెలియక తామూ సుఖపడుతున్నామనుకుంటున్నారు, తెలిస్తే ఏడుస్తునే వుందురు, డబ్బులేక సుఖం ఎక్కడినుంచి వస్తుంది?.. అని నచ్చచెప్పుకునేవాడు, అయినా తన వాదనలో ఏదో వెలితి వెంటాడుతునే వుండేది, ఎటూ తేల్చుకోలేక మరో సిగరెట్టు అంటించి వూరుకునేవాడు,.

              తరచుగా తన దాంపత్య జీవితాన్ని వాళ్ళ దాంపత్య జీవితంతో సరిపోల్చుకునేవాడు, - అప్పుడే అతనికి నిజంగా చావాలనిపించేది.

              తన బార్య తనకెప్పుడూ తలంటి నీళ్ళు పొయ్యలేదు, వండి అప్యాయంగా వడ్డించనూలేదు, వాటన్నిటికీ వేరే మనుషులున్నారు, వాళ్ళే చేసుకుపోతారంతా, వాళ్లు చేసేపనుల్లో బాద్యత ఉంటుందేమోగానీ అప్యాయత మాత్రం శూన్యం.

             ఆమె కారు వేరు - తన కారు వేరు, ఆమె బంగళా వేరు, తన బంగళా వేరు, ఆశలు, అభిరుచులు ..అంతా.. జీవితమే వేరు...యీ ప్రత్యేకత లేకపోతే వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

             అర్ధంలేని వ్యక్తిత్వాన్ని హోదాలను. కాపాడుకోవటంలో జీవితమే పోగొట్టుకొంటున్నాను,...బాధగా మూలిగేవాడు..

             వాళ్ళిద్దరూ కలిసి కష్టపడుతున్నారు,- కలసి సుఖపడుతున్నారు- వాళ్ళిద్దరూ వేరుకాదు, ఒక్కటే- వాళ్ళలో వ్యక్తిత్వపు ఘర్షణలేదు, జీవితాలమధ్య అగాధం లేదు.

             పేదరికం మనుషులమధ్య ఆత్మీయతను పెంచుతుంది, సంపద- సహజంగా మనుషుల మధ్య అల్లుకోవలసిన ఆత్మీయతను త్రుంచుతుంది.

            తనెందుకు వాళ్ళలా బ్రతక్కూడదు?

            పిచ్చిగా అరిచేవాడు

            ఒక్కొక్కప్పుడు పాకవైపు చూస్తూవుంటే- తనకులేని ఆనందం వాళ్ళనుభవిస్తున్నందుకు తిక్కరేగేది, కసిపెరిగేది, ఇక ఇటువైపు చూడకూడదు భీష్మించుకొనేవాడు, అయినా చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు.

            ఆ రోజున చలి జాస్తిగానే వుంది, దానికితోడు చిన్నతుంపర, వీటన్నిటినీ ఆవరించుకుని జబర్దస్తీగా చిక్కబడుతున్న చీకటి.

            ప్రతిరోజులేనే ఆ రోజుకూడా జమీందారు తన గదిలో, చీకటిలో, అద్దాల కిటికీ దగ్గర కూర్చుండి తదేకంగా ఆ ఆనందధామం వైపు చూస్తున్నాడు.

            చీకట్లో అతని హృదయం సంతోషంతో ఉరకలు వేస్తూంది,, నందన వనంలోనుంచి, కోయిలపాట గండుతుమ్మెద శృతి అమృతంలోనుంచి పడివస్తున్నట్లువుంది, ఆ పాటలో మాటలకు అర్ధం లేకపోవచ్చు కాని వాటిలో భావం మాత్రం ఊహకందదు, అది సంగీతానికే అతీతమైన సంగీతం.

            ఆమె పాడుతూంది అతను వాయిస్తున్నాడు.

            అది వీణ కాదు, సితారా కాదు, - చిన్న కొబ్బరిచిప్ప- దానిమీదనుంచి బిగించబడ్డ ఒకటి రెండు తీగలు గల చిన్న వాయిద్యం.

            జమీందారు వళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు.

           సన్నని పాట- ఒక్కటే ..పాక లో నుంచి లేచి తోటను , కొత్తమేడను దాటి ప్రపంచాన్ని ఆవరించుకుంటూవుంది.

            పాటతో ఆ రాత్రి రసవాహినిగా మారి చిందులు వేసింది, నందనవనంలోని బంతిపూలన్నీ చల్లగా నవ్వుకుంటూ, పసిపిల్లల్లా, దేవతల్లా,నిదురలోకి ఒదిగిపోయాయి.

            జమీందారు ఒళ్ళు పులకరించింది, కళ్ళు చెమ్మగిల్లాయి, కొత్తమేడ, మెత్తటిసోఫాలు, అందమైన కార్లు అన్నీ వదిలేసి పాక దగ్గరకు పరుగెత్తి అక్కడే వుండిపోవాలనిపించింది, తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది- మేడమీదనుంచి గెంతేసి చావాలనిపించింది.

               అంతలో...........అరె.........................పాట ఆగిపోయింది...

            పాటలోని వెలుగు మాయమైంది, నందనవనం చీకట్లో మునిగిపోయింది, దేవతల్లాంటి ఆ మిధునం పాకలోకి జారిపోయారు, యువకుని చావులా భయంకరమైన చీకటి, ఇంకా జమీందారు ఆ శూన్యంలోకి చూస్తూనే వున్నాడు.

            గప్పున జమీందారు గదిలో లైట్లు వెలిగాయి.

             జమీందారు త్రుళ్ళిపడటం --- మేనేజరు పొడిగా సకిలించడం ఒక్కసారే జరిగాయి.

             తెచ్చిపెట్టుకున్న వినయాన్ని- మేనేజరు కనపర్చాడు, పుట్టుకతో వచ్చిన హుందాతో, జమీందారు మనసులోని , ఆవేదన ముఖంలోకి రాకుండా దాచేసుకున్నాడు.

             ఇంకా ఆయన చూపులు కిటికీలోనుంచి, పాకవైపు ప్రసరిస్తూనే ఉన్నాయి.

                   

              ఆ... అలగావాళ్లుంటున్న స్థలం మన వెంకట్రావుగారిది, ఈ వెధవలు దర్జాగా దానిమీద పాకేసుకుని కులుకుతున్నారు, ఆ.. అయిందిలెండి, యీ వెధవల కులుకు, ఆయన వ్యాపారంలో దెబ్బతినడంతో .. యీ స్థలాన్ని అమ్మజూపుతున్నాడు, చలమయ్యగారు అయినకాడికి పైసలు చేసుకుని యిక్కడ దివ్యభవనం లేపే ప్రయత్నంలో ఉన్నారు,.. అన్నాడు మేనేజరు ముక్తసరిగా..

            జమీందారుకు .. కాలం నిలిచిపోయినట్లనిపించింది, ఎవరో తన గుండెలమీద బాదుతున్నట్లనిపించింది, దిగాలుపడిపోయాడు.

            తరువాత.. కాస్తతేరుకుని ...చలమయ్యగారి కా శ్రమ ఎందుకు?  కావాలంటే మన భవనమే యిచ్చేద్దాం..అన్నారు.

            జమీందారు నిజంగా సిధ్దసంకల్పుడే..

            కొత్తమేడ రంగులు మార్చుకుంది, ద్వారాలు , కిటికీలు కొత్త తెరలను దించుకున్నాయి, కొత్తకార్లు, కొత్తమేడ, కొత్త పోర్టికోలో తొలిసారిగా ఆగాయి. కొత్తమేడ నిజంగా కొత్త సందడితో నిండిపోయింది.

            కాని... యీ మార్పంతా పాకలోని ఆ అమాయకులకు తెలియనే తెలియదు, అంతేకాదు, తాము నవ్వులు పండించుకుంటున్న ఆ చిన్న కొంప, ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బంతిమొక్కలు, అన్నీ జమీందారుగారికి దాఖలుపడ్డ విషయం కూడా తెలియలేదు.

           అప్పటికే కాదు, ఇప్పటికి కూడా వారికా విషయం తెలియదనే చెప్పాలి.

           కొత్తమేడ అమ్మేసి, ఆ పాక ఉన్న స్థలం జమీందారుగారు ఎందుకు కొన్నారో ..ఎంత తలకొట్టుకున్నా మేనేజరుకి అర్ధంకాలేదు.

            చివరకు ..ప్రభువుల మనప్రవృత్తికి అర్ధం ఏమిటి...అర్ధం వుందనుకోవడమే పొరపాటు..అని తీర్మానం చేసుకుని ఊరుకున్నాడు......,
                         
                    

No comments: