
శాపగ్రస్తప్రచురణ ఆంధ్రప్రభ వార పత్రిక తేదీ... 8-6-1964
పగిలిన అద్దాన్ని పట్టుకుని అఘోరిస్తూ కూర్చోవడం వివేకమనిపించుకోదు ఆ మాటే కొన్ని వేలసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంకా ఆ బీటలు వారిన అద్దాన్నే పట్టుకుని దేవులాడేవారిని ...ఏమనుకోవాలి...ఏమిటో అ మనస్తత్వం ఊహకందదు,ఆ మమకారానికి పొలిమేర, ఆ అంతర్యానికి అవధి లేదు కాబోలు,..అంతే ..అలానే అనుకోవాలి మరి,...
అట్టివారి వరుసలోనే నిలుస్తుంది తరళ కూడా.....
తొలిసారిగా ,పెళ్ళిచూపులనాడు,ఒక ప్రత్యేక ఆశక్తితో , పవిత్ర భావనామిళితమైన ద్రుష్ఠితో వెన్నెల – తేనె హ్రుదిలో వరదలై పారుతుంటే మాయసిగ్గు తెరలు, తెరలుగా ఆమెను ముంచివేస్తుంటే ఆ ఆనందానుభూతికి ఆగలేక వూగిపోతూనే అతని పాదాలను చూసి,
ఎంత చక్కని పాదాలు ... ఈ పాదాలను జీవితాంతంవరకు అర్పిస్తూ ,జన్మ చరితార్ధం చేసుకోవాలి అని అనుకున్నది, తరళ,..
అతని చూసీ చూడని చూపులు, వెన్నెలతుంపరలై ఆమె చుట్టూ విరజిమ్ముకుపోయాయి, ఆమె బుగ్గలపై నునులేత సిగ్గు పరుగుతీసి, చిన్నగా పెదవులపై జారి, వింతగా సొగసులు పోయింది, సోగకన్నులు తారకలై అమరగానం చేస్తుంటే పిచ్చి హ్రుదయం శ్రుతివేస్తూ పారవశ్యంలో పడింది.
అబ్బ .... రత్నాకర నిర్గత దుకళలా ఎంత అందంగా వుంది ఈమె, అదృష్టవంతుడిని అని అనుకుని మురిసిపోయాడు బలరాం.
అంతే,.. అంతకుమించి తను ఆలోచించలేదు. అతని భావనలన్నీ ఆ పరిధిలోనే పరిభ్రమించాయి.
ఆ విధంరా పెళ్ళిచూపులు మురిసాయి,ఆ మురగంపులోంచే – ఇచ్చిపుచ్చుకోవడాలు లాంఛనాలు ఆరంభమయ్యాయి,.
వ్యవహారమంతా పక్కా వ్యాపారసరళి లోనే సాగినా ఇరువర్గాలవారు ,కొంతలో కొంత , సామరస్య ధోరణిని ప్రదర్సించడం చేత – శుభం అనే పెద్దల మాటలతో ముగిసంది,..
ము హూర్తం కూడా , మగపెళ్ళివారి వీలుననుసరించే నిశ్చయించబడింది, అప్పటికి రెండు నెలల వ్యవధి వుండుటచేత ,నాలుగూ కూర్చుకోవడానికి అవకాశం కలిసివస్తుందనే అభిప్రాయంతో ఆడపెళ్ళివారు కూడా సంతోషించారు. ఇంకేముంది – పిచ్చి తరళ ఆనందం పగ్గాలు లేకుండా పోయింది.
ఏం, పెళ్ళికూతురా , అదృష్ఠమంటే నీదేనే, మేలమాడారు స్నేషితులు.
అలా కలిసిరావాలి కానీ – కాళ్లరిగేటట్లు తిరిగినా , ఒళ్ళు తిరిగేట్టు కలలుగన్నా-కల్యాణం కలిసి వస్తుందటమ్మా,.. అని సూత్రీకరిచారు. ఇంకా గుండెలమీద కుంపట్లా కూర్చున్నా కల్యాణయోగం కలిసిరాని తమపిల్లల దురదృష్ఠాన్ని నిందించుకుంటూ,అమ్మలక్కలు.
అప్పుడే తరళకు తన చెవిలో మంగళవాద్యాలు మారుమ్రోగినట్లయింది, కర్పూర వాసనలు కలవర పెట్టినట్లు,కాబోయె భర్త కొసరు చూపులు,తన వెన్నంటి తరుముతున్నట్లు,అనిపించసాగింది, సడిలేని నడిరాత్రి ఆమె లేత గుండెల్లో అతని అడుగుల సవ్వడి వినిపించినట్లయి, బెదరి, లేచి,అంతలోనే తనలో తాను సిగ్గుపడిపోయేది,.
అతని రూపాన్ని మదిలో భక్తితో, కొలిచేది,దప్పిక నిదుర మరచి ,అతని ధ్యసతో తీయగా గడపసాగింది.
కాని ఎందుకనో కుపిత విధి ఆమె ఆనందాన్ని చూసి సహించలేకపోయింది,తీరా పెళ్ళి పదిరోజులుందనేసరికి ,అనుకోని చిక్కులు వచ్చి పడ్డాయి. బలరాం అక్క నిర్మల తనకు రావలసిన ఆడపడుచు లాంఛనాల దగ్గర పేచీపెట్టింది.
ఇరువర్గాలవారు ఊరకనే పట్టుదలు పెంచుకున్నారు,మధ్యవర్తులఅనుచిత రాయబారాలతో వ్యవహారం బిగిసి – తుదకు తెగిపోయింది, ఈ అనుకోని సంఘటనకు కొందరు విచారించారు,మరికొందరు సంతోషించారు కూడా...
తరళకు- తన తలపై వోయి పిడుగులొక్కసారి పడినట్లనిపించి,,సొమ్మసిల్లి పడిపోయింది. మొదట ఈ వార్త ఆమె నమ్మలేకపోయింది, తరువాత నమ్మకతప్పిందికాదు, తను నమ్మిన సకలదేవతలు , ఆదుకోకపోతారా, అన్న నమ్మకం... ఆ నమ్మకం కూడా నశించడానికి అట్టే కాలం పట్టలేదు.
ఎప్పుడూ చిలిపిగా మాట్లాడే తరళ- దాదాపు మూగదైంది.
మానసికంగా బలహీనుడైన బలరాం కోరికలుతొందరిస్తున్నా ,ఆంతర్యం తరళ కోసం తపిస్తున్నా- మనసులోని వాంఛను పెదవి విప్పి చెప్పలోకపోయాడు, క తన సుఖంకోసం పెద్దలను ఎదిరించేదేముంది- తన పిరికితనానికి ,చేతకానితనానికి తనను తాను నిందించుకుంటూనే ,.. ఓ ముక్కూ మొహం ఎరగని ,చిన్నకళ్ళు, పెద్దపళ్ళు, లక్షణంగా కల అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు,..
తన పిరికితనం సంపాదించుకున్న సౌజన్యంతో బుధ్ధిమంతుడు,యోగ్యుడు,అన్న బిరుదులు- కూడా సంపాదించుకున్నాడు. –బలరాం...
కల్యాణతిలకం దిద్దుకోవలసిన తరళ నుదుటను కాటుకవాన కురిసింది. ఆమెకు జీవితసత్యం హాలాహాలమంత చేదుగాను కనిపించింది.
భగవాన్,.. నీ వెర్రిచేతలు అర్ధంకావటంలేదు, ఏంచేసానని ఇంత అన్యాయం చేసావు .. ఒక్క క్షణంలో ఉన్నత శిఖరం ఎక్కించి మరుక్షణంలోనే పాతాళలోకపు అంచులు చూపిస్తావు, బ్రతుకులో చింత నిప్పులు పోసి , చప్పుడు కాకుండా నవ్వుకుంటావు. మెళ్ళో మల్లెలమాలలు వేస్తూనే కళ్ళు పీకి పారేసి , అంతా నీ సుఖానికేనంటూ పీకనొక్కి పారేయటం నీకు వేడుకా , స్వామీ,.. అని తరళ ఎంతగానో వాపోయింది,...
క్రమంగా ఆమెకు బగవంతునిపై నమ్మకం పెద్దలంటే గైరవం నశించాయి.
పెద్దలందరూ స్వల్పవిషయాలకి ,పట్టుదలలుపోయి, తెంచేసుకున్నారే కానీ, ముహూర్తంనిశ్చయమైన దగ్గరనుంచి వధూవరుల హృదయాలు ఎంత దగ్గరయ్యాయో వారి అనురాగ బావనలు ఎంతబలంగా విలీనమయ్యాయో ఎవరూ ఊహించలేకపోయారు.
మసిబారిన వారి మనసులకు ఆ లేత హృదయాల ఆందోళన ప్రతిధ్వనులు వినిపించాయె కావు. వారి ముఖాలలో తొంగిచూసే ఆవేదన అధ్దాల వెనుక పాతుకుపోయిన ఖద్యోతాలలాంటి కళ్ళకు కనిపించాయి కావు.
ఉధ్ధరించవలసిన వారే – విధి విలాసం – అని ధర్మపన్నాలను వర్ణిస్తూ వేళ్ళు తన్నబోయే జీవితలతను పెరికిపారేశారు.
ఇక తరళ , బలరాం, నటిస్తూ బరువుగా జీవితయాత్ర సాగించడమో లేక నశించడమో తప్ప వేరే గతేముంది,..
తరళ తండ్రి శోభనాద్రి – పక్షంరోజులు తిరగకుండానే ,పంతంతో మరొక సంబంధం కుదుర్చుకు వచ్చాడు.
కానీ తరళ తన మనసును ఆక్రమించిన బలరాంను మనసులోంచి తప్పించలేకపోయింది, అతనిని మరచిపోలేకపోయింది, ఎన్నో విధాల ఆంతర్యంతో రాజీపడి , తండ్రి కుదిర్చిన సంబంధాన్ని అంగీకరించాలని భావించకపోలేదు. ఆమెకు శక్తి చాలిందికాదు, బలహీనమైన ఆమె ఆంతర్యమే బలంగా ఆమెను లొంగదీసుకుంది.
మనసులేని వారితో జీవితం ముడేసుకుని నటిస్తూ, జీవించడంకవ్వా మరణమే మేలు – అని ,ఎందరెన్ని చెప్పినా వినక , ఆ సంబంధం తిరగకొట్టేసింది తరళ.
కాల ప్రవాహం ఎన్నో మలుపులు తిరిగింది,. అయినా – శేషవర్జ్యంలా – ఏదో మూల ఆమె జీవితంలో దాగిన దుష్థవిధి.- మరలా మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది, మానసికాందోళనతో మంచమెక్కిమ శోభనాద్రి, కూతురు కల్యాణం చూడకుండానే కన్నుమూసాడు. ఆరని కన్నీటి స్రవంతి తోడుగా తరళ ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయింది.
మొగ్గలోనే ఆమె జీవితం వడగాలికి వాడి పోయింది, నాంది లోనే బరతవాక్యం పలికింది. నిజంగా ఇది ఎంత దురదృష్టం- స్వప్నాలు కరిగిపోయినా ,అవశేషాలు మాత్రం సూదుల్లా గుచ్చుకుంటూ మిగిలిపోయాయి.
ఆమెపై ఆమెకే అసహ్యం కల్గింది, ఒక విధమైన నిర్లిప్తత , నిశ్శబ్దత , ఆమెను ఆవరించుకున్నాయి. దైవం ఆమెకు శాపంగా ఇచ్చిన అందం సమాజం కనులకు మిరిమిట్లు గొలిపింది, కన్నుగీటి విషపునవ్వు నవ్వింది లోకం.
చేతికందబోయే జీవనమాధుర్యం నేలపాలయింది, సర్వం సంపూర్తిగా తుడుచుకుపోయింది, విధి తన్నితే ఆకుల్లా రాలిపోయే జీవితాల చుట్టూ ఎందుకీ వలయాలు – అనే వింత ధోరణి ఆమెలో రేకెత్తింది.
సంతోషమూ, సంతాపము, అందుకోలేని ఒక అనిర్వచనీయమైన మానసిక స్తితిలో మృత్యుశైతల్యం, స్ప్రుశించిన విరాగినిలా బయంకరంగా నవ్వుకుంటూ , ఒక్కటొక్కటిగా అధోలోకాల తలుపులను తెరచుకుంటూ నరకాన్ని వరిస్తూ ,పడిపోయింది.
ఏ స్పందనా లేని ఆమె అందం సమాజ కామానికి బలి అయిపోయింది.
బాటపక్క మొలచిన పూలతీగను అందుకోలేనిదెవరు – ఎందరో రసిపులు ,బైరాగులు, మేధావులు ,శుంఠలు, ఆమె జీవితంలోంచి నడిచిపోయారు. నిరంతరమూ ఆమె చూపులు ఏదో అమూల్యమైన దాన్ని పోగొట్టుక్కున్నట్లు దానికోసం వెతుకుతున్నట్లపగా చలిస్తూ కనిపించేవి. మనసు – దేనికోసమో రెపరెపలాడుతూ మూగవ్యధ అనుభవించేది.
ఒక పిల్లతల్లి అయి ఇక కొద్ది మాసాల్లో పిల్లనో, పిల్లాడినో ఎత్తుకోబోయే అర్ధాంగిని పుట్టింటికి పంపినప్పటినుంచి బలరాం – కాస్త నింపాదిగా ఊపిరి పీల్చుకోసాగాడు,ఎక్కడలేని స్వేచ్ఛ తనికి కలిగింది. బడివదిలిన తరువాత ఒకటోతరగతి పిల్లాడిలా మనసు అల్లరి లో పడింది. ఒంటరితనం ,దానిలోనుంచి జనించిన అస్పష్టమైన కోర్కెలు అతనిని స్తిరంగా వుండనిచ్చాయి కావు. అందుకనే కాబోలు నైతికపతనానికైనా , ఉన్నతికైనా ఒంటరితనమే దారితీస్తుందంటారు.విజ్ఝులు . నడిచిపోతున్న జీవితం మీద మోజు తగ్గడమే కాదు విసుగు కూడా కల్గింది. ప్రతి నిమిషం ఏదో ఒక కొత్తదనంకోసం , మార్పుకోసం, తహతహలాడసాగింది.
అవినీతి అని కొంచెం వెనుకంజ వేసినా, అసహజమని అనిపించలేదు. మానవ మనసు ఎల్లప్పుడు ఒకేదానితో సంతృప్తి పడదు. వైవిధ్యాన్ని కోరుతూనే వుంటుంది. వైవిధ్యంకూడా జీవితాలను సంపన్నం చేస్తుంది కాబోలు.
***
ఒకనాడు ప్రకృతి ముసుగేసుకున్న మసక చీకటి లో తనకు తెలియకుండానే తరళ గడప తొక్కాడు, బలరాం.
బలరాంను చూచి తన కన్నులను తానే నమ్మలేక పోయింది, మోసం చేస్తున్నాయేమో, అనుకున్నది తృటికాలం. కాని కట్టెదుట నిలిచి.తడబడి పోతున్న బలరాం ను చూచి, ఇంకా భ్రాంతి అని ఎలా అనుకోగలదు
భగవాన్ నీరు నిండిన కళ్ళతో నీ కమనీయ రూపం చూడలేకపోతున్నాను.చలించే చిత్తం తో నిన్ను తలచలేక పోతున్నాను. అయినా నా పేద పిలుపు నీచెవిని సోకిందా దర్శన భాగ్యం లభింపచేసావు. ఏనాడో అంతా పారేసుకున్నాను.... ఇంకా ఏది నాదగ్గర మిగిలి ఉందని నీకు సమర్పించుకునేది. అని తనలో తాను అనుకుంటూ కలువ రేకులలాంటి కనురెప్పలను భారంగా మూసింది.
ఆసమయంలో ... ఆమె బలరాం లో విశ్వ మోహనుడైన భగవానుని చూచిందో లేక బలరామే ఆమెకు భగవానుడో.... ఎవరికి తెలుసు..
ఆమధురానుభవానికి ఊగిపోతూనే రండి అంటూ బలరాం ను ఆహ్వానిస్తూ చేతులు చాపింది. కాని అంతలోనే మలినమైన తన శరీరం ఙప్తి వచ్చి ...చివాలున చేతులను వెనక్కు లాగేసింది.
ఇంతలో....- బలరాం ఆమెను దగ్గరగా తీసుకుంటూ కురులు సవరించాడు. ఆ లాలనతో గుండెల్లో దాచుకున్న కన్నీరంతా ఒకసారిగా ఉబికింది.
తలవని తలంపుగా ఆమెను కలుసుకునే అవకాశం లభించినందుకు సంతోషంతోనూ, అప్రయోజకుడినై ఇంత అందాన్ని స్వంతం చేసుకోలేక పోయానే అనే విచారంతోనూ, ఆమె ఆమెచంపల తడిని గమనించలేకపోయాడు బలరాం.
నిశ్శబ్దం వారి పవిత్రమేన సమాగమానికి సాక్ష్యంగా నిలిచింది. అతని స్పర్శతో ఆమె ఒడలెల్ల జలదరించింది. ప్రతి అణువు స్పందించింది. తొలిసారిగా సిగ్గు పడింది. అతని కోసం తాను ఎంతగా తపించిందో, ఒక్కసారి విప్పిచెప్పి తన మనోవ్యధను, గుండె బరువును వదిలించుకోవాలనుకుంది, కాని, ఒక్క మాట కూడా పెదవి విప్పి చెప్పలేక .....
అతని బరువైన కనురెప్పలు, చలించే పెదవులు చూస్తూ, వెచ్చని నిట్టూర్పులో పడి పిచ్చిదానిలా అయిపోయింది. మూగవిపంచిలా మానసము మూర్ఛనలు పోయింది. సిగ ముడి వీడి, నీలకబరిలోని విరులు అతని పాదాలపై జారిపడ్డాయి.
హోరుగాలి ఉధ్ధృతంగా వీచింది. చీకటి వికటాట్ఠహాసం చేసింది. దిక్కులు బరువుగా మూలిగాయి. తన మలినరూపమే... నగ్నంగా ఆమెచుట్టూ కరాళనృత్యం చేస్తున్నట్లనిపించింది. ఆమె మదిలో ప్రళయకాల పర్జన్యాలు గర్జించినట్లయింది.
ఒక్కసారిగా తన శక్తి నంతా కూడగట్టుకుని అతని కౌగిలిని బలంగా విదిలించేసుకుని అవనీ అంబరమూ కలసి ఊపే హోరుగాలిలో మృత్యువు లాంటి చీకటిని చీల్చుకుంటూ పిచ్చిదానిలా పారిపోయింది.
బలరాం నిశ్చేష్ఠుడయ్యాడు.
క్రమంగా ఆమె ఔన్నత్యం అర్ధమైన కొలదీ ఎంతగానో పరితపించాడు.తల నేలకేసి బాదుకున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రోశించాడు.
కానీ, ఏం లాభం?
తరళ జ్ఞాప్తి కి వచ్చి నపుడల్లా “శాపగ్రస్త” కాకపోతే అంత మహోన్నతమైన తరళజీవితం, ఎందుకంత అధోగతి పాలౌతుంది. అని నిట్టూరుస్తాడు.......బలరాం....బలంగా....
****
1 comment:
A very old but best story of human feelings. One of the best stories of the author
Post a Comment