Tuesday, March 20, 2012

దాహం


దాహం
ఆకుండి రాజేశ్వరరావు

“ దాహం వేస్తోందిరా “ అన్నాడు బలరాం, నడుస్తున్న వాడల్లా ఠపీమని ఆగి,
ఆదిత్య అటు ఇటు ఓసారి చూసి, ముఖానపోసిన చెమటను తుడుచుకుంటూ “ పదరా బాబూ. నాలుగడుగులు ముందుకు వేస్తే
ఏదైనా చెరువు తగులుతుందేమో చూద్దాం” అన్నాడు లాలనగా.
బయలుదేరేటపుడు
తెరకప్పి చల్లగానే వుంది, అలా వుందనే బయలుదేరారిద్దరూ, కానీ తీరా వూరి శివారుల
దాటారో , లేదో, డేరా లాగేసి ఎండృ నడ్డి బద్దలుకొట్టసాగింది, ఏలినాటి శని వదిలేసిన
అదృష్ఠవంతుడిలా మిడిసిపడసాగింది.
ఇద్దరూ నడుస్తూనే
ఉన్నారు, నీరు దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూనే ఉన్నారు, కనుచూపు మేరలో దొరికే
దారి కనబడలేదు, ఓపికలేకపోయినా నడకతప్పటం లేదు.”ఆకలేస్తున్నదని రొట్టె తిన్నా, లేకపోతే యిదత
దాహం పట్టుకోకపోను “ బలరాం రొట్టె తిన్నందుకు విసుక్కున్నాడు. అతని బిక్కముఖం
చూసేసరికి ఆదిత్యకు నవ్వు వచ్చింది, జాలి కూడా వేసింది. ఆసమయంలో నవ్వటం బాగోదని
కొద్దిగా జాలిపడి ఊరుకున్నాడు.
“ పాపం: ఆకలేస్తోందని రొట్టె తింటే , ఆకలి చల్లారిందే
గానీ దాహం పీకపట్టుకుని కూర్చుంది.” ఒకటి చల్లారింది
అనపకునేసరికి మరొకటి చల్లగా రేగుతుంది కాబోలు ఒక్క నిమిషం కూడా స్తిమితంగా
వుండటానుకి వీల్లేదు,ఎప్పుడూ ఏదో ఒక సమస్య , ఏదో ఒక అలజడి, ఒక్క దేహమే కాదు, గేహం,
దేశం స్తితి కూడా అలానే వుంది.
అయితే శాంతి , సుస్తిరత అనేవి అందమైన కలలా : మానవుడు ఎన్న టికీ వీటిని సాధించలేడా ? నిజమైన శాంతి మానవునకు ఎలా
లభిస్తుంది ? బలరాంకి ఆకలి చల్లారి దాహం రేగింది. మరి దాహం తీరితే ...
ఇంకేమిటి పుట్టుకొస్తుంది. ఆదిత్య తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు. బలరాం నాలుకతో
పెదాలు తడుపుకుంటూ దీనంగా నడుస్తున్నాడు, నరాలు తోడుకోసాగాయి, కాళ్ళు, చేతులు
విలవిలలాడసాగేయి, నోరు పిడచకట్టింది, ముఖం నల్లబడింది, వాడి వైఖరి చూసేసరికి
ఆదిత్యకు కూడా దడ పుట్టుకొచ్చింది కొంపతీసి,... ఆపైన ఊహించడీనికే భయమేసి
మానుకున్నాడు.
భాద పడటమే తప్ప ఆ పరిస్తితిలో తను
మాత్రం ఏం చేయగలడు కనుక : మానవుడి చేతకానితనం తొలిసారిగా అవగతమైంది, ఆదిత్యకు. “ నీటిబొట్టు రూపాయన్నా సరే –
విసిరి పారేసి తాగాలనిపిస్తోందిరా “ నిజమే – బలరాం దగ్గర అంత డబ్బు జేబులోనే మూలుగుతోంది, కానీ
దిక్కులేని రోడ్డుమీద నీరు దొరికేదెలా: “ యిదొక అనుభవంరా
చిట్టితండ్రీ ,.. అనుభవం. “ యిప్పుడు చెప్పు, నువ్వు
అహర్నిశలు తపించే డబ్బుకు ఎంత విలువుందో “ బలరాం ను నిలదీసి సూటిగా ప్రశ్నించాడు ఆదిత్య.
“పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటం” అని కసురుకున్నాడే కానీ,
అతనిలో జిజ్ఞాసమాత్రం రేగకపోలేదు. ఆ క్షణాన తన ధనం, సౌందర్యం, అధికారం అంతా ఎంత అల్పంగా
కనిపించాయో, వివేకం, కూడా అంత అల్పంగానే తోచింది. దాహం – దాహం – దాహం, ఒకటే దాహం,
- దుర్దాహం, బలరాం కళ్ళు మూసకుని గట్టిగా నిట్టూర్చాడు, ఆదిత్యకు ఏం
చేయడానికీ పాలుపోలేదు. అంతలో – ఎంత
అదృష్టమో మరి – తోటచాటున ఎండను వెక్కిరిస్తూ నిలబడ్డ ఏతం మాను కనిపించింది.
సంతోంగా కేక వేస్తూ బలరాంకి
చూపించడమే తరువాయి, ఒక్క అదటున రోడ్డుదిగి
కుక్కపరుగు ప్రారంభించాడు. మడిగట్ల మీద కన్నా, సర్కస్లో తీగపైన నడవటం తేలిగ్గా
ఉండొచ్చుననిపించింది, ఎలా అయితేనేం, పడుతూ, లేస్తూ, చివరకు ఏతం దగ్గరకు చేరుకున్నారు. నూతిలో నీరుంది, పైన
ఏతం బుద్దిమంతుడిలా నిలబడింది. కానీ నీరు తీయడానికి గూన మాత్రం లేదు, ఎందుకు
వుంటుంది.. ? ఎవళ్ళూలేని ఏ మడిలో వుంటుందనుకోవడమే తెలివితక్కువతనం. బలరాం
ముఖంలో నిస్ప్రహ హద్దు దాటేసింది. ముఖం కాలుతున్న అప్పడంలా ముడతలు పడింది.
అంతలో వారిద్దరి లో ఎవరు చేసుకున్న
పుణ్యమో, కానీ – రేక – అందులోనూ తాటిరేక, తుప్పవారగా కనిపించింది. ఆ సగం, సగం,
ఊడిపోతున్న రేకే వారికి నవనిధులూ ఒక్కసారి దొరికినంత సంతోషాన్ని కలగచేసింది. తీరా
రేక తీసి చూసేసరికీ బలరాం కుప్పలా కూలిపోయాడు. దానికితాడులేదు. క్షణం కిందట ఉబికిన
ఆనందం, చిటికెలో మాయమైంది. ఆ స్తానంలో తీరని సంతాపం తిష్ట వేసుకుంది, ఏమిటీ
వెలుగునీల వింత ఆట, బలరాంకి శివమెత్తినట్లయింది. కనిపించని దైవాన్ని, కనిపిస్తూ
చేతులు నులుపుకుంటున్న ఆదిత్యను కలిపి కసితీరా తిట్టాడు.
ఏదో ఒకటి చేయ్యాలి, నీరు సంపాదించాలి.
ఏదిత్య బుద్ధి సమయానికి దివ్యంగా పనిచేసింది. పక్క మడిలోని మెక్కలు అతని బుద్ధిని
రెచ్చగొట్టాయి. “ రక్షించాయి “ అని నాలుగు మొక్కలు ఊడబెరికి నార తీయడం ఆరంభించాడు. బలరాం
నూతివారగావున్న జానెడు నీడలోన చతికిలబడ్డాడు. దూరాన రోడ్డుమీద గచ్చపిక్కరంగు కారు
ధూళి రేపుకుంటూ ఝూమని పరుగెత్తసాగింది.
“ ఒరేయ్ సింహాలు కార్రా“
అన్నాడు ఆదిత్య మతి పోయిన వాడిలా, రేగుతున్న ధూళినీ, సాగిపోతున్న కారునూ
చూస్తూ , చేతిలోని గోగు కఱ్ఱలను క్రింద జారేస్తూ. బలరాం ఒక్కసారి ఉలిక్కిపడి, “ అరెరె ! ఎంత పనయింది,
నేరకపోయి రోడ్డు దిగి వచ్చేశాం, ఆ రోడ్డు మీదనే మరొక క్షణం ఉంటే మహరాజు లా నీరు
దొరికేది “. “ నీరే కాదురా బాబూ! .. కాఫీ కూడా దొరికేది “ అన్నాడు ఆదిత్య.
“ అంతే కాదురా నాయనా ! దర్జాగా కారులో
పోయే వాళ్ళం కూడా – సింహాచలంతో ముచ్చట్లు చెప్పుకుంటూ, ఖర్మరా , ఖర్మ ! లేచిన వేళా విశేషం “ అని నొసలు కొట్టుకున్నాడు,
ఎన్నడూ ఖర్మ సిద్ధాంతంలో వీసమెత్తు కూడా నమ్మకం లేని బలరాం.
మళ్ళీ నార తీయడంలో నిమగ్నుడయ్యాడు,
ఆదిత్య , ఒలుస్తూనే అలవాటు ప్రకారం ఆలోచనలో పడ్డాడు, చేతులు పని చేస్తునే
వున్నాయి, బుఱ్ఱ ఆలోచిస్తునే వుంది, వేటి పని వాటిది, ఒకదాని కొకటి అడ్డులేదు,
లోచిస్తూ పనిచేయడం, పనిచేస్తూ ఆలోచనలో మునగటం అంత అభ్యాసం ఆదిత్యకు, .
బలరాంది ఉత్త దాహం, ఆఫీసరు గారిది ధనదాహం, సింహాలుగారిది
కీర్తి దాహం, దాహంలో కూడా విభిన్నరకాలు, అయితేనే, ! అన్నీ ఒకదాని కొకటి తక్కువ
కాకుండా సమానంగానే ఆడిస్తాయి కాబోలు. ఆదిలో సింహాలుగారికి కీర్తి దాహం లేనే లేదు,
ఫక్తు ధనదాహం మాత్రమే వుండేది, ఎటొచ్చి యీదరిమిలానే కీర్తి దాహం, పట్టుకుంది, ఎవరో
బోడి సన్యాసి “ కట్టె మట్టిలో కలిసినా ,
గట్టున మిగిలేది కీర్తి ఒక్కటే “ అని జనం చెప్పుకునే మాటలను
మననం చేసుకున్నాడు ఆదిత్య.
సింహాలు తండ్రి హయాంలో వారిదేమీ
చెప్పుకోదగ్గ స్ధితి కాదు, ఉన్నదల్లా ఒక్క మేడ మాత్రమే, ఆ మేడ ఉదయపు నీడలు ఇటు
వెంకటేశంగారి ఇంటిమీద, సాయంత్రపు నీడలు అటు రామేశం గారి ఇంటిమీద పడుతూ వచ్చేవి, పాపం
! ఎంతకాలం ఆనీడలు అలా పడుతూ వుండగలు కనుక, సింహాలు నడుం
కట్టేసరికీ ఆ రెండు నీడలూ వెంకటేశం , రామేశం గారి ఇండ్లని , తమలో కలిపేసుకున్నాయి.
ఇంకా మెడలు సారించసాగాయి. తదనంతరమే లోకం మింహాలుని చూసి చాటుగా ఉమ్మడం ఆరంభించింది,
యిలా కొంతకాలం జరిగిపోయిన తరువాతే సన్నాసి ఉపదేశం, సింహాలు మారిపోవడం జరిగింది,
అయితే , సన్యాసి ఉపదేశం చేస్తుండగా చూసినవారెవ్వరూ లేరు, అంతా సింహాద్రి నోటిమీదగానే
ఆ మాటను విన్నారు, అందులో సమదేహం ఎవరికీ కలగలేదు, ఎందుకుకలుగుతుంది ? పిల్లికి బిచ్చం పెట్టని
సింహాలు తెగ దానాలూ, ధర్మాలు చేస్తుంటే...
ఆదిలో , ఆదిత్య, బలరాం యిద్దరూ
సింహాలులో వచ్చిన మార్పు చూసి చకితులయ్యారు. తమకు అర్ధం కాని స్వార్ధం ఏదైనా
వుందేమోనని అపోహపడ్డారు కూడా, కానీ తరువాత అది వట్టి అపోహ మాత్రమేనని తేల్చుకోక
తప్పింది కాదు, సింహాలు కుడి, ఎడమ, చూడకుండా, వెనుకా , ముందు ఆలోచించకుండా,
ధర్మకార్యాలు చేస్తున్నాడాయె, గుళ్ళు కట్టించాడు, గోపురాలు నిర్మించాడు, అగ్ని,
వరద , యిత్యాది సకలరకాలైన భాధితులకు సహాయం చేసాడు, అనాధ శరణాలయాలు, ముముక్ష
జనసమాజాలు, గో సంరక్షక సంఘాలు, యిలా ఆయన చేతి చలవవల్లనే వెలిశాయి, ఇది పద్యం, అది
గద్యం, అనే భేధం చూపకుండా , పదిమంది కవుల పుస్తకాలు అచ్చప వేయించి దేశం మీదకు
విసిరేసి, కీర్తిని అచ్చులో బిగించేసుకున్నాడు.
“ సింహాలు కీర్తి చూసి
సిగ్గుపడి, సింహాలన్నీ గుహల్లోకి పారిపోయి నివసించసాగాయి “ అని ఒక కవిత ఘోషిస్తే , మరొక వచన రచయిత అణు బాంబులను కూడా
మన సింహాలు కీర్తిని బద్దలు కొట్టలేక తమ గుండెలను తామే బద్దలు కొట్టుకుంటున్నాయి
అని కంఠం బద్దలు చేసుకున్నాడు.
“కఠినుడు, దుర్మార్గుడు” అని కసితీరా తిట్టిన లోకపు నోరే,” ధర్మాత్ముడు, దయాదాక్షిణ్యాల ముద్ద “అని నోరారా
కీర్తించసాగింది, యిలా సింహాలు గత నల్లటి జీవితంపై, తెల్లటి కీర్తితెర కప్పబడింది.అప్పటికల్లా
అతని ఆస్తి మూడు వంతులు కరిగిందనే చెప్పుకోవాలి, మిత్రులూ, బంధువులూ , అంతా పిచ్చి
వ్యామోహంలో పడి చెడిపోతున్నాడని భాధ
పడ్డారు, మందలించారుకూడా,..
ఆదిత్య కూడా తన
స్నేహ ధర్మాన్ని , చనువునూ, పురస్కరించుకుని” దేనికైనా ఒక ఙద్దు వుంది, నీ సంగతైనా
చూసుకోకుండా యింకా యిలానే సంచరించావంటే – చివరకు చేతికి చిప్ప మిగులుతుంది, యీనాడు
నీ ఇంట్లో త్రేన్చిన వారే ఆనాడు నీ
నిట్టూర్పులను విని వికటాట్టహాసం చేస్తారు, కాస్త జోరు తగ్గించు , పాడయిపోకు” అని మందలించాడు.
ఆ మాటలను శాంతంగా
విని , సింహాలు” పాడైపోడానికా ! కానే కాదు, యిదంతా బాగుపడ్డానికేనోయ్ ఇంతకన్నా బాగుపడ్డానికి
మార్గంలేదుగా “ అని అంటూ భక్తి తన్మయత్వంతో కళ్ళుమూస్తూ అదోలా నవ్వాడు. మాట
మృదువుగానే వినిపించినా , నవ్వు మాత్రం భయంకరంగానే వినిపించింది. ఆదిత్యకు ఏమీ
అర్ధంకాలేదు, విసురుగా వచ్చేశాడు.
తీసిన నారంతా
ఒకదానికొకటి ముడివేసి, తాడుగా చేసి రేకకు కట్టాడు, ఆదిత్య, ఆవురావురంటూ రేక నూతిలో
వేశాడు బలరాం, రేక నీటిలో మునిగి నిండా నీరు నింపుకుంది, బలరాం రేక బయటకు తీయడం
ఆరంభించేసరికీ , తాడు జవజవ లాడటం ప్రారంభించింది, ఎక్కడ పుటుక్కున తెగి
వూరుకుంటుందేమోనని ఊపిరి భిగబట్టి తాపీగా , నిదానంగా లాగడం ప్రారంభించాడు, ఓ మూల
పెదవులు తడారి పోతున్నాయి, దాహం, దంచేస్తోంది, కొంపతీసి, ఖర్మం చాలక తాడు తెగితే! ఆ భీభత్సాన్ని
ఊహించలేకపోయాడు. సకల దేవతలకు క్షణంలో మొక్కుకున్నాడు.
ఎలా యితేనేం, రేక
నీటితో విజయవంతంగా బయటపడ్డది, ఉక్కిరి బిక్కిరవుతూ రేకడు నీళ్ళూ తాగేశాడు బలరాం,
ప్రాణాలు లేచొచ్చినట్లనిపించాయి, ముఖంలో కాస్త కళ వచ్చింది, పెదవులు విజయగర్వంతో
చిందులాడాయి. రెండోసారి రేక నూతిలోంచి తీస్తూ” తాడు బలంగానే వుందిరా , అది ఎక్కడ
తెగుతుందేమోనని భయపడ్డాను కాని .”
ఆదిత్య తాడును
చూస్తూ “తాడు అప్పుడూ, ఇప్పుడూ, ఒకే బలంగానే వుంది, పోతే వీడు
మొదటిసారి అంత భయపడడానికి , రెండోసారి భయపడకపోవడానికి కారణమేమిటి తాడు బలంగా
ఉన్నదని నమ్మకం కలగటమేనా! అంతే కాదు , కేవలం పరిస్థితి , మొదటిసారి తీస్తున్నపుడు తన
అవసరం తీరలేదు , అందుకే ఏమవుతుందోనన్న భయం, రెండోసారి తీస్తున్నప్పటికీ అవసరం తీరిపోయింది, ఇంక ఏమైనా
ఫర్వాలేదన్న ధీమాస పరిస్థితులపైనే మన నమ్మకాలు భయాలు, బలహీనతలు, నిబ్బరాలు
ఆధారపడివున్నాయా ! “
ఆదిత్య యీ
భావనలోనుంచి తేరుకునేసరికీ బలరాం కాళ్ళు చేతులు ముఖం కడిగేసుకుని తలకూడా పూర్తిగా
తడిపేసుకున్నాడు, మూడోసారి బలరాం, నీరు తీసాడు, అప్పటికి బలరాం దాహం పూర్తిగా
తీరిపోయింది. ఊరకనే తీసాడు, తీసిన నీరు ఏదో ఒకటి చెయ్యాలిగా మరి! నోటినిండుగా నీరు తీసుకు,
పుక్కిలించి తిరిగి నూతిలోకే ధారగా ఉమ్మడం ప్రారంభించాడు, అదో అటలా, ఆచర్య గమనించేసరికీ
ఆదిత్య మదిలో చిన్న మెరుపు మెరిసింది.
ఒక్క
నీటిబొట్టు కోసం తపించిపోయాడు కొద్ది
క్షణాల క్రితం, ఇప్పుడు ఆ నీటితోనే ఆటలాడుతున్నాడు, అంతే కాదు, ప్రాణాలు
నిలపడానికి ఆధారమైన నీటిని ప్రసాదించిన
నూతిలోనే తిరిగి పుక్కిలించి ఉమ్ముతున్నాడు,ఎంత ద్రోహం! దాహం తీరగానే చేసేది
ద్రోహమేనా! ఏమిటీ వింత మనస్ధత్వం ! కాసేపటికీ బలరాం ఆట
పూర్తయింది, ఆట పూర్తవగానే సహజమైన వాగుడు ప్రారంభించాడు, ఆదిత్యతో ఆమాట, యీమాట
చెప్తూ , పెల్లలు ఊడబెరికి నూతిలోకి గిరాటువేస్తూ” సింహాలు వెంకటాద్రప్పరావు గారి సినిమాహాలు
రెండు లక్షలకు కొనేశాడట, “అన్నాడు.
ఆ సంగతి అంతవరకు తెలియని ఆదిత్య ఆశ్చర్యంతో నోరు
తెరిచేశాడు, కీర్తికోసం అంతా తగలేసిన సింహాలుకు అంత డబ్బు ఎలా వచ్చిందా అని అతనికి
సందేహం పట్టుకుంది.
మంచి పనులను చేసినవాడెవడూ , చెడిపోడురా
అబ్బీ అదే పిలక పట్టుకుని మరీ బయటకు లాగుతుందని ధర్మ సూక్ష్మాన్ని క్లుప్తంగా
వివరిస్తూ , బలరాం, నూతిలోకి వంగి అదోలా నవ్వేడు. అచ్చంగా ఆ నవ్వు బాగుపడ్డానికి
యింత కన్న మంచి మార్గం లేదుగా అంటూ సింహాలు నవ్విన నవ్వులానే వినిపించింది. చకితుడయ్యాడు నూతిలో బలరాం ప్రతిబింబం వెనుక
అస్పస్ఠంగా సింహాలు ముఖం కదిలినట్లు కనిపించింది.
సింహాలుకి కీర్తిదాహం తీరగానే మరల
ధనదాహం పట్టుకుని అలవాటైన ద్రోహచింత ఆరంభించాడో, లేక, ఎవడిచేత వేలెత్తి
చూపించుకునేందుకు వీలు లేకుండా నాలుగు మంచి పనులు చేసి కీర్తిని ఆర్జించి,
ఆర్జించిన కీర్తిని అడ్డంగా మదుపుగా ఉంచుకుని మళ్ళా ధనార్జన కోసమే ప్రారంభించాడా ఇందులో
ఏది నిజం. ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఆదిత్య ఏమైతేనేం, ధనాన్ని పారేసి కీర్తి,
కీర్తిని ముందుకు నడిపించుకుంటూ, వెనుక ధనాన్ని పోగుచేసుకుంటూ, రెండూ
సాధిస్తన్నాడు. సింహాలు అనిపించింది. ఒకే
దెబ్బకు రెండు పిట్టలు అని అస్పష్ఠంగా గొణుక్కున్నాడు.
నూతిలో పిచ్చినవ్వులు నవ్వుతూ
ప్రతిధ్వనులు వినటంలో పూర్తిగా మునిగి పోయిన బలరాంకి ఆదిత్య అస్పష్ఠమైన ధ్వని
వినిపించలేదు.