Friday, December 23, 2011

మరచిపోకండి

మరచిపోకండిచేతన – మే--1962చరిత్ర పుటలు వెనుకకు తిరగేసి చూసుకుంటే, “పురాతనకాలం దగ్గరనుంచి తెల్లగొడుగులు వుండేవని సదరు తెల్లగొడుగుల చల్లని నీడను కల్ల-కపటం ఎరుగని ప్రజలు చల్లగా బ్రతికేవారని” చెప్పుకోవడానికి బోలెడు దాఖలాలు కనిపిస్తాయి.
అసలు మానవుని గొప్పతనం, తోటి మానవునిచేత గొడుగు పట్టించుకోవడంలోనే గర్భితమై వుందని పూర్వీకుల గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్మే కాబోలు – శ్రీకృష్ణుడంతటివాడు కర్ణునితో “చూస్తావేమయ్యా .... వాయుపుత్రుడి చేత నీకు దివ్యశ్ఛత్రాన్ని పట్టిస్తాను” అని ఆశ చూపించి, “యీ దెబ్బతో కర్ణుడు పాండవులతో చేతులు కలపక తప్పదు” అనుకున్నాడు. అయినా కర్ణుడు గొడుగు పట్టించుకునే వ్యామోహానికి తల ఒగ్గలేదు. కాబట్టి అతనికింత వరకు పేరు ప్రఖ్యాతి దక్కాయి. యీ ఒక్క విషయం చాలు మన పూర్వీకులు గొడుగు పట్టించుకునేందుకు ఎంత ముచ్చటపడేవారో తెలవడానికి.
కాలం అనేక మార్పులు పొందినా , ఆనాటినుంచి , యీనాటివరకూగొడుగు పట్టించుకునే ఉబలాటం , గొప్పవారమనుకునే వారికి వీసమెత్తుకూడా తగ్గలేదు. కాలాన్ని జయించి , నిలబడ్డ కీర్తి ఖాయంగా దీనికే దక్కాలి. మరీ, నేను మొత్తం జనాన్ని, “గొడుగు పట్టించుకునేవారు.. గొడుగు పట్టేవారు” అని రెండు భాగాలు గా విభజించాను.
అయితే కాలగర్భం లో పడి తెల్లగొడుగుల కాలం, చల్లగా తరలి పోయింది. యీనాడు మనకు మిగిలిన వన్నీ నల్లగొడుగులే. యీ లోకంలో కోటానుకోట్ల గుబ్బగొడుగులుండొచ్చును. కాని నాకు వాటితో ప్రసక్తి లేదు. యీ నా గొడవంతా నా ఒక్క గొడుగుకే పరిమితమై ఉంది. అయితే “గొడుగు గురించి యింత గొడవ దేనికి?“ అని అడగొచ్చు. కానీ, నాకూ, నా గొడుగుకు గల అనుబంధం మీరు తెలుసు కుంటే, మీరు తప్పక మీ ప్రశ్నను ఉపసంహరించుకుంటారు.
నా వివాహంలో లాంఛన ప్రాయంగా జరిగిన కాశీ యాత్రా తంతులో మా బావ మరిది ఒక నల్లగొడుగు, జత చెప్పులు నాకు సమర్పించి సముదాయించాడు. తరువాత నా ఉద్యోగాన్వేషణా, భీషణ ప్రయత్నంలో చెప్పులు అరిగి నామరూపరహితమైనా, గొడుగు మాత్రం కొద్ది చిల్లులతోనైనా యీనాటివరకూ నా చేతిలో మిగిలి పోయింది. నా జీవితాన్ని ఆక్రమించుకుంది.
ఆదిలో నా అర్ధాంగిలానే, నా గొడుగూ నా మాట వినిపించుకునేది కాదు. బాహాటంగా ఎదురు తిరిగే శక్తి లేక, యితరుల కాళ్ళలో బడి...వాళ్ళచేత తిట్టించేది. అటు తరువాత అచిరకాలంలోనే, “యిద్దరం కలసి చిరకాలం జీవించడం తప్పనిసరి”. అని తెలుసుకున్న తరువాత .. నా భార్యలాగే... మనసు సరి చేసుకుని నాతో సహకరించడం ప్రారంభించింది లెండి.
వివాహం అనేది ప్రతి జీవి, జీవితంలోనూ, ఒక మధురశృతి...మధురస్మృతి- అట్టి మధురక్షణాలు జీవితఘర్షణలో పడి చెరిగిపోకుండా గుర్తుకు చేడానికంటూ కొన్ని ఙ్ఞాపకాలుండాలి. అలా మా వివాహానికి గుర్తుగా మిగిలినవి ...దాని మెళ్ళో నల్లపూసలు, మంగళ సూత్రం, నా చేతిలో నల్లని గొడుగూ, అందుకనే నాకు ఆ గొడుగంటే అంత మమత ఏర్పడుంటుంది.
ప్రస్తుతం నేను నా గొడుగును, ఎండ, వాన, మొదలైన అల్పవిషయాలకు ఉపయోగించనేలేదు. అది ఉపయోగించదు కూడా. నా గుండెల్లో మండే మంట కన్న కారే కన్నీటికి మిన్నగా నన్ను వర్షం తడిపెయ్యగలదా?.. లేదే...అందుకే నాకు ఎండకూ, వానకూ ఎన్నడూ గొడుగవసరంలేదు. అయితే ఎండకూ వానకూ ఉపయోగించని గొడుగు దేనికి?. అని మీకు అర్ధం కాని ప్రశ్న నా ముఖంమీద మీరు విసురుతారని నాకు తెలుసు. అందుకే మనవి చేసుకుంటున్నాను.
నా అదృష్టం వల్ల ...వారి దురదృష్టం వల్ల నాకు అప్పిచ్చితీరుగ వసూలు చేసుకుందామని. నన్ను పట్టుకుందికి, ఓపిగ్గా తిరుగుతున్న అప్పులవాళ్ళ తీక్షణ, వీక్షణ పంక్తుల నుండీ – ఆదివారం నాడైనా, ఆఫీసు పని అయిన తర్వాత నైనా, రోడ్డుమీద తారస పడితే, నిప్పులు గక్కే అధికార్ల నుంచీ నా తలను తప్పించి, తన గర్భంలో దాచేసుకుని నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది నాగొడుగు. – అంత కన్నా మహోపయోగం – ఏముందీ.
నాకు మనుష్యుల ఎదుట పడడటమంటే తగని భయం. అంతే కాదు – దైవంకన్నా సగటు మనిషంటేనే - భయం, భక్తి కూడా నాకు మిన్న, ఎందుకంటారేమో..
ఒక్కసారైనా దైవానికి నైవేద్యం సమర్పించక పోయినా, నమస్కరించక పోయినా, ఆగ్రహిస్తాడో లేదో ఎవరూ చెప్పలేరు. ఆగ్రహిస్తాడనడానికి తగిన ఆధారాలు కనిపించవు కూడా. కానీ సాటి మనిషి ఎదురైనపుడు - నమస్కరించక పోయినా (హృదయంతో కాదనుకోండి) సూచించినపుడు నైవేద్యం అర్పించి, కాస్త ధూపంపట్టక పోయినా శ్రీవారి ఆగ్రహానుగ్రహాలు మన జీవితాల పైన ఎంత గట్టి ముద్ర వేస్తాయో, మన అనుభవాలకు భిన్నమైనది కాదు కదా...
అంతెందుకు, మా ఆఫీసుకే ఒక ఆఫీసరుండే వాడుట. ఆయన మీసాలు చూస్తేనే చాలు గుమస్తాలకు జ్వరం వచ్చినంత పని అయేదట. ఆమహాను భావుడు తన అనుగ్రహం వల్లనే గుమస్తాలు జీవిస్తున్నట్లు అనుకొని, అలా అని ఊరుకోకుండా బాహాటం గా అందరికీ చెప్పుకొనేవాడుట. ఆయనకు నమస్కారం అందుకోవడ మంటే తీరని సరదా. గ్రహచారం కాలి ఏ గుమస్తా అయినా నమస్కారం మరచాడంటే యిహ వాడి పని ఆఖరు. ఒక ఆదివారం నాడు అమాయకుడైన ఒక గుమస్తా, సతీసమేతంగా మ్యాట్నీసినీమా చిత్తగించి వస్తూ ఎదురుపడ్డ యీ ఆఫీసరును చూచి కూడా మనస్కరించడం మరచిపోయాడు. తీరా ఆయన దాటి పోయిన తరువాత ...అ...రె....రె.... నమస్కరించడం మరచిపోయానే, ఏం కొంప మునుగు తుందో – దైవమా నీదే భారం అని కనుపించని దైవాలకు అందరకూ వందేసి నమస్కారాలర్పించేడుట . అయినా అతని గుండెలని భయం తొలగ లేదు. ఇంతలో ఆ అధికారి దయకు పాత్రుడూ, హితుడూ, లౌకిక ఙ్ఞానంలో వృధ్ధుడూ అయిన ఆసామి ఒకడు వచ్చి “ఎంత పని చేసావయ్యా? ఒక దండం విసిరేస్తే నీ సొమ్మేం దండుగయిందా.. తలతాకట్టు పెట్టుకున్నవాడికి తలబిరుసు తగదుసుమా !.. ఆయన పాములా బుస కొడుతున్ననాడు. నువ్వు అవమానించేవని....ఆయన కోపం, పట్టుదల, అభిమానం నీకు తెలుసుగా, ఏం జరుగుతుందో”..అని మరింత పిరికి మందు పోసాడు. అంతే.
ఆరాత్రే ఆ అమాయకుడికి పుట్టెడు జ్వరం వచ్చింది. జ్వరంలోనే .. “యిప్పుడు కావాలంటే వంద నమస్కారాలు, సాష్టాంగ దండప్రమాణాలు అర్పించుకుంటాను. పొరపాటు జరిగిపోయింది. యింకెప్పుడూ యిట్టి పొరపాటు పునరావృత్తంకానివ్వను. గంపెడు పిల్లలు గలవాడిని- కనికరించండి” అని పలవరిస్తూ, ఆ పలవరింతలలోనే, గుక్కెడు ప్రాణాలు వదిలేశాడుట. వందేసి నమస్కారాలందుకున్న దైవాలందరూకలసి అతనికి అడ్డు పడలేక పోయారు.
యీ జాలిగాధను మా ఆఫీసులో కొత్తగా, అడుగుంచి సీటులో శరీరాన్న అంటించుకోబోయే ప్రతీ కొత్త గుమస్తాకు పాతుకుపోయిన పాత గుమస్తాలు,రాతి బిళ్ళల్లాంటి అద్దాలవెనుక గుడ్డిగా మెరుస్తున్న జాలికళ్ళతో కళ్ళనీరు పెట్టుకుంటూ, తప్పకుండా చెప్పి, అంతటితో ఆగక తల నాలుగు కాలాల పాటు నిలుపు కోదలచినవాడు, ఆఖరకు తన ఇంట్లోనైనా తలెత్తి తిరగరాదని , పెళ్ళాం , పిల్లల్ని, పోషించుకోదలచినవాడు ఒళ్ళు మరచిపోకూడదని, అధికారి ముఖాన ఉమ్మినా, “పన్నీరు” అని భావించి ,కన్నీరు పెట్టకుండా – “కాళ్ళతో కుమ్మలేదు, ఉమ్మితేనేం” అని సంతోషించాలనే – ఉద్యోగధర్మసూత్రాలను సటీకా తాత్పర్యాలతో సహా వివరించి – “ఏడుస్తూ సుఖంగా జీవించు” అని ఆశీర్వదిస్తారు, అందుకనే నాకు మనిషంటే అంత భయం, భక్తి, ఏర్పడ్డాయనుకుంటాను.
నేనే కాదు, నాబోటి వ్యక్తులు అర్పించిన రోజువారీ నమస్కారాల్లో, ఒక్కటికూడా దైవానికి చెందదు.అన్నీ అధికార, అనధికార వ్యక్తులకే అర్పితం అవుతాయి, అవుతున్నాయి కూడా..
అసలు సూక్ష్మంగా పరిసీలిస్తే ఆకార, వికారాల్లోను, కించిత్ వికారం గోచరిస్తుంది., కాని, స్ధూలంగా పరిశీలిస్తే మానవుడికి, దేవుడికి భేధమే కనబడదని అంటున్నారు కొంతమంది, అందుకనేమో యిటీవల ఏదో సినిమాలో “మానవుడే దేముడహో” అని మాటల్లో అంటే నీరసంగా ఉంటుందని , పాటలో బిగించి గొంతుబద్దలయ్యేలా పాడించి తృప్తిపడ్డారు, కొంతమేది మహాత్ములు అంతమందినీ “మానవసేవే – మాధవసేవ” అని అంగలారుస్తు నమ్మమంటుంటే – ఆ అంతమందిలోను మరి కొంతమంది “మాధవసేవే – మానవసేవ” అని కావాలనుంటే అగరొత్తులను సాక్ష్యం అడగమండున్నారు, యీ రెండుసేవలూ సరిహద్దు సమస్యలా చాల వివాదగ్రస్తంగా వున్నాయి. అదేదో తేలనీ, అంతవరకూ , ఓపికున్నంతవరకూ “కాంతా – కనకాలసేవ చేద్దాం”, అంటూ సదరు సేవల్లో మునిగి తేలుతున్నారు., కొంతమంది తెలివైన వాళ్ళు.
యిలా మనం ఆలోచించుకుంటూ పోతే – ఇంతకూ దేముడున్నాడా లేదా అనే పాతప్రశ్నే మన ఎదుటనిలబడుతుంది.
తరతరాలుగా తీరుబడిగా వున్న మహానుభావులంతా , తలలుకొట్టుకున్నా ఎటూతేలక ఉండిపోయిన సమస్య యిది,ఒక్కటే ననిపిస్తుంది,- నామట్టుకు,
యీ పాడుప్రపంచంలో ఎవరి వసరం ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేం- అందుకే ఎందుకైనా అటు దైవాన్ని, యిటు మానవుడిని కూడా మంచిచేసుకోవటం మంచిది. దీనికి మీరు “తటస్థ లౌకిక ధర్మం” అని నామకరణం చేసేనా , నాకు అభ్యంతరమేమీ లేదు, అందుకమే – నేను “కాఫీహోటల్” నేమ్ బోర్డు నడుమ మురళి వాయిస్తున్న మురళీకృష్ణున్ని, ఆయుష్కర్మశాల బోర్డు మధ్య యిబ్బంది పడుతున్న శ్రీరామచంద్రునకు – ఆ దారంట పోతున్నపుడల్లా ఒక నమస్కారం పారేస్తుంటాను.,
“ఆ విసిరే నమస్కారమేదో – దేవాలయానికి పోయి విసరకూడదూ” అని మీ బోటి భక్తులు కోప్పడతారని నాకు తెలుసు. దేముడనే వాడిని – రాతి గదిలో ఖైదు చేసి, పారి పోతాడేమోనని ముందు ఇనుప కటకటాలుంచి, ఆపైన ఓనామాలయ్యవారిని కాపలాకూడా ఉంచి, ఆఖైదీలాంటి దైవాన్ని చూపించడానికి టిక్కెట్టుకూడా బిగించారే – యిలాంటి స్థితిలో అస్మదాదులకు ఆలయప్రవేశం అంత సులభమా.. చెప్పండి ఎలానూ దైవదర్శనానికి పోతూ రిక్తహస్తాలతో పోకూడదనే నియమం ఒకటి అఘోరిస్తోంది కదా,.. కనీసం పావలా కదళీఫలాలు ఒక కొబ్బరికాయ కొనకతప్పదు కదా. తీరా ఒక పూట పస్తుండైనా యీ సరంజామా అంతా తీసుకుని పోయి నా మాట తీర్చి దిద్దిన ఆచార్యులవారికి అర్పించుకోవలసిందే కానీ, మనం అర్పించిన అరటిపండు నోరు విప్పి తినకపోతే పోయె, - కన్నెత్తైనా చూడడు కదా, ఆ దైవం. యీ మాత్రం భాగ్యానికి ముప్పావల డబ్బులు దండుగెందుకు ముప్పావలా అంటే మాటలా – నాలుగు రోజులు కూరఖర్చు ఒడ్డెక్కుతుంది.
అందుకనే వుంటే ఎక్కడున్నా దేముడు – దేముడే కనుక , నైవేద్యం బెడద, పైసా ఖర్చు, రద్దీ లేకుండా తీరుబడిగా దర్శనమిచ్చే – కాఫ్కాలయం – ఆయుష్కర్మశాల యిత్యాది బోర్డులపై వెలసిన దైవస్వరూపాలకే నమస్కరిస్తుంటాను.
ఏమైనా నాకు మనిషంటే – దైవం కన్నా భయం,భక్తి, ఒక అరతులం అధికం అని బల్లగుద్ది మైకు లేకపోయినా అందరకూ వినబడేట్లు కేకేసి చెప్పగలను, యీ విషయంలో మాత్రం అబద్ధంఆడినా కలిసొచ్చేది యేమీలేదు, కనుక అబద్ధం ఆడి అనృతదోషం కట్టుకోవలసిన అవసరం లేదు నాకు.
మీరూ – మానవులే కదా.. యిలా అనడం ధర్మమా.. , సబబా, అని ఎవరైనా అనడానికి కొంత ఆస్కారం వుంది, సవినయంగా , దానికి కూడా కారణం మనవి చేసికుంటున్నాను.
నేనూ మనిషినేనని ఎప్పుడూ అనుకోలేదు, కానీ పోయిన ఎన్నికల సంబరంలో ఓటర్ల జాబితాలో నా పేరు నమోదయి వుందని తెలిసిన తరువాత నేనూ మనిషినేనన్న దురభిప్రాయం నాలో లీలగా కలిగింది.ఆ సమయంలో నే కొందరు మాన్యులు కొద్ది సెకెండ్లు పాటు నన్ను మానవుడిగా గుర్తుపట్టడం జరిగింది. అటు తర్వాతగానీ , అంతకు పూర్వం కానీ నేనూ మానవుడినేనని భ్రాంతిపడే అవకాశం కలగలేదు.
పోనీ – నా భార్య కూడా నన్నెప్పుడు మానవుడిగా చూడలేదు, అది మీరే నా దైవం అంటుంది, మనం – మన కనీస అవసరాలు తీర్చేవరాలు యీయకపోయినా యేదో విధంగా అతన్నే దైవమనీ నమ్ముతున్నాం కదా,.. అలానే సంవత్సరానికి ఒక చీర కూడా కొని ఈయకపోయినా ఆమె ఆ మాట మాత్రం మానదు.
తెలుగు సినిమాలు అందులోనూ – యిటీవలవి చూసీ అలా అనడం , నటించటం నేర్చుకుందేమోనని మీరు భ్రాంతి పడనక్కరలేదు.
ఆమెనెప్పుడూ నా వెంట సినిమాకు రమ్మని నేను ప్రార్ధించనూ లేదు – ఆమె ఎప్పుడూ తన్ను తీసుకుపొమ్మని నన్ను అర్ధించనూ లేదు. ఆ పాఠం ఏ దుర్ముహూర్తానో, వాళ్ళ అమ్మ, అమ్మమ్మల వద్ద జాయింటుగా నేర్చుకుందట, ఆ పాఠాన్ని పోనీయకుండా మా పెద్దదానికి నేర్పుతోంది, దానికి మొగుడనేవాడు దొరికేసరికీ మరి రెండు పంచవర్ష ప్రమాళికలుదాటి పోవచ్చు. అప్పటికి యీ పాఠం దాని ఒంటపడుతుందని మా ఆవిడ అభిప్రాయంకూడా..
మన వారి ఉపన్యాసంలా , ప్రస్తుతవిషయాన్ని వదలి చాలా దూరం వచ్చేశాం, - యిక యీ ఉపాఖ్యానాల గొడవ కట్టిపెట్టి అసలు నా గొడుగు గొడవకు వద్దాం.
నాకు ప్రాణప్రదమైన గొడుగు – నా మనసు ఆక్రమించి నన్ను నడిపించే గొడుగు – ఇరవై సంవత్యరాల నా జీవితంలో ముడివేసుకున్న నా గొడుగు – ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాయమైంది. నా గుండెల్లో బండ పడింది. అకస్మాత్తుగా భౌతిక జగతి నా ముందు నశించిపోయి నట్లయింది.
మా శ్రీమతి – స్వతంత్రించి తాకట్టు పెట్టేసిందేమోనని, కోపంతో నాకు వచ్చిన దుర్భాషలన్నీ వరుసక్రమం లేకుండా....ప్రయోగించాను. అది – పాపం నెత్తి బాదుకుంటూ- తనకే పాపం తెలియదని – నా మీద ఒట్టేసిందాయె. యింకేం చేసేది-
పోలీసుకు రిపోర్టుయిస్తే సరి, ..అన్నాడు... ఎవరో అపరిచితుడు- యీ గొడువ ఒక పరిచయస్తునితో చెప్పుకుంటుంటే ప్రక్కనుంచి,
నా గొడుగు నాకు తిరిగి చేరకపోయినా, వారిని వదిలించుకునేసరికీ తాతలు దిగివస్తారు.
అందుచేత నేనే స్వయాన పరిశోధించదలచుకున్నాను, అందుకు ప్రాతిపదిగా దిట్టమైన అపరాధపరిశోధన నవలలు చదివేను. కోట్లకొలది గుట్టలలో నున్నా – నా బుట్టమార్కు గుబ్బగొడుగును యిట్టే గుర్తుపట్టగలను. అదృష్టమే నన్ను వరిస్తుందో ,దురదృష్టమే నన్ను పరిహసిస్తుందో, నేను చెప్పలేను కాని దొరుకుతుందనే ఆరని ఆశతోనే అన్వేషణ సాగిస్తున్నాను. మీరు కూడా యీ నా ప్రయత్నంలో శ్రమ నుకోకుండా సహకరించాలి.నా గొడుగును మీరు గుర్తుపట్టడానికి వివరాలు కూడా దిస్తున్నాను.
హేండిల్ విరిగుంటుంది,
రెండు కమానులు విరిగి – వంగి వున్నాయి.
డజనుకుపైగా మాసికలు – లెక్కపెట్టలేనన్ని చిల్లులు వుంటాయి. యీ వివరాలు గల నా గొడుగు ఆచూకీ తెలిస్తే మాత్రం నాకు తెలియచేయవలసినదిగా అర్ధిస్తున్నాను.- బహుమానంగా మీకు మీరు కోరినన్ని నమస్కారాలు (పైసా ఖర్చులేనివి కనుక) అర్పించుకుంటానని హామీయిస్తూ ప్రార్ధిస్తున్నాను. మీ పనుల తొందరలో నా మనవి – మరచిపోవద్దని మనవి చేసుకుంటున్నాను.
మరచిపోకండి - మరచిపోరు కదూ......

Sunday, December 18, 2011

శాపగ్రస్త





శాపగ్రస్తప్రచురణ ఆంధ్రప్రభ వార పత్రిక తేదీ... 8-6-1964

పగిలిన అద్దాన్ని పట్టుకుని అఘోరిస్తూ కూర్చోవడం వివేకమనిపించుకోదు ఆ మాటే కొన్ని వేలసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంకా ఆ బీటలు వారిన అద్దాన్నే పట్టుకుని దేవులాడేవారిని ...ఏమనుకోవాలి...
ఏమిటో అ మనస్తత్వం ఊహకందదు,ఆ మమకారానికి పొలిమేర, ఆ అంతర్యానికి అవధి లేదు కాబోలు,..అంతే ..అలానే అనుకోవాలి మరి,...
అట్టివారి వరుసలోనే నిలుస్తుంది తరళ కూడా.....
తొలిసారిగా ,పెళ్ళిచూపులనాడు,ఒక ప్రత్యేక ఆశక్తితో , పవిత్ర భావనామిళితమైన ద్రుష్ఠితో వెన్నెల – తేనె హ్రుదిలో వరదలై పారుతుంటే మాయసిగ్గు తెరలు, తెరలుగా ఆమెను ముంచివేస్తుంటే ఆ ఆనందానుభూతికి ఆగలేక వూగిపోతూనే అతని పాదాలను చూసి,
ఎంత చక్కని పాదాలు ... ఈ పాదాలను జీవితాంతంవరకు అర్పిస్తూ ,జన్మ చరితార్ధం చేసుకోవాలి అని అనుకున్నది, తరళ,..
అతని చూసీ చూడని చూపులు, వెన్నెలతుంపరలై ఆమె చుట్టూ విరజిమ్ముకుపోయాయి, ఆమె బుగ్గలపై నునులేత సిగ్గు పరుగుతీసి, చిన్నగా పెదవులపై జారి, వింతగా సొగసులు పోయింది, సోగకన్నులు తారకలై అమరగానం చేస్తుంటే పిచ్చి హ్రుదయం శ్రుతివేస్తూ పారవశ్యంలో పడింది.
అబ్బ .... రత్నాకర నిర్గత దుకళలా ఎంత అందంగా వుంది ఈమె, అదృష్టవంతుడిని అని అనుకుని మురిసిపోయాడు బలరాం.
అంతే,.. అంతకుమించి తను ఆలోచించలేదు. అతని భావనలన్నీ ఆ పరిధిలోనే పరిభ్రమించాయి.
ఆ విధంరా పెళ్ళిచూపులు మురిసాయి,ఆ మురగంపులోంచే – ఇచ్చిపుచ్చుకోవడాలు లాంఛనాలు ఆరంభమయ్యాయి,.
వ్యవహారమంతా పక్కా వ్యాపారసరళి లోనే సాగినా ఇరువర్గాలవారు ,కొంతలో కొంత , సామరస్య ధోరణిని ప్రదర్సించడం చేత – శుభం అనే పెద్దల మాటలతో ముగిసంది,..
ము హూర్తం కూడా , మగపెళ్ళివారి వీలుననుసరించే నిశ్చయించబడింది, అప్పటికి రెండు నెలల వ్యవధి వుండుటచేత ,నాలుగూ కూర్చుకోవడానికి అవకాశం కలిసివస్తుందనే అభిప్రాయంతో ఆడపెళ్ళివారు కూడా సంతోషించారు. ఇంకేముంది – పిచ్చి తరళ ఆనందం పగ్గాలు లేకుండా పోయింది.
ఏం, పెళ్ళికూతురా , అదృష్ఠమంటే నీదేనే, మేలమాడారు స్నేషితులు.
అలా కలిసిరావాలి కానీ – కాళ్లరిగేటట్లు తిరిగినా , ఒళ్ళు తిరిగేట్టు కలలుగన్నా-కల్యాణం కలిసి వస్తుందటమ్మా,.. అని సూత్రీకరిచారు. ఇంకా గుండెలమీద కుంపట్లా కూర్చున్నా కల్యాణయోగం కలిసిరాని తమపిల్లల దురదృష్ఠాన్ని నిందించుకుంటూ,అమ్మలక్కలు.
అప్పుడే తరళకు తన చెవిలో మంగళవాద్యాలు మారుమ్రోగినట్లయింది, కర్పూర వాసనలు కలవర పెట్టినట్లు,కాబోయె భర్త కొసరు చూపులు,తన వెన్నంటి తరుముతున్నట్లు,అనిపించసాగింది, సడిలేని నడిరాత్రి ఆమె లేత గుండెల్లో అతని అడుగుల సవ్వడి వినిపించినట్లయి, బెదరి, లేచి,అంతలోనే తనలో తాను సిగ్గుపడిపోయేది,.
అతని రూపాన్ని మదిలో భక్తితో, కొలిచేది,దప్పిక నిదుర మరచి ,అతని ధ్యసతో తీయగా గడపసాగింది.
కాని ఎందుకనో కుపిత విధి ఆమె ఆనందాన్ని చూసి సహించలేకపోయింది,తీరా పెళ్ళి పదిరోజులుందనేసరికి ,అనుకోని చిక్కులు వచ్చి పడ్డాయి. బలరాం అక్క నిర్మల తనకు రావలసిన ఆడపడుచు లాంఛనాల దగ్గర పేచీపెట్టింది.
ఇరువర్గాలవారు ఊరకనే పట్టుదలు పెంచుకున్నారు,మధ్యవర్తులఅనుచిత రాయబారాలతో వ్యవహారం బిగిసి – తుదకు తెగిపోయింది, ఈ అనుకోని సంఘటనకు కొందరు విచారించారు,మరికొందరు సంతోషించారు కూడా...
తరళకు- తన తలపై వోయి పిడుగులొక్కసారి పడినట్లనిపించి,,సొమ్మసిల్లి పడిపోయింది. మొదట ఈ వార్త ఆమె నమ్మలేకపోయింది, తరువాత నమ్మకతప్పిందికాదు, తను నమ్మిన సకలదేవతలు , ఆదుకోకపోతారా, అన్న నమ్మకం... ఆ నమ్మకం కూడా నశించడానికి అట్టే కాలం పట్టలేదు.
ఎప్పుడూ చిలిపిగా మాట్లాడే తరళ- దాదాపు మూగదైంది.
మానసికంగా బలహీనుడైన బలరాం కోరికలుతొందరిస్తున్నా ,ఆంతర్యం తరళ కోసం తపిస్తున్నా- మనసులోని వాంఛను పెదవి విప్పి చెప్పలోకపోయాడు, క తన సుఖంకోసం పెద్దలను ఎదిరించేదేముంది- తన పిరికితనానికి ,చేతకానితనానికి తనను తాను నిందించుకుంటూనే ,.. ఓ ముక్కూ మొహం ఎరగని ,చిన్నకళ్ళు, పెద్దపళ్ళు, లక్షణంగా కల అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు,..
తన పిరికితనం సంపాదించుకున్న సౌజన్యంతో బుధ్ధిమంతుడు,యోగ్యుడు,అన్న బిరుదులు- కూడా సంపాదించుకున్నాడు. –బలరాం...
కల్యాణతిలకం దిద్దుకోవలసిన తరళ నుదుటను కాటుకవాన కురిసింది. ఆమెకు జీవితసత్యం హాలాహాలమంత చేదుగాను కనిపించింది.
భగవాన్,.. నీ వెర్రిచేతలు అర్ధంకావటంలేదు, ఏంచేసానని ఇంత అన్యాయం చేసావు .. ఒక్క క్షణంలో ఉన్నత శిఖరం ఎక్కించి మరుక్షణంలోనే పాతాళలోకపు అంచులు చూపిస్తావు, బ్రతుకులో చింత నిప్పులు పోసి , చప్పుడు కాకుండా నవ్వుకుంటావు. మెళ్ళో మల్లెలమాలలు వేస్తూనే కళ్ళు పీకి పారేసి , అంతా నీ సుఖానికేనంటూ పీకనొక్కి పారేయటం నీకు వేడుకా , స్వామీ,.. అని తరళ ఎంతగానో వాపోయింది,...
క్రమంగా ఆమెకు బగవంతునిపై నమ్మకం పెద్దలంటే గైరవం నశించాయి.
పెద్దలందరూ స్వల్పవిషయాలకి ,పట్టుదలలుపోయి, తెంచేసుకున్నారే కానీ, ముహూర్తంనిశ్చయమైన దగ్గరనుంచి వధూవరుల హృదయాలు ఎంత దగ్గరయ్యాయో వారి అనురాగ బావనలు ఎంతబలంగా విలీనమయ్యాయో ఎవరూ ఊహించలేకపోయారు.
మసిబారిన వారి మనసులకు ఆ లేత హృదయాల ఆందోళన ప్రతిధ్వనులు వినిపించాయె కావు. వారి ముఖాలలో తొంగిచూసే ఆవేదన అధ్దాల వెనుక పాతుకుపోయిన ఖద్యోతాలలాంటి కళ్ళకు కనిపించాయి కావు.
ఉధ్ధరించవలసిన వారే – విధి విలాసం – అని ధర్మపన్నాలను వర్ణిస్తూ వేళ్ళు తన్నబోయే జీవితలతను పెరికిపారేశారు.
ఇక తరళ , బలరాం, నటిస్తూ బరువుగా జీవితయాత్ర సాగించడమో లేక నశించడమో తప్ప వేరే గతేముంది,..
తరళ తండ్రి శోభనాద్రి – పక్షంరోజులు తిరగకుండానే ,పంతంతో మరొక సంబంధం కుదుర్చుకు వచ్చాడు.
కానీ తరళ తన మనసును ఆక్రమించిన బలరాంను మనసులోంచి తప్పించలేకపోయింది, అతనిని మరచిపోలేకపోయింది, ఎన్నో విధాల ఆంతర్యంతో రాజీపడి , తండ్రి కుదిర్చిన సంబంధాన్ని అంగీకరించాలని భావించకపోలేదు. ఆమెకు శక్తి చాలిందికాదు, బలహీనమైన ఆమె ఆంతర్యమే బలంగా ఆమెను లొంగదీసుకుంది.
మనసులేని వారితో జీవితం ముడేసుకుని నటిస్తూ, జీవించడంకవ్వా మరణమే మేలు – అని ,ఎందరెన్ని చెప్పినా వినక , ఆ సంబంధం తిరగకొట్టేసింది తరళ.
కాల ప్రవాహం ఎన్నో మలుపులు తిరిగింది,. అయినా – శేషవర్జ్యంలా – ఏదో మూల ఆమె జీవితంలో దాగిన దుష్థవిధి.- మరలా మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది, మానసికాందోళనతో మంచమెక్కిమ శోభనాద్రి, కూతురు కల్యాణం చూడకుండానే కన్నుమూసాడు. ఆరని కన్నీటి స్రవంతి తోడుగా తరళ ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయింది.
మొగ్గలోనే ఆమె జీవితం వడగాలికి వాడి పోయింది, నాంది లోనే బరతవాక్యం పలికింది. నిజంగా ఇది ఎంత దురదృష్టం- స్వప్నాలు కరిగిపోయినా ,అవశేషాలు మాత్రం సూదుల్లా గుచ్చుకుంటూ మిగిలిపోయాయి.
ఆమెపై ఆమెకే అసహ్యం కల్గింది, ఒక విధమైన నిర్లిప్తత , నిశ్శబ్దత , ఆమెను ఆవరించుకున్నాయి. దైవం ఆమెకు శాపంగా ఇచ్చిన అందం సమాజం కనులకు మిరిమిట్లు గొలిపింది, కన్నుగీటి విషపునవ్వు నవ్వింది లోకం.
చేతికందబోయే జీవనమాధుర్యం నేలపాలయింది, సర్వం సంపూర్తిగా తుడుచుకుపోయింది, విధి తన్నితే ఆకుల్లా రాలిపోయే జీవితాల చుట్టూ ఎందుకీ వలయాలు – అనే వింత ధోరణి ఆమెలో రేకెత్తింది.
సంతోషమూ, సంతాపము, అందుకోలేని ఒక అనిర్వచనీయమైన మానసిక స్తితిలో మృత్యుశైతల్యం, స్ప్రుశించిన విరాగినిలా బయంకరంగా నవ్వుకుంటూ , ఒక్కటొక్కటిగా అధోలోకాల తలుపులను తెరచుకుంటూ నరకాన్ని వరిస్తూ ,పడిపోయింది.
ఏ స్పందనా లేని ఆమె అందం సమాజ కామానికి బలి అయిపోయింది.
బాటపక్క మొలచిన పూలతీగను అందుకోలేనిదెవరు – ఎందరో రసిపులు ,బైరాగులు, మేధావులు ,శుంఠలు, ఆమె జీవితంలోంచి నడిచిపోయారు. నిరంతరమూ ఆమె చూపులు ఏదో అమూల్యమైన దాన్ని పోగొట్టుక్కున్నట్లు దానికోసం వెతుకుతున్నట్లపగా చలిస్తూ కనిపించేవి. మనసు – దేనికోసమో రెపరెపలాడుతూ మూగవ్యధ అనుభవించేది.
ఒక పిల్లతల్లి అయి ఇక కొద్ది మాసాల్లో పిల్లనో, పిల్లాడినో ఎత్తుకోబోయే అర్ధాంగిని పుట్టింటికి పంపినప్పటినుంచి బలరాం – కాస్త నింపాదిగా ఊపిరి పీల్చుకోసాగాడు,ఎక్కడలేని స్వేచ్ఛ తనికి కలిగింది. బడివదిలిన తరువాత ఒకటోతరగతి పిల్లాడిలా మనసు అల్లరి లో పడింది. ఒంటరితనం ,దానిలోనుంచి జనించిన అస్పష్టమైన కోర్కెలు అతనిని స్తిరంగా వుండనిచ్చాయి కావు. అందుకనే కాబోలు నైతికపతనానికైనా , ఉన్నతికైనా ఒంటరితనమే దారితీస్తుందంటారు.విజ్ఝులు . నడిచిపోతున్న జీవితం మీద మోజు తగ్గడమే కాదు విసుగు కూడా కల్గింది. ప్రతి నిమిషం ఏదో ఒక కొత్తదనంకోసం , మార్పుకోసం, తహతహలాడసాగింది.
అవినీతి అని కొంచెం వెనుకంజ వేసినా, అసహజమని అనిపించలేదు. మానవ మనసు ఎల్లప్పుడు ఒకేదానితో సంతృప్తి పడదు. వైవిధ్యాన్ని కోరుతూనే వుంటుంది. వైవిధ్యంకూడా జీవితాలను సంపన్నం చేస్తుంది కాబోలు.
***
ఒకనాడు ప్రకృతి ముసుగేసుకున్న మసక చీకటి లో తనకు తెలియకుండానే తరళ గడప తొక్కాడు, బలరాం.
బలరాంను చూచి తన కన్నులను తానే నమ్మలేక పోయింది, మోసం చేస్తున్నాయేమో, అనుకున్నది తృటికాలం. కాని కట్టెదుట నిలిచి.తడబడి పోతున్న బలరాం ను చూచి, ఇంకా భ్రాంతి అని ఎలా అనుకోగలదు
భగవాన్ నీరు నిండిన కళ్ళతో నీ కమనీయ రూపం చూడలేకపోతున్నాను.చలించే చిత్తం తో నిన్ను తలచలేక పోతున్నాను. అయినా నా పేద పిలుపు నీచెవిని సోకిందా దర్శన భాగ్యం లభింపచేసావు. ఏనాడో అంతా పారేసుకున్నాను.... ఇంకా ఏది నాదగ్గర మిగిలి ఉందని నీకు సమర్పించుకునేది. అని తనలో తాను అనుకుంటూ కలువ రేకులలాంటి కనురెప్పలను భారంగా మూసింది.
ఆసమయంలో ... ఆమె బలరాం లో విశ్వ మోహనుడైన భగవానుని చూచిందో లేక బలరామే ఆమెకు భగవానుడో.... ఎవరికి తెలుసు..
ఆమధురానుభవానికి ఊగిపోతూనే రండి అంటూ బలరాం ను ఆహ్వానిస్తూ చేతులు చాపింది. కాని అంతలోనే మలినమైన తన శరీరం ఙప్తి వచ్చి ...చివాలున చేతులను వెనక్కు లాగేసింది.
ఇంతలో....- బలరాం ఆమెను దగ్గరగా తీసుకుంటూ కురులు సవరించాడు. ఆ లాలనతో గుండెల్లో దాచుకున్న కన్నీరంతా ఒకసారిగా ఉబికింది.
తలవని తలంపుగా ఆమెను కలుసుకునే అవకాశం లభించినందుకు సంతోషంతోనూ, అప్రయోజకుడినై ఇంత అందాన్ని స్వంతం చేసుకోలేక పోయానే అనే విచారంతోనూ, ఆమె ఆమెచంపల తడిని గమనించలేకపోయాడు బలరాం.
నిశ్శబ్దం వారి పవిత్రమేన సమాగమానికి సాక్ష్యంగా నిలిచింది. అతని స్పర్శతో ఆమె ఒడలెల్ల జలదరించింది. ప్రతి అణువు స్పందించింది. తొలిసారిగా సిగ్గు పడింది. అతని కోసం తాను ఎంతగా తపించిందో, ఒక్కసారి విప్పిచెప్పి తన మనోవ్యధను, గుండె బరువును వదిలించుకోవాలనుకుంది, కాని, ఒక్క మాట కూడా పెదవి విప్పి చెప్పలేక .....
అతని బరువైన కనురెప్పలు, చలించే పెదవులు చూస్తూ, వెచ్చని నిట్టూర్పులో పడి పిచ్చిదానిలా అయిపోయింది. మూగవిపంచిలా మానసము మూర్ఛనలు పోయింది. సిగ ముడి వీడి, నీలకబరిలోని విరులు అతని పాదాలపై జారిపడ్డాయి.
హోరుగాలి ఉధ్ధృతంగా వీచింది. చీకటి వికటాట్ఠహాసం చేసింది. దిక్కులు బరువుగా మూలిగాయి. తన మలినరూపమే... నగ్నంగా ఆమెచుట్టూ కరాళనృత్యం చేస్తున్నట్లనిపించింది. ఆమె మదిలో ప్రళయకాల పర్జన్యాలు గర్జించినట్లయింది.
ఒక్కసారిగా తన శక్తి నంతా కూడగట్టుకుని అతని కౌగిలిని బలంగా విదిలించేసుకుని అవనీ అంబరమూ కలసి ఊపే హోరుగాలిలో మృత్యువు లాంటి చీకటిని చీల్చుకుంటూ పిచ్చిదానిలా పారిపోయింది.
బలరాం నిశ్చేష్ఠుడయ్యాడు.
క్రమంగా ఆమె ఔన్నత్యం అర్ధమైన కొలదీ ఎంతగానో పరితపించాడు.తల నేలకేసి బాదుకున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రోశించాడు.
కానీ, ఏం లాభం?
తరళ జ్ఞాప్తి కి వచ్చి నపుడల్లా “శాపగ్రస్త” కాకపోతే అంత మహోన్నతమైన తరళజీవితం, ఎందుకంత అధోగతి పాలౌతుంది. అని నిట్టూరుస్తాడు.......బలరాం....బలంగా....
****

Thursday, November 10, 2011

నీట కలిసిన త్యాగం

శ్రీ ఆకుండి రాజేశ్వరరావు కధలు

నీట కలసిన త్యాగం


శ్రీ మలబార్ కేఫ్ కనిపించేసరికి కాఫీ తాగాలనిపించిది. కాఫీ తాగి చాలా రోజులయింది, జోరుగా అడుగులు పడుతున్నాయి, వెంటనే జ్ఞాపకం వచ్చింది, సడన్ బ్రేక్ పడింది, తూలిపడతానేమో అనుకున్నా, ఛీ.. ఏంపని ఈమాత్రం మనసు అదుపులో వుంచి,లాకప్పులో బిగించకపోతే పొదుపు ఉద్యమం నిర్వహించేదెలా, కేక లేస్తున్నా వినక , కోరికను అమాంతం సెడపచ్చి , లోపలకి కుక్కి ఒక్క కసురు కసిరి, విసురుగా నడక సాగంచాను.
అందరికీ తెనుగు సినిమా హీరో అంత మంచివాడుగా కన్పిస్తున్నా, మా ఆవిడకు మాత్రం చెడ్డవాడుగా ఎలా కన్పిస్తున్నానో, అనే విషయం త్రీవ్రంగా ఆలోచించినా తేల్చుకోలేకపోయాను, నేను తేల్చుకోలేని అనేకవిషయాల్లో అది కూడా ఒకటి. అప్పటినుంచి ఇంటికిపోయేకన్నా పార్కులో ఒంటిగా ఒక గంట గడపటం ఒంటికి మంచిదనిపించింది. అనేక అవసర అనవసర విషయాలు వరుసక్రమంలేకుండా అల్లరు, చిల్లరిగా షికార్లు కొడ్తుంటే పార్కులో ఓ మూలనున్న సిమెంటు బెంచీమీద ఒళ్ళు విరుచుకుని ఒకసారి కళ్ళునులుపుకుని తీరుబాటుగా కూర్చున్నా, బట్టతలాయన , మీసానఆసామి , యిద్దరూ పచ్చని తివాచీలాంటి గడ్డిమీద కూర్చని విడివిడిగా ఆలోచించుకుంటూ ఉమ్మడిగా బఠానీలు నముల్తున్నారు. తాము నిన్న చూసిన సినిమాలో వున్న సందర్బంలేని అసందర్భపు సన్నివేశాలగురించి , సినీపరిశ్రమ ఉన్నత ప్రమాణాలు సాధించవలసిన ఆవశ్యకత గురించి తర్జనభర్జనలు పడ్తున్నారు. గులాబీమెక్క ప్రక్కన కూర్చున్న విద్యార్ధిబ్రుందం , రష్యన్ రాకెట్ కంటె రెండు రెట్లు వేగంతో ముందుకు సాగుతున్న ధరలగురించి ,దేశంలో విద్యాప్రమాణాలు పడిపోవటందాకా అనేకవిషయాలమీద చిన్నసైజులో హైవాల్యూమ్ లో లెక్చరిచ్చి, దేశంపాడైపోతున్నందుకు వీలైనంతవరకు విచారం అభినయిస్తున్నాడు, జరీకండువా పెద్దమనిషి ఆయనతడబడేటప్పుడల్లా మాట ఎదురిస్తూ సాయం చేస్తున్నాడు.పక్కనున్న మధ్యవయస్కుడు ,మిగతానలుగురూ
మంత్రముగ్ధుల్లా వింటున్నారు
నటులు కావలసినవాళ్ళు రాజకీయాలోలపడ్డారేమో అనిపించింది, నాకు వారిని చూడగా,రేడియోకమ్మనిసంగీతం సరఫరాచేస్తోంది,ఈగొడవలమధ్యనే పాటకూడావింటున్నా,పాటవిని ఎంతమంది ఆనందిస్తున్నారో , లెక్కెడితే బాగుండును, అని అనుకుంటుండగా ఒక ముసలాయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు, మాసినపంచ,దానితోపోటీపడుతున్న లాల్చీ, అరిగిన చెప్పులు,పెరిగిన గెడ్డం, విరిగిన కళ్ళజోడు, యిదీ ఆయన ఆకృతి.
సమాజపు నుదుటిరేఖల్లా ఆయన నుదుటిరేఖలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, లోతైన కళ్ళల్లోంచి చురుగ్గాదేనికోసమో లేక ఎవరికోసమో వెతుకుతున్నట్లు పార్కంతా కలయచూచి ద్రుష్టిని నామీద కేంద్రీక్రుతం కావించాడు. గొంతు సవరించి
ఈ వూరేనా .. నాయనా.. అన్నాడు,పలకరింపులో అప్యాయత పలికింది.
ఆ... అన్నా ముక్తసరిగా....
రైల్వేలో ఉద్యోగమా...ముసలాయన ద్వితీయ ప్రశ్న...
కాదన్నట్లు తల అడ్డంగా తిప్పి ....ఫ్రయివేట్ కంపెనీలో గుమస్తాగిరి ...అన్నా...ఆయన అదోలా నవ్వేడు, ఆ నవ్వులో ...నువ్వు ఎంత దురధ్రుష్టవంతుడివి ...అన్న భావం..పలికింది.
ఏ ఉద్యోగమైతేనేం బాబూ..మనిశికి కావలసింది మంచిమనసుకానీ, ధనం,హోదా కాదుగా, నశ్యంపీలుస్తున్న ముసలాయన సూత్రీకరణ..
మీరేదో పాతకాలంనాటి మాట అంటున్నారు కానీ, ...అర్ధం లేని బ్రతుకు వ్యర్ధంకదండీ...అన్నా ఆయన కండ్లలోతులను చూస్తూ...
నిజమే కానీ, ఆమాటే మా నూటొక్కసారి మా తోటల్లుడుతో చెప్పేను. అంగీకరించేడు కాడు,. ఆయనంటాడు అర్ధం జీవిత పరమార్ధమయితే జీవితం నిరరధకమై అర్ధవిహీనమవుతుందని ...ఆయనొక కవి కూడా.. అన్నాడు ముసలాయన సాగదీస్తూ..

ఈ ఉరే అనుకుంటా మీది,.. అన్నాను సంభాషణ మార్చే ఉద్దేశ్యంతో..ముసలాయన్ని..
కాదు బాబు.. పక్క పల్లెటూరు..
పని మీద పట్నం వచ్చేరా...
ఏమని చెప్పేది బాబూ...నా అవస్త..నిన్ను చూడగానే ఆత్మీయుడిని చూసినట్లు వుంది..కొంతవరకు మనసు విప్పి నీ ఎదుట చెప్పుకుంటే గుండె బరువు తరుగుతుందేమోననిపిస్తుంది.పాలకోసం ఏడ్చే చంటిది,పెద్దదై పంచవర్షాలు దాటినా పెళ్ళికాని పెద్ద కూతురు ,ఎప్పుడూ ఒంట్లో బాగుండని ఇల్లాలు, మందులు మాకులు అప్పులు ఎంతని చెప్పేది వచ్చేరాబడి దమ్మిడీలేదు, చావలేక బతికున్నా, కంఠం బొంగురుపోయింది. కనుకొలకుల్లోంచి రెండు అశ్రుబిందువులు జారి గడ్డంలో మాయమయ్యాయి. ఒకసారి కళ్లుతుడుచుకుని రోగాలకు పేదలంటే అనురాగం కాబోలు,దానికి అర్జంటుగా మందు కొనవలసి వచ్చింది, ఏంచేసేది... చూస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ వూరుకోలేంకదా, ఈ సమయంలో పరిచయస్తుడైన ఒకరి సహాయంకోసం వచ్చాను, కాని, విధి ఎదురు తిరిగింది,ఆయనకి బదిలీ అయ్యిందట మొన్ననే,.. ఇది నా ఖర్మ కాకపోతే యింకేమిటి.. ఇంకేదో చెప్పబోయి సంకోచిస్తు ఆగిపోయారాయన.
పాపం.. అనుకున్నా.. విధి ఎడా పెడా విసురుతున్న దెబ్బలకు తట్టుకుంటూ, కష్టాలపరంపరలో నికృష్ట జీవితం గడిపే ఆయన దురద్రుష్టానికి జాలివేసంది, జీవిత సంధ్యాసమయంలో ప్రశాంతత కరవైన జీవితం భరింపరానిదనిపించింది, .
ఆయన నావంక సందేహంగా చూస్తూ ..యీ స్తితిలో మరోలా అనపకోకుండా కొంచం సహాయం చేస్తే నీ మేలు ఈ జన్మ లో మరిచిపోలేను, ఎదుటి హృదయాన్ని అర్ధం చేసుకోగల ఆర్థతైన హృదయము కలవాడివి, ..అన్నాడు.
నా జవాబు కోసం ఆయన ఆశతో , ఆత్రుతతో ఊపిరి బిగబట్టి నిరీక్షిస్తున్నాడు, ఆలోచించాను నేను మాత్రం ఒకరికి సహాయం చేసే స్తితిలో వున్నానా..అని కాదు కానీ, ఆయన కన్నా మెరుగ్గా వున్నట్లనిపించింది నా స్తితి, తోటి మానవుడికి అందులోను వ్రుధ్ధుడికి , నోరు విడచి అర్ధించిన వానికి.. లేదని చెప్పటం ఎలా... సభ్యత సంస్కారం అడ్డు తగిలింది.
చూడండీ.. నేనేదో.. సహాయం చేస్తున్నాననుకోకండి, అవసరానికి యిది వుంచండి, అంటూ .. రెండు రూపాయలు అతని చాతిలో వుంచా...
ముసలాయన కళ్ళు మెరిసాయి, సంతసంతో ముఖం వికసించిది, అలముకున్న విషాదం అంతమసింది.
వెన్నలాంటి మనసు దాచుకున్నా దాగదని నాకు తెలుసు,..వెయ్యేండ్లు వర్ధిల్లు నాయనా అంటూ దీవించి వస్తాను బాబూ.. అంటూ లేచి మెల్లగా నడక సాగిచేడు,
అబ్బ,.. జీవితం ఎంత భయంకరమైనది.. పీడకల అనుకున్నా....
అరే,..యిక్కడా అఘోరిస్తున్నావు.. ఓరి ,.. చవటా... నీకోసం ఎంతని తిరగనురా,... అన్న శర్మ పొలికేకతో, ఊహాలోకంలోంచి ఇహలోకంలోకి వచ్చి పడ్డాను,...
ఇహ ..రా.. అలా వుందే ముఖం అడిగాడు శర్మ.. అబ్బే .. ఏంలేదు పద అన్నా లేస్తూ.. ఇద్దరం జనాన్ని చీల్చుకుంటూ నడుస్తున్నాము...మలబార్ కేఫ్ లోకి దారి తీన్తూ,.. వేడి కాఫీ పోస్తే కానీ నీకు చురుకు తగిలే టట్లు అన్నాడు శర్మ...నువ్వు తాగరా నేను మానేశాను,... అన్నా బతిమాలే ధోరణిలో ..
గుడ్లు తేలేసి ,... చూసాడు శర్మ, నావైపు అదోలా ....
ఒక నిమిషం తర్వాత తేరుకుని ఎప్పటినుంచి ఈ దురలవాటు అమలు.. అట్టే వాగక, ముందునడు అంటు జబ్బుచ్చపకున్నాడు శర్మ నే చెప్పేది వినకుండా..రాక్షసుడిలా నాచే వ్రతభంగం చేయిస్తున్నశర్మను పబ్లిక్గా తిట్టలేక లోలోన తిట్టుకున్నాను,.
ఇద్దరం చరో కుర్చీమీద కూర్చున్నాం, ఇందాకటి పల్లెటూరి ముసలాయన కాఫీ ముగించేసాడు. శర్మ కాఫీకి ఆర్డరిచ్చాడు, 75 నయాపైసలు బిల్లు ముసలాయన ముందుంచాడు సర్వర్,బిల్లు చూసేసరికి నా ముఖం నయాపైసంత అయ్యింది, ముసలాయన బిల్లు చెల్లించి దాటిపోతున్నాడు,ఆయనవైపే వెఱ్రిగా చూస్తున్నా నేను.
ఏమిటీ,.. ఆ ముసలాయనవైపే అలా చూస్తున్నావు.. కొంపతీసి నువ్వేమి సమర్పించుకోలేదు కదా,..అనుమానంగా నావైపు చూస్తూ అన్నాడు శర్మ..
అబ్బెబ్బె,..అన్నా..అభధ్ధమాడేస్తు,..
ఒరేయ్,.. చవటా.. నీకు అభధ్దమాడటం చాతనయితేయింకేం...చెప్పు..ఎంత సమర్పించుకున్నావు,..అని నిలదీసాడు శర్మ..టేబిల్ పై వున్న కాఫీ వంక చూస్తూ ఏదో కొంచెంలే ...అని గొణిగాను..
ఏడవలేకపోయావు..కసిరాడు శర్మ..అర్దంకాక అయోమయంగా చూసాను శర్మ వైపు..
ఆ ముసలాయన సంగతి నీకు తెలియదురా,....నిన్ను, నన్నే కాదు , మనలాంటి వాళ్ళని పదిమందిని కొనేయగల స్తితిపరుడు,.. పల్లెటూర్లో పదెకరాల పొలం, తోట,దొడ్డీ,వడ్డీ వ్యాపారం,అన్నీ వున్నాయి, ఇద్దరు కొడుకులు , ఒకరు డాక్టరు,రెండోవాడు ఇంజనీరు, అన్నాడు శర్మ,..కాఫీ ముగిస్తూ,...అంతులేని ఆశ్చర్యంతో,..ఒక్కగుక్కలో కాపీ తాగి శర్మననుసరించాను,..
నా అనుమానం నివ్రుత్తి చేసుకునే వుద్దేశ్యంతో అయితే అతనికా ఖర్మెందుకు,..అన్నా బిల్లు చెల్లిస్తున్న శర్మతో...
అదా,...అది ఆయన వ్రుత్తిట, ఒక వింత ప్రవ్రుత్తి,...నీలాంటివాళ్ళని వుధ్ధరిస్తుండటం నిత్యక్రుత్యం,..ఎవరేమనుకుంటే అయనకేం....అని మెట్లు దిగుతున్నాడు శర్మ...
కిల్లీకొట్టు దగ్గర కిల్లీ నముల్తు,..పొడుగాటి చుట్ట తెగ కాలుస్తున్న ముసలాయన్ని చూసి,ముఖంతిప్పుకుని,విభిన్నమైన భావతరంగాలు ఉవ్వెత్తుగా లేచి విరిగిపడుతుండగా తడబడే అడుగులతో శర్మ ననుసరించాను.....