Tuesday, April 9, 2013

కొత్తమేడ




-         శ్రీ ఆకుండి రాజేశ్వరరావు
-         రసమయి కధాసంకలనం: 1966 మార్చి తొలి ముద్రణ

              అది కొత్తమేడ నిజానికిది పాతమేడే...కానీ నిజం ఎవరికి కావాలి.. జనం ఇప్పటికీ ఆ పాతమేడను..కొత్తమేడ అనే పిలుస్తున్నారు.

                సరిగ్గా కొత్తమేడ కెదురుగా ఒక యిల్లు వుంది..దాన్ని ఇల్లు అనరేమో పాక అనే అంటారు.. ఎదురెదురుగా వున్న కొత్తమేడకు పాకకు మధ్య ...వున్నవాడికి ..లేనివాడికి మధ్య హద్దులా తార్రోడ్డు పడివుంది..ఆ రోడ్డుమీదనుంచి పోయినవాడికి మేడ ..ఆ మేడను మోస్తున్న పాలరాతి స్తంభాలు కనిపిస్తాయే కానీ .. పాక ..పాకచుట్టూ వున్న బంతిపూలు కనిపించవు..పాకకు, రోడ్డుకు మధ్య నిలువెత్తున కంచె, అంతకన్నా ఎత్తుగా పెరిగిపోతున్న నానారకాలచెట్లు, పాకను అప్యాయంగా దాచేస్తుంటాయి.

                కాని కొత్తమేడమాద నిలబడితేమాత్రం పాక చాలా తమాషాగా,నేలను విరిసిన హరివిల్లులా,బొమ్మరిల్లులా,పికాసో చిత్రంలా, కనిపిస్తుంది, కాని ఆ రమ్యతను చూచేదెవరు? ఒక్క జమిందారు తప్ప-.

                   జమీందారు మాత్రం కొత్తమేడ మాద పెద్దగదిలో నిలబడి అద్దాల కిటికీలోంచి, - సిగరెట్టు పొగలోనుంచి, పల్చని పచ్చని చెట్ల చిగుళ్ళ పైనుంచి, - పాకని ,పాక చుట్టూవున్న బంతిపూలను చూస్తూ కూర్చుంటాడు.

                  ఉబుసుపోక కాదు పనేమీలేకనూ కాదు. అంతులేని విలాసాలు, అతనికోసం వేయి కళ్ళతో నిరీక్షిస్తూ వుంటాయి. అయినా వాటన్నిటినీ ఒదిలేసుకుని ఆ కిటికీ దగ్గర కూర్చుంటాడు.

                 మేనేజరుకు మాత్రం ఆయన అలా కూర్చోవడంలో అర్దం కనిపించలేదు, ప్రభువుల మన ప్రవృత్తులకు అర్ధం ఏమిటని? ఆలోచించటమే అవివేకం... అని తీర్మానం చేసుకున్నాడు. ఏమైనా జమీందారు అలా కిటికీ దగ్గర కూర్చోవడం మాత్రం సరిపడలేదు.

                       *                                 *                        *

                 మెత్తటి సోపాలు అందమైన పాలరాతి శిల్పాలు, గోడలకు బిగించిన పులిబుఱ్ఱలు అన్నీ చీకట్లో మునిగిపోయుంటాయి. జమీందారుగారి చేతిలోని సిగరెట్టు మాత్రం కాలుతూ ,- లోయలో ఆవులించిన పులినోరులా మెరుస్తూ వుంటుంది. వేటలో ఆరితేరిన జమీందారు కళ్లు నిశ్చలంగా పాకపైన నిలుస్తాయి..



                    పాకలోనుంచి సన్నని వెలుగురేఖలు వరండామీదనుంచి జారుకుని బంతిపూలతో మంతనాలాడుతుంటాయి.

                     ఆ వెలుగు నియాన్లైటుది కాదు, ప్రమిదది, ఆ వెలుగును చూచినప్పుడల్లా మంచులో తడిసిన చంద్రకిరణంలా ఎంత చల్లగా పవిత్రంగా వుంది అని ఆశ్చర్యపడక మానడు, -జమీందారు, అందుకే- తన గదిలోని అత్యంతాధునికమైన విద్యుద్దీపాలు ఆర్పేసుకుని, తాను చీకట్లో మునిగిపోయిపాకలోనుంచి లేచే ప్రమిదవెలుగును తన్మయత్వంతో చూస్తూ కూర్చోవడం.

         ఆ వెలుగాతనికి ఆనందాన్ని అందిస్తుంటుంది, ఆవేదననూ రగిలిస్తూ వుంటుంది.

         చీకట్లో బిగబట్టుకుని కూర్చున్న జమీందారుకి ఆ వెలుగులో- పాకకు వున్న చిన్న వసారా, నడుమ చాప, చుట్టూ అల్లుకుపోయిన తీగలువీటన్నిటికీ తోడు వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తూనే వుంటారు, అలౌకికమైన స్వప్నంలా , ఆమెఅనంతవిహాయసపధాల్లో ,వలయాలు చుడుతూవున్న-బట్టలు ఒదిలేసిన కాంతితరంగం.

                     అతడు- ఆ కాంతి తరంగంలో తన అంతరంగాన్ని కలిపేసుకుని , యీ లోకాన్ని మరచిపోయిన అదృష్టవంతుడు,.

                      అతనికి- ఆమె కళ్ళు తప్ప ప్రపంచమే కనిపించదు.

                       ఆమెకు అతని వెడదరొమ్మే ప్రపంచమై కనిపిస్తుంది.

                        వాళ్ళిద్దరూ ...ఇద్దరు కాదు ఒక్కరే.

                 అది...సత్యం....స్వర్గం. ఆ చెదరని స్వర్గాన్ని , తొలగని వసంతాన్ని చూస్తూ, తను జగత్తునుండి విడిపోతూ, అంతకంతకూ, అంతర్ముఖమవుతూవున్న చైతన్యంలో యుగయుగాల జీవన నాదాన్ని వింటూ, తన్ను తాను మరిచిపోతాడు,జమీందారు.

                        ఎన్నో సుధీర్ఘ మైన రాత్రులు యిలానే నడిచిపోతున్నాయి .అంతకు ముందతను ఒక్కడుగు ముందుకు వెయ్యలేదు,తన్మయత్వంగా ఆకర్షిస్తున్నవాళ్ళిద్దరు గురించిఅతనికి బొత్తిగా తెలీదనే చెప్పాలిఅందుకాయన ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యాలని లేక కాదు కానీ ఏదో అడ్డుగా వచ్చేది.

                   అది తరతరాలుగా తన వంశాన్ని పెనవైచుకుని వస్తున్న ఆధిఖ్యత కావచ్చు.

                   అతనొకప్పుడు పెద్దజమీందారు, ప్రస్తుతం మాజీ జమీందారు. ఆ రోజుల్లో ఏనుగులు, గుర్రాలు- ఆడంబరాలు అన్నీ అంతరించాయి.. ఆయినా లోపంలేదు ప్రస్తుతం ఒకటి,రెండు పంచదార మిల్లులు, నాలుగైదు సినీమాహాల్సు, డజనుకు పైగా భవంతులు వున్నాయి.

                      కొన్నాళ్ళపాటు రేసులవెంట పరిగెడుతూ, చిత్తుగా త్రాగి డబ్బిచ్చి తెచ్చుకున్నఆడదాని కౌగిలి వెచ్చదనంలో సోలిపోతూ..జీవితాన్ని తృప్తిగా అనుభవిస్తున్నాను అని కలవరించాడు.

                  ఎటొచ్చీ కిటికీలోంచిపాక వైపు చూడటంఆరంభించాకనే- బ్రతుకు మీద అసహ్యం వేయడం ప్రారంభమైంది. ఎన్నో ప్రశ్నలు పుట్టలోని చీమల్లా బిల,బిలలాడసాగాయి

                 వాళ్ళెవరు? ఉత్త నిరుపేదలు, వాళ్ళకి సోఫాల్లేవు, కార్లులేవు, కనీసం కడుపునిండా యింత తిండైనా లేదు, అయినా వాళ్ళంత ఆనందంగా ఎలా వున్నారు?

                   మనుషులు ఆనందంగా జీవించడానికి, వారికిగల సిరి, సంపదలకూ సంబందం లేదా?.. చాలా నిశితంగా ఆలోచించేవాడు, ఎంత ఆలోచించినా..పేదవాడు ఎలా ఆనందిస్తున్నదీ, సుఖపడుతున్నదీ అతనికి అవగతమయ్యేది కాదు, ఉత్త భ్రాంతి, వాళ్ళకు సుఖమంటే ఏమిటో తెలియక తామూ సుఖపడుతున్నామనుకుంటున్నారు, తెలిస్తే ఏడుస్తునే వుందురు, డబ్బులేక సుఖం ఎక్కడినుంచి వస్తుంది?.. అని నచ్చచెప్పుకునేవాడు, అయినా తన వాదనలో ఏదో వెలితి వెంటాడుతునే వుండేది, ఎటూ తేల్చుకోలేక మరో సిగరెట్టు అంటించి వూరుకునేవాడు,.

              తరచుగా తన దాంపత్య జీవితాన్ని వాళ్ళ దాంపత్య జీవితంతో సరిపోల్చుకునేవాడు, - అప్పుడే అతనికి నిజంగా చావాలనిపించేది.

              తన బార్య తనకెప్పుడూ తలంటి నీళ్ళు పొయ్యలేదు, వండి అప్యాయంగా వడ్డించనూలేదు, వాటన్నిటికీ వేరే మనుషులున్నారు, వాళ్ళే చేసుకుపోతారంతా, వాళ్లు చేసేపనుల్లో బాద్యత ఉంటుందేమోగానీ అప్యాయత మాత్రం శూన్యం.

             ఆమె కారు వేరు - తన కారు వేరు, ఆమె బంగళా వేరు, తన బంగళా వేరు, ఆశలు, అభిరుచులు ..అంతా.. జీవితమే వేరు...యీ ప్రత్యేకత లేకపోతే వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

             అర్ధంలేని వ్యక్తిత్వాన్ని హోదాలను. కాపాడుకోవటంలో జీవితమే పోగొట్టుకొంటున్నాను,...బాధగా మూలిగేవాడు..

             వాళ్ళిద్దరూ కలిసి కష్టపడుతున్నారు,- కలసి సుఖపడుతున్నారు- వాళ్ళిద్దరూ వేరుకాదు, ఒక్కటే- వాళ్ళలో వ్యక్తిత్వపు ఘర్షణలేదు, జీవితాలమధ్య అగాధం లేదు.

             పేదరికం మనుషులమధ్య ఆత్మీయతను పెంచుతుంది, సంపద- సహజంగా మనుషుల మధ్య అల్లుకోవలసిన ఆత్మీయతను త్రుంచుతుంది.

            తనెందుకు వాళ్ళలా బ్రతక్కూడదు?

            పిచ్చిగా అరిచేవాడు

            ఒక్కొక్కప్పుడు పాకవైపు చూస్తూవుంటే- తనకులేని ఆనందం వాళ్ళనుభవిస్తున్నందుకు తిక్కరేగేది, కసిపెరిగేది, ఇక ఇటువైపు చూడకూడదు భీష్మించుకొనేవాడు, అయినా చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు.

            ఆ రోజున చలి జాస్తిగానే వుంది, దానికితోడు చిన్నతుంపర, వీటన్నిటినీ ఆవరించుకుని జబర్దస్తీగా చిక్కబడుతున్న చీకటి.

            ప్రతిరోజులేనే ఆ రోజుకూడా జమీందారు తన గదిలో, చీకటిలో, అద్దాల కిటికీ దగ్గర కూర్చుండి తదేకంగా ఆ ఆనందధామం వైపు చూస్తున్నాడు.

            చీకట్లో అతని హృదయం సంతోషంతో ఉరకలు వేస్తూంది,, నందన వనంలోనుంచి, కోయిలపాట గండుతుమ్మెద శృతి అమృతంలోనుంచి పడివస్తున్నట్లువుంది, ఆ పాటలో మాటలకు అర్ధం లేకపోవచ్చు కాని వాటిలో భావం మాత్రం ఊహకందదు, అది సంగీతానికే అతీతమైన సంగీతం.

            ఆమె పాడుతూంది అతను వాయిస్తున్నాడు.

            అది వీణ కాదు, సితారా కాదు, - చిన్న కొబ్బరిచిప్ప- దానిమీదనుంచి బిగించబడ్డ ఒకటి రెండు తీగలు గల చిన్న వాయిద్యం.

            జమీందారు వళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు.

           సన్నని పాట- ఒక్కటే ..పాక లో నుంచి లేచి తోటను , కొత్తమేడను దాటి ప్రపంచాన్ని ఆవరించుకుంటూవుంది.

            పాటతో ఆ రాత్రి రసవాహినిగా మారి చిందులు వేసింది, నందనవనంలోని బంతిపూలన్నీ చల్లగా నవ్వుకుంటూ, పసిపిల్లల్లా, దేవతల్లా,నిదురలోకి ఒదిగిపోయాయి.

            జమీందారు ఒళ్ళు పులకరించింది, కళ్ళు చెమ్మగిల్లాయి, కొత్తమేడ, మెత్తటిసోఫాలు, అందమైన కార్లు అన్నీ వదిలేసి పాక దగ్గరకు పరుగెత్తి అక్కడే వుండిపోవాలనిపించింది, తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది- మేడమీదనుంచి గెంతేసి చావాలనిపించింది.

               అంతలో...........అరె.........................పాట ఆగిపోయింది...

            పాటలోని వెలుగు మాయమైంది, నందనవనం చీకట్లో మునిగిపోయింది, దేవతల్లాంటి ఆ మిధునం పాకలోకి జారిపోయారు, యువకుని చావులా భయంకరమైన చీకటి, ఇంకా జమీందారు ఆ శూన్యంలోకి చూస్తూనే వున్నాడు.

            గప్పున జమీందారు గదిలో లైట్లు వెలిగాయి.

             జమీందారు త్రుళ్ళిపడటం --- మేనేజరు పొడిగా సకిలించడం ఒక్కసారే జరిగాయి.

             తెచ్చిపెట్టుకున్న వినయాన్ని- మేనేజరు కనపర్చాడు, పుట్టుకతో వచ్చిన హుందాతో, జమీందారు మనసులోని , ఆవేదన ముఖంలోకి రాకుండా దాచేసుకున్నాడు.

             ఇంకా ఆయన చూపులు కిటికీలోనుంచి, పాకవైపు ప్రసరిస్తూనే ఉన్నాయి.

                   

              ఆ... అలగావాళ్లుంటున్న స్థలం మన వెంకట్రావుగారిది, ఈ వెధవలు దర్జాగా దానిమీద పాకేసుకుని కులుకుతున్నారు, ఆ.. అయిందిలెండి, యీ వెధవల కులుకు, ఆయన వ్యాపారంలో దెబ్బతినడంతో .. యీ స్థలాన్ని అమ్మజూపుతున్నాడు, చలమయ్యగారు అయినకాడికి పైసలు చేసుకుని యిక్కడ దివ్యభవనం లేపే ప్రయత్నంలో ఉన్నారు,.. అన్నాడు మేనేజరు ముక్తసరిగా..

            జమీందారుకు .. కాలం నిలిచిపోయినట్లనిపించింది, ఎవరో తన గుండెలమీద బాదుతున్నట్లనిపించింది, దిగాలుపడిపోయాడు.

            తరువాత.. కాస్తతేరుకుని ...చలమయ్యగారి కా శ్రమ ఎందుకు?  కావాలంటే మన భవనమే యిచ్చేద్దాం..అన్నారు.

            జమీందారు నిజంగా సిధ్దసంకల్పుడే..

            కొత్తమేడ రంగులు మార్చుకుంది, ద్వారాలు , కిటికీలు కొత్త తెరలను దించుకున్నాయి, కొత్తకార్లు, కొత్తమేడ, కొత్త పోర్టికోలో తొలిసారిగా ఆగాయి. కొత్తమేడ నిజంగా కొత్త సందడితో నిండిపోయింది.

            కాని... యీ మార్పంతా పాకలోని ఆ అమాయకులకు తెలియనే తెలియదు, అంతేకాదు, తాము నవ్వులు పండించుకుంటున్న ఆ చిన్న కొంప, ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బంతిమొక్కలు, అన్నీ జమీందారుగారికి దాఖలుపడ్డ విషయం కూడా తెలియలేదు.

           అప్పటికే కాదు, ఇప్పటికి కూడా వారికా విషయం తెలియదనే చెప్పాలి.

           కొత్తమేడ అమ్మేసి, ఆ పాక ఉన్న స్థలం జమీందారుగారు ఎందుకు కొన్నారో ..ఎంత తలకొట్టుకున్నా మేనేజరుకి అర్ధంకాలేదు.

            చివరకు ..ప్రభువుల మనప్రవృత్తికి అర్ధం ఏమిటి...అర్ధం వుందనుకోవడమే పొరపాటు..అని తీర్మానం చేసుకుని ఊరుకున్నాడు......,
                         
                    

Friday, April 5, 2013

అదృశ్య బంధాలు

అకుండి రాజేశ్వరరావు 
   
               కృష్ణా పత్రిక   తే 12-01-1963 దీ ప్రచురితము



క్షణకాలం టైపు చేయవలసిన కాగితాలు చూసుకుని, సన్నగా తనలో తానే నవ్వుకున్నది- రమణి
          పిరికివాడి గుండెలా మిషను దడదడ మంటూ పనిచెయ్యడం ఆరంభించింది.
ఎందుకోయీ అర్ధం లేని కరెస్పాండెన్స్... ఉత్తకాలయాపనకు కాకపోతే...పాపం  ఎవడో అభాగ్య, అధ్యాపకుడు...రిటైరయి ఆరు సంవత్సరాలు కావస్తున్నా—అవనికి రావలసిన పి.ఏఫ్.పారీరు. అంతకంతకూ, యీ ఆఫీసుల్లో కుళ్ళు పేరుకు పోతూంది.  ప్రతీ వాడూ తడుముకుందుకే తాపత్రయం,-- ఊ... యీ తప్పుడు పనుల్లోంచీ --- ఎప్పుడు తప్పుకుంటారో వీళ్ళంతా....తెలీదు. చిరాగ్గా టైపు చేస్తూనే ఆలోచిస్తూంది.
          యింతకు పూర్వం ఏ ఆలోచనా లేకుండానే, యంత్రవతుగా, తన పని తాను చేసుకు పోయేది ---పమణి.  కాని యిప్పుడు ఎందుకో ప్రతీ చిన్ విషయంకూడా, ఆమెలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.  ఆఫీసంతా శ్మశానంలా నిశ్శబ్ధం గా ఉంది.
          టైపు మిషను మాత్రం దయ్యంలా రొద చేస్తున్నది..  యింతలో ---స్వింగ్ డోర్సు తెరుచుకుంటూ—కమీషనర్ ప్రవేశించాడు.   కాస్త యిబ్బంది గానే లేచి నిలబడింది - రమణి
అయిపోవచ్చిందా.... అందినంత వరకూ జాకెట్టు క్రింద వంపులను చూస్తూ ప్రశ్నించాడు – కమీషనర్.  ఆఁ . . . . .దాదాపు.
వెధవ . . . . . . పనితో అలసి పోతున్నావు కదూ!”...
తప్పదు కదా...
ఏమయినా   నీబోటి దానికి యీ పాడు పనేం లాభం లేదు.
పెదవి వడిచి – పొడిగా నవ్వాడు.
రమణి నవ్వుదామనుకుని మానేసింది.
చూడు రమణీ   నీతో ఒక విషయం మాట్లాడాలి అనుమతిస్తావు కదూ!..
అపరిచిత సంబొఘనకు తెల్లబోయింది ----రమణి.
నా మాటలను అర్ధం చేసుకోగలవనే నమ్మకంతోనే వివరిస్తున్నాను అని ఉపోద్ఘాతం పలికి ప్రారంభించాడు కమీషనరు.
యింతవరకూ --- ఎలానో జీవితం నడచిపోయింది, నాయిష్టా యిష్టాలతో నిమిత్తం లేకుండానే, యిక యీ జీవితం అందిచ్చే అనుభవాలను భరిండచేందుకు శక్తి చాలటం లేదు, స్త్రీ సహాయం అవుసరమని పిస్తోంది.  అలాఅని ఎవరో ఒక అపరిచితమైన స్త్రీ ని కట్టుకుని మరికొన్ని చిక్కులను తెచ్చుకోవాలని లేదు, యీనాడు నాక్కావలసింది, లోకానికి, కాలానికి లొంగిపోయే బలహీనమైన స్త్రీ కాదు.  నా జీవిత గమనాన్ని తీర్చిదిద్దుతూ, శాసిస్తూనే, లాలిస్తూ—జీవితపు లోతుల వరకూ నడిపించగల స్త్రీ కావాలి.
వింతగా మెరిసి పోతున్న అతని కళ్ళలోకి చూస్తూ మనసు తెరచి, అతను వెలువరిస్తున్న ప్రతి మాటనూ అత్యంత శ్రధ్ధాశక్తులతో వింటూ నిలబడింది రమణి, ఏనాడూలేని యీ మాటలతీరు ఆమెకు అంతు పట్టడం లేదు. చాలా ఆశ్చర్యపడసాగింది.
రమణీ నాక్కావలసిన గుణాలన్ని నీలో ఉన్నాయి. నువ్వు నా జీవితంలో తారసిల్లడం నిజంగా నా అదృష్టంగా ---నా జీవితంలో పాలు పంచుకుంటూ, నడిపించగలవా.  అని అభిప్రాయాన్ని తెలియబరచాడు.
ఉన్నట్టుండి రమణి మాత్రం ఏమని సమాధానం చెప్పగలదు ఏమీ పాలు పోక   చీరచెంగు వ్రేలికి చుట్టబెడుతూ నిలుచుంది  --- రమణి.
మరేం తొందర్లేదు... నిదానంగా ఆలోచించి   నీ నిర్ణయం తెనియజేయి.  యిటువంటి విషయాల్లో తొందర మంచిది కాదు కూడా.. అని అన్నాడు.... గాలికి ఊగుతూన్న ఆమెకురులను చూస్తూ.
అలానే. అని ముక్తసరిగా అంటూ...తలఊపింది..రమణి.
తృప్తిగా చిన్నచిరునవ్వు నవ్వి ఎంత హఠాత్తుగా వచ్చాడో, అంత హఠాత్తుగానే నిష్క్రమించాడు – కమీషనర్.
కొద్ది నిమిషాలు అలానే నిలబడి పోయింది. రమణి.
ఎంత సూటిగా, తన అభిప్రాయాన్ని తెలియచేసాడు  యింతకాలంగా పరిచయమున్న  అతని మనస్సులో యిలాంటి అభిప్రాయామున్నా  అతని మనస్సులో యిలాంటి అభిప్రాయం ఉన్నట్లు రేఖామాత్రంగా నైనా తాను తెలుసుకో లేక పోయింది.
ఇంతలోకి హెడ్ క్లర్క్ వచ్చి ---అర్జంటుగా టైపు చెయ్యాలంటూ ఒక లెటరూ --- ఇదిగో –చిత్తగించు అంటూ ఒక కరపత్రం విసురుగా అందిచ్చాడు.
ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి.  టైపు చేయాల్సిన లెటరు ఓసారి చదివి పడేసి ---కరపత్రం తీసింది.  అటూ అటూ తిరగేసి ఊహూఁ అని కోపంగా మూలిగి –ట్రేలి విసిరేసింది.
హెడ్ క్లర్క్- ఆమె మొఖంలో మారిన రంగులను చూసి అదోలా నవ్వాడు. రమణి మనసు లోనే అసహ్యించుకొంది.  ఏదో కలుగ చేసుకుని మాట్లాడబోయేడు. హెడ్ క్లర్కు అలవాటు ప్రకారం. ఆమె వినిపించుకోకుండా, టైపు చెయ్యడం ప్రారంభించింది.  ఆమె తలబిరుసు తనానికి మంటపుట్టుకొస్తున్నా - - - - కనుపిస్తున్న ఆమెఅందానికి మెత్తపడిపోయి - - రెండు గుటకలు మింగి - - -కాళ్ళకు బుద్ది చెప్పాడు.
వ్రేళ్ళు నడుస్తునే వున్నాయి.  రమణి మదిలో ఆలోచనలు ముసురుకుంటూనే ఉన్నాయి.  వేటిదారి వాటిది.  యిటువంచి నాటకాల పిచ్చి వాడు ఉద్యోగం చేసేదేమిటి- - పుచ్చిగాని. దుకే కాబోలు నాలుగు రోజుల నుంచీ స్థిమితంగా ఒక్కనిమిషం కూడా సీటులో లేడు – విశ్వం.
నాటకమంటే చాలు - నిద్రాహారాలు మాని అఘోరిస్తాడు. కాని ఆఫీసు పనంటే మాత్రం ఎక్కడలేని బధ్ధకం. పోనీ సవ్యంగా, నమ్రతగా ఉంచాడా...అదీ లేదు. కమీషనర్ నుంచీ, బిల్ కలక్టరు వరకూ ప్రతీవాడితోనూ తగవులే. ఒకసారి సస్పెండు, మరొకసారిడిస్మిస్ అయ్యేవరకూ వచ్చ్దింది. అయినా బుద్ధి ఉంటేగా.  యింకా ఎంత కాలానికి తెలుస్తుంది బతకడం.
ఫైల్సు మధ్య పోర్షన్ కాగితాలుంచుకుని ఆఫీసులో బట్టీ పెడుతుంటే ఎవరు మాత్రం ఎంతకాలం ఊరుకుంటారు.  ఏదో కమీషనర్ మంచివాడు కాబట్టీ కొంతలో కొంత సరి పోతూంది.
యివతల తన పని చూసుకుంటూనే, విశ్వం సీటు కూడా చూసుకోవలసి వస్తూంది.  ఏంమనిషి ఎంత చెప్పినా వినిపించుకోడేం. చెప్తున్నంతసేపూ ఒకటో క్లాసు కుర్రాడిలా బుధ్ధిగా వింటాడు.  ఒక క్షణం దాటితే మరలా యధాప్రకారం తయారు.  సరిగ్గా అయిదు సంవత్సరాలు యీ సీటులోకి వచ్చిందితను.  అప్పటినుంచీ యిదే వరుస. కాగితాల అర్ధంతో నిమిత్తం లేకుండానే – ఉన్నదున్నట్లు టైపు చేసి పారెయ్యడం, విసుగనిపిస్తోంది తనకు.  సుఖంగా జరిగిపోవలసిన జీవితంలో అయిదు సంవత్సరాలు యీ సీటు క్రిందే ముక్కలయ్యాయి.యిక యీపని మానెయ్యడం మంచిది. ఉత్త చెత్త బ్రతుకు, ఎంత కాలం చూసిన, అరుగు తూన్న కీబోర్డు, ఊగుతూన్న సీటు—పాపంలా పేరుకు పోతూన్న కాగితాలు, తనూనూ... ఛ...ఛ...ఖర్మ.  
గతాన్ని వర్తమానాన్ని,   ముడి వేస్తూ ఆలోచనలు అలసిపోతున్నాయి ఆమె చిన్న మెదడులో... తనకూ అందరిలానే ఘనం గా పెళ్ళి జరిగింది – ఒక లాయరుతో, సుఖించింది కొద్ది కాలం.ఒకే ఒక సంఘటనతో తన జీవితమంతా తల్లకిందులైంది.
ఆరోజున అల్లాడిందనితను. ఎంత శూన్యంగా అగుపించింది కాలం.  ఒక్కరూతన్ను అర్ధం చేసుకో లేక పోయారు.. ఆఖరుకు కట్టుకుని, కాపురం చేసినవాడు కూడా,కసాయి వాడుగా మారిపోయాడు.  యింతకూ తను చేసిన తప్పేముంది.  ఒకరు చేసిన పాపాన్ని కళ్ళారా చూడటం- చూసినది ఉదారంగా దాచుకుని కాపాడటం తప్పించి.
అంతమంచితనానికి సమాజం అందిచ్చే ప్రతిఫలం ఇదా..... కాదు......నిజంగా తప్పేచేసింది తను.....ఆడాక్టరు భార్య అవినీతిగా, కంపౌండరు కౌగిట్లో కులుకుతూ ఉంటం......చూసిన వెంటనే, నిర్దయగా ఆమెపరువు రచ్చకెక్కించవలసింది.  కాని తానలా చెయ్యలేదు. ఒక పచ్చని సంసారం .పాడుచెయ్యడం యిష్టం లేకనే ఊరుకుంది. ఆ డాక్టరు భార్యకు విశ్వాసం ఉండాలా...
తానెక్కడైనా బైటపడి అల్లరి చేస్తాననే భయంతో .....ఆమె పాపం తనతలమీదకు నెట్టింది.తనకూ – కంపౌండరుకూ – అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేసింది.  ఆడది చేయవలసిన పనేనా...... కట్టుకున్నవాడూ, యిరుగు పొరుగులూ, అత్తమామలు----అంతా ఆవిషప్రచారానికి లోబడిపోయారు.....
యింతచేసినా ఆమె ఏవినీతిని తను బయట పడెయ్యలేదు... ఆరోజుతోనే అన్నిసంబంధాలూ తెగి పోయాయి ఏకాకిగా మిగిలి పోయింది.  తను తరువాత ఎన్నిచోట్ల తిరిగిందని.... ఒక్కచోట కూడా పట్టుమని పదిరోజులుగడవలేదు, జీవితం మీద మమత తగ్గి పోయింది.  కావాలనే మరీ నాశనమయింది.  ఒక్కొక్కరోజున ఒక్కొక్కడితో పరిచయం.  యీరోజున వాళ్ళముఖాలు లీలగా నైనా గుర్తుకు రావటం లేదు.
సర్వం నాశనం చేసిన సమాజం చెడిపోయానని వేలెత్తిచూపి నవ్వింది.  ఈ కుళ్ళిన సమాజ హృదయంప్రళయం తర్వాత  కూడా బాగు పడదు కాబోలు. ఇక చెడడానికికూడా దారి రొరక్క పోవడంతో – తన జీవితంపై తనకే అసహ్యం వేసి మనసుమరలించుకుని గిరులు గీసుకుని మళ్ళీ నిలకడలోకి వచ్చింది మనస్సు.  యిష్టం వచ్చినట్టు తిరగడం మానుకుంది.  ఎన్ని అనుభవాలు.  కొన్ని తీయనివి. కొన్ని చేదువి.కొన్ని నిరంతరం ఊగించేవయితే మరి కొన్ని అనవరతమూ కదిలించేవి.  యీ చిన్ని జీవితం ఎంత బలమైన సత్య పూరితమైన పాఠాలు నేర్పించింది.  కనీసం తనకు నేర్చుకుందామనే ఆసక్తి లేకపోయినా.. ఎందుకు సుఖపడలేకపోతోంది  యీ జీనితంలోనే సుఖం లేదా.. తెలీదు.  తెలుసుకోలేదు తను.  తెలిసినవారు – తెలిసినట్లు – అందరికీ అర్ధమైటట్లు చెప్పిచావరూ, చచ్చిన వాళ్ళు కూడా తెలిసినట్లు చెప్పిచావలేదాయె. ఎందుకీ...గానుగెద్దు లా బ్రతుకు.. యీలోకంలోకి వచ్చినట్టు ఎవర్ని నిలదీసి అడిగినా సమాధానం రాదు. యిక తనతుతానే తెలుసుకోవాలి కాబోలు. ఎందుకో .... ఎన్న డూ లేనంతగా....శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోతూంది తను. వ్రేళ్ళు నొప్పి పడ్డాయి.
కాగితాలు కట్టకట్టి సొరుగు లో కుక్కి వేసింది. – రమణి
అఫీసు వదిలేసింది.  ఆలోచనలు మాత్రం ఆమెను వదలలేదు.  విశ్వం మద్యహ్నం నుంచి కంటబడలేదు.  ఎక్కడ తిరుగు తున్నాడో, ఏమో.  అయినా విశ్వం – అంటే అంత అపేక్ష ఎందుకు  తన మాట ఒక్కటీ వినడు, పైగా వింటున్నట్టు నటిస్తాడు, వింటున్నానంటాడు.   అంతే...... అందుకనే అంత జాలి పుట్టుకొస్తుందా-----తనకు  లేక పోతే...........
తనలాగే జీవితం అంటే ఖాతరు లేకుండా గడిపేస్తున్నాడనా.   అదలించి – ఆదరించే వారెవరూ లేరనా.. ..చెడిపోతున్నాడనా  వీటి లో ఏది కారణం  లేక అన్నీనా.... అయినా తనకెందుకీ అక్కరలేని తగులాటకం.  అతనెలా పోతే మాత్రం తనకెందుకు.  ఉద్యోగం ఊడి బ్రతుకు అల్లరిపాలైతే ---అతనే అఘోరిస్తాడు.  
ఆమె నడుస్తూనేవుంది. రకరకాల మనుషులు ఆమెను తప్పుకు పోతున్నారు.వింతసందడి చెవిన పడుతోంది.  కొందరు భవిష్యత్తు మీది ఆశ తో అడుగు లేస్తున్నారు, మరికొందరు గతాన్ని తలచుకుంటూ ఏడుస్తున్నారు.  యీనిన్న రేపటులగురించి ఎందుకో అంత ఆందోళన   యీ ఆందోళనే మానవజీవిత సుఖాన్ని దొంగిలించేస్తూంది.
ఇంతలో పబ్లిక్ వర్కు మేస్త్రీ పలకరించాడు.
రమణి ఆలోచనల వలల్లోంచీ బయటపడింది. తరువాత అప్రయత్నంగా అడిగేసింది...  విశ్వం ----కనిపించాడా అని,
యీ రోజు నాటకం కదమ్మా..... అతనెక్కడ కనిపిస్తాడు,  అని జవాబిచ్చి జారుకున్నాడు.
మరల ---రమణికి- ఎందుకో విశ్వం పైనజాలికలిగింది.  ఏమైనాసరే ---..ఈనాటకాలు మానిపించాలి, ఆఫీసు ఎగ్గొట్టడం మాట అటుంచి ఒళ్ళు చెడగొట్టు కంటున్నాడు. ఏమైనా ఒంటికివస్తే, దిక్కా మొక్కా.! ఎవరు చేస్తారు ?
ఎందుకొచ్చిన కళా సేవ, అయినా యిదికళా సేవో,కాంతా సేవో – ఎవరికి తెలుసు
ఎవరో – సిగ్గు, లజ్జ లేని ఆడాళ్ళను తీసుకొచ్చి వారితో సమానంగా – వెధవగంతులు. పోనీ---తనకెందుకు ---అని అనుకుంటూనే తాళంతీసి యింట్లో దూరింది – రమణి.  అనాధ లాంటి శూన్యత్వం ఆమెను ఆహ్వానించింది.  ముఖం కడిగి---చీర మార్చేసుకుని ---ఫ్లాస్కులో –కాఫీ –గొంతులో పోసుకుని—పాతకుర్చీలో కూలబడి -  అలాంటిదే ఓ పాత పత్రక తీసి పేజీలు తిరగెయ్యసాగింది. కధలో ఒక్క ముక్కా తనకు అర్ధం కాలేదు.  ఆమె ప్రయత్నించనూలేదు కూడా...
ఇంతలో కమీషనరు మాటలు జ్ఞప్తికి వచ్చాయి.  పుస్తకం మూసి తీరుబడిగా ఆలోచనలో పడింది.   ఎంత అందంగా,నిర్మలంగా మాట్లాడేడు,ఏమాత్రం ఉద్రేకం  లేకుండా .. అతని సుచన అంగీకరిస్తే  జీవితగతే మారిపోతుంది.  అందమైన బంగళా---ఫర్నిచరూ – పిలిచేసరికి పలికే బంట్రోతులు –చేతినిండా డబ్బు –వెనక కావలసినంత గౌరవం.....
విలాస జీవితం కొంతకాలం తను రుచిచూసి వదిలేసిందే..  వాటిలో మాత్రం ఏముంది కలుక,అదంతా ఉత్తసుఖాభాస మనల్ని మనం మోసగించుకోవడం-.... . . . .  అందుకనే కాబోలు యీ పేద జీవితంలో కూడా విలాసాల వైపు మనసు పోలేదు.
నిజానికి యీనాడు తన వద్ద కొంత పైకం లేక పోలేదు.  అడపా, తడపా—విశ్వానికి అప్పు యివ్వడానికే పనికి వస్తోంది.  అతడు తిరిగి యిచ్చేది లేదని తేలిసి కూడా.   అప్పు తీసుకోవడానికి వచ్చి నపుడు ఎన్ని లయలు వేస్తాడు, పసివాడిలా, నిజానికి అతను పసివాడే—వయసు తో పాటు –మనసు ను పెంచలేదు.—కాలం . . .యిష్ఠం వచ్చినట్ట్లు మా ట్లాడతాడు ---చిత్తం పరుగెడతాడు ఎదురు దెబ్బలు తగులుతాయనే భయమైనా లేదు.  ఆ అమాయకపు ప్రవర్తనే తన్ని బంధిస్తోందా!...
పక్కవాటాలోంచీ కొత్త దంపతుల కేరింతలు వినిపించాయి  తనగది అంత ఆనందాన్ని ఒక్కనాడూ పొందలేదు. 
ఎంత కాలమీ ఒంటరి తనం?.  ఎందుకు బ్రతుకు తున్నట్లు?  విశ్వం కోసమా?  అతని కోసమూ కాదు. ఎవరి కోసమూ కాదూ  -కేవలం తనకోసం. . . . .
ఇక భరించలేకపోయింది. . . ఆలోచనలతో తల వేడెక్కి పోయింది. . . విసురు గా లేచి - - - కేరియరు ఊడదీసి భోంచేసింది.  చేతులు తుడుచుకుంటూ - - - ఉండగానే...తలుపు వారగా - - నీలంరంగు కవరు కనిపించింది.   తీసి చూస్తే . . . ఆహ్వానమూ, కాంప్లిమెంటరీ టిక్కట్టూ అందులో ఉన్నాయి.  తలుపు సందుల్లోంచీ విసిరేశాడు కాబోలు. . విశ్వం...అని అనుకున్నది.  ఆమెకు నాటకాలంటే సరదా ఏమీ లేదు.  ఇంతకు పూర్వం కేవలం విశ్వాన్ని  సంతోషపరచడం కోసం వెళ్ళేది.  ఏఁమిటో యీరోజు విశ్వంపైన కొంచం చిరాకు పుట్టుకొచ్చింది. మనస్సు కూడా చాలా అలజడి గా ఉంది.  లేకపోతే వెళ్ళేదేమో.
పడుకుందామని ప్రయత్నించిందిగాని. . . నిద్ర ఆమె దరిదాపులకు కూడా చేరలేదు.  మనోయవనికపై. . . అనేక బింబాలు అల్లరి చిల్లరిగా పడసాగాయి.  నున్నటిగడ్డం విశాలమైన నుదురు సహనాన్ని సూచించే కళ్ళు - -బాగానే వుంటాడు- - కమీషనరు- -అనుకున్నది- - రమణి.
తను యీవాతావరణాన్ని యిక భరించలేదు.  యిక యీ జీవితానికి తెరవాల్చి- - మరో జీవితానికి తెరెత్తాలి.  ఆనాడు సుఖశాంతులు లభిస్తాయి. కమీషనరు తో సంసారిక జీవితం- - ప్రశాంతంగా ఉంటుంది.  కొద్దికాలం లోనే---అతనిలో తాను లీనమైపోగలదు.  తన వ్యక్తిత్వం దెబ్బతినకుండానే. .  పోతే విశ్వాన్ని ఆదుకునే వారెవరూ ఉండరు. పోనీ- తనకేం.
ఆఖరుకు - - - కమీషనరుతో కలసి శేషజీవితం సుఖమయం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చింది-రమణి.  రేపు ఉదయం - - - తన నిశ్చయాన్ని తెలియచేయాలనుకుంటూనే - - -నిద్రలో పడింది.
·         *
ఎనలేని ఉత్సాహం తో - - తన నిర్ణయాన్ని చెప్పి కమీషనర్ ని సంతోషంలో ముంచెయ్యాలి- అని
 అనుకుంటూ నే-  - - కమీషనర్ గదిలోకి అడుగు పెట్టింది – రమణి.
చూశావా—ఏంచేసాడో ఆ అభాజనుడు.  అని ప్రారంభించాడు కమీషనరు ఆమెను చూడగానే.   ఏమీ అర్ధం కాక తెల్లబోయింది.  పె ద్ద –చిన్న-తన అంతస్తు- ఏఁమిటో తెలుసుకుని, ఒళ్ళు దగ్గరుంచుకోనక్కరలేదూ- - ఆ ఛైర్మన్ ఖారాలూ, మిరియాలూ, నూరుతున్నాడు- - యిక విశ్వాన్ని రక్షించడం ఎవరితరమూ కాదు. –నువ్వు వాడ్నివెనకేసుకు రాబట్టే వాడిలా తయారయ్యాడు.-
కమీషనర్ మాటలు చాలా బాధ కలిగించాయి- రమణికి. వినయంగానే---యింతకూ – విశ్వం ఏంచేసాడని.  అంతకోపానికి. అన్నది.    
మెల్లగా అంటావేం!- -  ఛైర్మన్ రోడ్లకోసం తెప్పించిన సిమ్మెంటు మింగేశాడని—కంట్రాక్టర్ల దగ్గర సొమ్ము గుంజుకుంటున్నాడని – హాస్పటలు నర్సులతో ప్రేమకలాపం సాగిస్తున్నాడని – యివికొన్ని . . .యింకా యిలాంటివి ఎన్నో - - -రాత్రి నాటకంలో ---ఛైర్మన్   పాత్రను సృష్టించి – దానిద్వారా – మన ఛైర్మన్ బండారం బయటపడేశాడట.  దాంతో హాల్లో చప్పట్లవర్షం కురిసిందట.  ఖర్మంచాలక ముందు సీట్లోనే కూర్చన్న మన ఛైర్మన్ గారు ముఖం ఎత్తు కో లేక పోయాడట.
ఇంతకూ అవన్నీ మన ఛైర్మన్ చేసినవని ఎందుకనుకోవాలి?  ఆనాటకంలో అలాంటి పాత్ర ఉందేమో! దానికి వాళ్ళేం చేస్తారు.మనలో మన మాటగా అనుకుంటే – మన ఛైర్మన్ గారు మాత్రం- ఆ అఘాయిత్యాలన్నీ జరిపించలేదా?.
అదిగో    ఆ ప్రసక్తి మనకు అనవసరం మనం తలమ్ముకున్నవాళ్ళం.  లోకాన్ని మరమ్మత్తు చెయ్యాల్సిన వాళ్ళం కాదు., నీమీద ఉండే గౌరవం కొద్దీ –నీవు చెప్పింది విని ---యింత వరకూ విశ్వాన్ని సపోర్టు చేస్తూవచ్చాను.  యిక నా తరం కాదు.  ఆఛైర్మను యీ అభాగ్యుడి ఉద్యోగానికి ఎసరుపెడతాడు...తప్పదు.....యికనువ్వూ, నేనూ  చేసేదేమీలేదు
యీ స్థితిలో రమణికి   తన నిర్ణయాన్ని కమీషనర్తో చెప్పి ఆయనకు సంతోషం కలిగించాలనే కోరిక సన్న గిల్లిపోయింది.  మాట్లాడకుండా బైటకు వచ్చేసింది.
*
తరువాత తమణి ఆఫీసుకు రానూ లేదు.  కమీషనర్ ని కలుసుకోనూలేదు.
ఎందుకూ పనికిరాని మాటకాల పిచ్చివాడిని కట్టుకుని ----వాడితో పాటే తనూ నాటకాలు వేసుకుంటుందా!  --యింతమంచి ఉద్యోగమూ,చక్కటి బంగళా, సభ్యమనుషుల్లో గౌరవమూ అన్నీ వదులుకుని దారిద్ర్యాన్ని వెంట బెట్టుకుంది. . . .దురదృష్టవంతురాలు.  అనుకున్నాడు కమీషనరు.
తెలివితక్కువది కాకపోతే యీ నాటకాలు వేసే పిచ్చాడు తనని ఉధ్ధరిస్తాడనుకుందా. .  లేవదీసుకు పోయింది.  అని ఏక గ్రీవంగా తీర్మానించారు ఆఫీసులో పని చేస్తున్న తోటి గుమస్తాలు.
ఎప్పుడైనా ఆమెకనుపిస్తే ఉచితంగా యివ్వడానికి తలా ఒక సానుభూతి వాక్యాన్ని జాగ్రత్తచేసి ఉంచుకున్నారు.
కాని,
ఆమె కనుపించ లేదు.

Wednesday, April 3, 2013

మా రామ్మూర్తి మాస్టారు



ఆకుండి రాజేశ్వరరావు                                   కృష్ణాపత్రిక ;23-07-1960

సాయంత్రం -------- నగరం కలవరిస్తోంది….



ఏనాడో మానవత్వాన్ని పొట్టనబెట్టుకున్న నగరం-----నగరం నడిగర్భంలో నరులంతా ......ఉరకలు వేస్తూ.... ఆశలు మేస్తూ,....గతాన్ని నెమరేస్తూ.... మెడమీద కఱ్ఱవేసి గెంటుతున్నట్లు........వింతభయం తరుముతున్నట్లు .....నడుస్తున్నారు.

               నేను ------- అనవసరంగా బయల్దేరాను........ ఒంటరిగా .......కాదు......... తెల్లారని సమస్యలపై రేగిన ఆలోచనలు తోడురాగా........

              నడుస్తున్నాను........జనాన్ని చీల్చుకుంటూ, నా వెనుక నవ్వులు--------నా ముందు నవ్వులు ,నా హృదయంలో గులాబీముళ్ళు,... నామీద కేంద్రీకృతమవుతున్నాయి... నికృష్ట జీవుల వెలుగారిన కళ్ళు..

              అడుగడుగునా రాసుకుపోతున్న కార్లని తప్పుకుంటూ . ........నడుస్తున్నాను.

               లాగూలేని అబ్బాయి...

               లాల్చీలేని అబ్బాయి..

               ఆ రెండూ లేని అబ్బాయి.... అద్దాల అవతల లడ్డూలను విడివిడిగా చూస్తూ ఉమ్మడిగా గుటకలు మింగుతున్నాడు.అద్దాలు యీ జీవితంలో........ అడ్డం...........తొలగవు  ఎవరో పిలచినట్లయింది.....వెనక్కి తిరిగి చూసాను ...అనంతజనవారాసి.......పిలచినవారెవరు..

               ఎవరూ కనిపించలేదు...కుంటికుక్క ఒకటి మొరిగింది...తిరిగి నడక సాగించేను....జోరుగా గుండెపాడే విషాదగీతికకు లయగా ...అడుగులు వేస్తూ..

                  నగరం --------కనుమరుగయింది,....జీవనము లేక నిర్జీవంగా పడివున్న కాలువగట్టు పైనుంచి అడుగులు వేస్తున్నాను.

               దైవం ----- అనుగ్రహించినా, పూజారి ఆగ్రహాన్ని, నిగ్రహించుకుని , అనుగ్రహం ప్రసాదించనట్లు......ఎండ తీక్షత తగ్గినా , గాలి వాడి, వేడి తగ్గలేదు.

                 నగరానికి కట్టెలు మోసుకుపోతున్న కూలీలు నన్ను తప్పుకుపోతున్నారు, కట్టెల్లో కలిసేవరకూ వీరికి కట్టెల మోత తప్పదు.

                   పడమటి ఆకాశమైదానంలోని .......రంగుల్లా .....నా ఆలోచనలు క్షణక్షణానికి రంగులు మారుతున్నాయి,

                యింకా కష్టపడు పైకొస్తావు....... తర్వాత సుఖపడుదువుగాని అంటున్నాడు... మేనేజరు.

                  అట్టే... కష్టపడకు.... విశ్రాంతి తీసుకో  అంటున్నాడు... డాక్టరు.

                    ఏ మాటకు విలువివ్వాలి...

                   యింకా యీ కష్టం చాలదా .....యింకా ఎన్ని గంటలు కష్టించాలి....    సుఖం చవి చూడ్డానికి...

                  కష్టంలోనే... కన్నుమూస్తానేమో….!

                   కష్టంలోనే .....సుఖం  గర్భితమై వుందేమో...!

                     ప్రకృతి గాలిని కట్టగా కట్టేసి తాకట్టు పెట్టింది. శరీరం ఘర్మజలంలో స్నానం చేసింది ..పచ్చని లేత చెట్టుకు ఎండిన ముండ్ల తీగలు--- పెనవైచుకున్నాయి.రేగినజుట్టుతోడి నిర్జీవ మానవాకారాల్లా , నిటారుగా నిల్చున్నాయి దూరంగా తుమ్మచెట్లు..

           సంభ్రమ సముత్సతత్ఫతంగ కుల కలవరాన్ని అరతులమైనా తగ్గించలేకపోయింది. పచ్చని గడ్డికోసం చుట్టూ పరీక్షించాను ..కానీ ప్రయోజనం లేకపోయింది.

          ఇసుక మీద కూర్చున్నాను, ఇసుక నిట్టూర్పు ఆవిరి విడుస్తోంది.

          జీతానికి ...జీవితానికి ...అవినాబావ సంభందముంది. జీతం ..పెరగలేదు, పెరుగుతుందనే ఆశ కూడా సుదూరాన కనిపించడంలేదు. జీవితమధురిమ ఏనాడో తరిగిపోయింది. ఇంత విశాల నగరంలో ...ఇల్లు కాదు ,,..గది ..గాలి ..వెలుతురు వచ్చే గది అద్దెకు దొరకలేదు ..నీళ్ళు దొరకవు..కన్నీళ్ళు ఎప్పుడో జీవిత ఘర్షణకి ఆవిరైపోయాయి..యెంత బోధించినా శ్రీమతి ఖర్చులు తగ్గించదు..... ఆదాయం పెంచుకుందా మనుకున్నా ... అవకాశం కనిపించదు..డబ్బు పంపించమంటున్నారు ..నాన్న..నాకూ పంపించాలని వుంది...కానీ ...నెలనెలా పంపుదామను కుంటున్నాను.. పంపలేకపోతున్నాను...నేను తల్లిని ..తండ్రినీ ..మరచిపోయానని.. తమ కోడలు ..నా మెదడు చుట్టూ దడి కట్టేసిందనీ ..వారి అబిప్రాయం.

          ఎలా వారి అభిప్రాయాన్ని మార్చగలను….?  చుట్టూ గిరిగీసుకుని గిరిలోపల మనసుకి ఉరి వేస్తూ , పరుగులెత్తడమేనా ...జీవితం...

          జీవితానికి పరమార్ధం .....ఏది..,,?

          అతి సూక్ష్మ,సునిశిత కంటకావృత..మార్గంలో పయనిస్తూ , జీవితగమ్యం ఏనాటికైనా చేరుకోగలనా..

          ఆరంభించిన ప్రతిపనీ ..అసంపూర్తిగా ..అంతమవుతూంది...

          ఆలోచనలనుంచి తప్పించుకునేందుకు , యిక్కడకు చేరినా తప్పించుకోలేకపోతున్నాను..నన్ను నా నుంచి ఎలా తప్పించుకోగలను...?

          కాలువ గుండెలు..బీటలు వారింది..

          కాలువ గట్టున , ఎండినగడ్డిపోచలు ... గాలికి వూగిసలాడు తున్నాయి..

         ఈ సమయంలో ... నేను తలెత్తేసరికీ శుష్కించిన మానవాకారం, నా కట్టెదుట నిలబడి చేయి... ముందుకు చాచింది..

         జీర్ణవసనాలు, జరాధూసరమైన రోమసంతతి ,వయసు వాలింది ...నడుము వంగింది...నుదుటిరేఖలు వక్రంగా , స్పష్టంగా కనిపిస్తున్నాయి.

         గుంటలుపడ్డకండ్లలో...అనంతమైన కాంతి, పెరిగిన మీసాలు గడ్డంమధ్య..కలత నిదురలోని పసిపాప నవ్వులా ..విరిసిన చిరునవ్వు.

         ఆ నిమిషంలో.. మా మనసులు మాట్లాడుకున్నాయి. మనసులు పలికేచోట.....మాటలకు విలువేముంది,

         .......బిక్షాం...........దేహి...

         ఆ..కండ్లకాంతి ఆ చిరునవ్వు....నాకు అపరిచితమైనది కాదనిపించింది.... అయినా జ్ఞప్తికిరాలేదు.

         కళ్ళు గట్టిగా మూసుకున్నాను.

         మనసు..తెరిచి వెనుకకు, జ్ఞాపకాల జాడలకు, వాడలకు, పరుగెత్తించాను.

         గుండె కొట్టుకుంది నా మనోనేత్రం ముందు గజిబిజిగా , కొన్ని దృశ్యాలు గబగబా సాగిపోయాయి,తరువాత స్పష్టంగా దృశ్యాలు కనిపించసాగాయి.

         చిన్ననాడు పుట్టిపెరిగినవూరు చీకుచింతలేని జీవితం...ఆటలు, పాటలు, అర్ధంలేని, అర్ధం తెలియని మాటలు, ఓనమాల.....నామాల మాస్టారు...రామ్మూర్తి మాస్టారు....రామం జేబులో గోలీకాయలు     ...నేను దొంగతనం చేయటం...నామాల మాస్టారు తంతారేమోనని  ......నా భయం..., నా భయానికి , భిన్నంగా, నామాల మాస్టారు..చిరునవ్వు నవ్వుతూ, గోలీలు కొని యివ్వడం...

            ఆ ....అదే.... చిరునవ్వు....అదే ...ఆ అనంతకాంతి....ఆ...అతనే ....అతనే ..కళ్ళు తెరిచాను...కళ్ళు ఛీకట్లు కమ్మాయి..

         నా ముందు ..............శూన్యం...

         పగిలిన ...కాలువగుండె.........పరిహాసంగా  నవ్వింది...దూరాన నగరం....కాలువ....కలుసుకునే మలుపు దగ్గర మానవాకారం. ...ఊతకర్రతో...ఊగుతూ ..సాగిపోతోంది...

         మాస్టారూ....నా సర్వశక్తినీ ..కేంద్రీకరించి....కేక వేశాను..రోదశి ప్రతిధ్వనించింది...తిరిగి..నా పిలుపు ..గుండెల్లో దిగిపోయింది.

         ఊగుతూ, సాగిపోతున్న.....రామ్మూర్తి మాస్టారు...నా కంటికి దూరమయ్యారు...

         ఎలుగెత్తి కేకేస్తూ., కాలుకొద్దీ పరుగెత్తాను...మనసు ..ఉక్కిరి బిక్కిరయింది..

         రామం చెప్పినమాటలు...నా మరపు తెరలను చీల్చుకుని తలెత్తాయి..

         మాస్టారు ..రిటైరయ్యారు...ముప్పదిఏండ్ల తన జీవితానికి..బడికి గల ముడి విడిపోయింది...బడే ..తను...తనే బడి..అయిన  మాస్టారు జీవితంలోంచి అతని యిష్టానిష్టాలతో నిమిత్తంలేకుండా ..బడిని విధి బలవంతంగా ఊడ బెరికి, మరొకరికి కట్టబెట్టింది...

         తన ఆశలకు..ఆశయాలకు..ఆలయమైన... విద్యాలయానికి.. .చివరిసారిగా, అశ్రుపూరిత నయనాలతో ..అవలోకించి..నమస్కరించి, మాస్టారు...నిష్క్రమించారు..శాంతి...కాంతి.. లేని ..విశ్రాంతి ...తీసుకునేందుకు. ఆయన రిటైర్ అయే సమయానికి, ఆయన ఆస్థి..పెళ్ళికి తయారుగా వున్న ముగ్గురు కూతుళ్ళు..మూడు వందల అప్పు..

         ఆయన వయసు చరమాంకంలో..సాగిపోతున్నా జీవితం తిరిగి ప్రధమాంకంలో ..........కాలూనింది..తిరిగి..బ్రతుకుతెరువు కోసం...ఉద్యోగ ప్రయత్నాలారంభించారు...కొన్ని చోట్ల తన శిష్యులతోనే పోటీలుపడి ..ఓడిపోయారు..

         బ్రతుకు బరువయింది..ఆశ ..సన్నగిల్లింది..,విశ్వానికి..విజ్ఞాన భిక్ష ప్రశాదించిన ..మహాత్మునకు..నట్టనడివీధిలో భిక్షాటన..అబ్బ..బుఱ్ఱ బద్దలయిపోతే బాగుండుననిపించింది...కాలం కలియుగాంతానికి, కదలి, ప్రళయం..యీలోకాన్ని..యిప్పుడే ముంచేస్తే బాగుండును..

         రొప్పుకొంటూ..వెర్రి ఆవేశంతో..నగరంలో ప్రవేశించాను...

         పిల్లల నవ్వులు...కన్నెపిల్లల..ఒంపులు,సొంపులు..

         యేవీ కనిపించలేదు   ....వినిపించలేదు..నా ధ్యాసంతా నాకు ఓనమాలు నేర్పిన మాస్టారిమీదనే కేంద్రీకృతమైంది.

         ప్రస్తుతం...ఆయన నొసట నామాలు లేవు..

        సమాజం...పవిత్రమైన ఆయన నామాల్ని ఊడబెరుక్కుని ...అపవిత్రంగా వాడుకొంటూంది..

        నా శక్తి నంతటినీ వెలుగుగా మార్చి, కండ్లలోనుంచి ..... చిరునామాలేని నిర్భాగ్యజీవులు..విశ్రమించే స్థలాలు..పార్కులు..పేవ్ మెంట్లు..రైలు స్టేషన్లు..కూలిన ఇంటి ...అరుగులు..అన్నీ ఎన్నోసార్లు శోధించాను...

         విజ్ఞానభిక్ష ప్రసాదించిన..... ప్రత్యక్షదైవం.....మానవాకృతిని నిలిచిన ..సత్యస్వరూపం..

         ఆయన పాదాలపైబడి..గుర్తుపట్టలేనందుకు క్షమించమని..వారి సేవను గుర్తించలేని, సభ్యత నెరుగని..సమాజంలో..సభ్యుడుగా..కూడా సమాజాన్ని క్షమించమని అర్ధిస్తూ..



         నులివెచ్చని , కన్నీటి..స్రవంతితో..ఆయన పాదపద్మాలు కడిగి..నా పాపం క్షాళితం.. చేసుకొందామనుకున్నాను..కాని..కాని... ....!!!!!

                


       
                         
                 

Monday, April 1, 2013

కొంపలంటుకున్న తరువాత.......


కృష్ణా పత్రిక   09-12-1961 లో ప్రచురితం


          కొంపలంటుకున్నాయి..యింకా అంటుకుంటూనే ఉన్నాయి.  అంటుకున్న కొంపల్లోంచీ, కుట్ర పన్నిన మంటలు, నాలుకలు చాచుకుని బయటపడి, అంబరానికి కంటుకు పోతున్నాయి.          నిర్భాగ్యుల ఆక్రందనలు, మండుతూ, విరుగుతూన్న కఱ్ఱల,భీకరరవం తో కలసి కూలిపోతున్నాయి.          రోదసి దద్దరిల్లుతూంది...ధరణి ఊగిసలాడుతూంది..          పచ్చి బాలింతరాలు,తొలిచూలు పసికందుని గుండెల్లో దాచేసుకొంటూంది. కాటికి కాళ్ళు దాటిన వృధ్ధుడు,చివరిసారిగా,శక్తిని కూడదీసుకుని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు.          పాకలో పశువులు,కట్లు తెంచుకుని,బెదురుతూ,గురి తప్పిన బాణాల్లా పరుగులు తీస్తున్నాయి.          క్షణ క్షణానికి,రేగుతున్న, పెనుమంటలముందు,ఏమీచేయలేని, అమాయకుల రోదన---నిస్సహాయ ఆవేదన,గుండేలు ద్రవించే మూగబాధ.          చుట్టూమూగేరు---అసంఖ్యాక ప్రజానీకం,...........చూస్తున్నారు................చూస్తారేం ?..........          ఒక్కరూ ముందుకురకరు ?...          ఏం   ..............................  భయమా ?.....          ఆపదలో భయానికి తావెక్కడ?
          సహాయానికి,సందేహం దేనికి ?... అభాగ్యులనూ, ఆర్తులనూ, ఆదుకోవలసిన సమయంలో....అలా...ముడుచుకు పోయినిలబడతారేం ?....          ఇవన్ని అర్ధంలేని ప్రశ్నలు.....చచ్చు ప్రశ్నలు... వారికి అవసరం లేదు... కాలుతున్నవి వారి కొంపలు కావు.....అంతే .....అదే దాని అంతరార్ధం.          ఆ అనంత జనంలో, శతాంశం ముందుకురికితే, మంటలు ఏనాడో ఆరేవి., మాటలతో మంటలెలా ఆరుతాయి..          వారంతా ----------నాగరీకులు. గాబర్డీను ప్యాంటు, అమెరికన్ షర్టులతో కుళ్ళిపోతున్న గుండెల్ని కప్పుకుని----మానవాకృతిని నిలిచిన మృగాలు,సృగాలాలు.          మంటలంబరాన్ని, అంటుతున్నాయో లేదో నని అంచనా కట్టుకుంటున్నారు.అగ్గి ఉద్భవించడానికి కారణాలు, శోధిస్తున్నారు.          మంటలు ఒక ఇంటి మీదనుంచీ,మరొక ఇంటి మీదకు అడుగులు వేస్తూ పైశాచిక నృత్యం చేస్తూ కడుపు కట్టుకుని,ఆర్జించిన, నికృష్ట కష్టజీవుల,నిక్షిప్త వస్తు సంచయాన్ని కడుపున పెట్టుకుని----త్రేన్చుకుంటున్నాయి.
ఈ ప్రళయ నృత్యం చూసిన కొందరి హృదయాలు కథాకళి నృత్యంచేసాయి.ఎందుకో?
          విధి వెలిగించుకుంటున్న దీపావళిని వింతగా, చోద్యంగా, చూస్తున్న ఆర్ద్రతలేని హృదయాలకు,అభాగ్య జీవుల ముఖాలను పట్టుకుంటున్న శోకాంధ తిమిరావళి........ఎలా కనిపిస్తుంది.          ఆకష్టజీవుల కళ్ళనుంచి కారుతున్నది---కన్నీరు కాదు---రుధిరస్రవంతులు,అయినా.....అవి రేగుతున్న మంటలను ఆర్పలేకపోయాయి.          కారి,కారి,కన్నీళ్లు ఆఖరయి---యిక కారడం మానుకున్నాయి, చారికలు మాత్రం, పొగచూరిన ముఖాలమీద,ఎండిన మహానదుల్లా,స్పష్టం గా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  అగ్నికి ఆకలి తీరింది. ఎవరి ప్రయత్నము అక్కరలేకుండానే, తగ్గిపోయింది.          గృహస్తుల కండ్ల వెలుగూ ఆరింది కాని ఆ అభాగ్యుల హృదిలోని మంటలు, నాలుకలు కీడుతూ, తడుముతూనే ఉన్నాయి.          దుష్టశక్తులు వేసుకున్న చలిమంటలో, తమ చలిని కూడా  పొగొట్టుకున్న జనం.........సంతాపం ఒలికించి,నటించి
జారుకున్నారు ఒక్క రొక్కరే కాలిన తమ యిండ్లను చూసుకుని గుక్కపట్టి ఏడ్చిన, దురదృష్టవంతులు—అలా ఏడ్చి, సొమ్మసిల్లి, పోయారు.          మృత్యువులాంటి చీఁకటి తలుపు తెరుచుకుని          , లోకాన్ని ఆక్రమించింది.                    హృదయాలు పగిలే నీరవనిశ్శబ్ద నిశీధినిలో ----నిరాశ్రయులు బూదిప్రోగులైన తమ చిరాశ్రయాలను వీడి-----చెట్లను ఆశ్రయించారు.          చెట్లు విలవిలలాడి, ఆకులు కదలటం మాని, మూగగా వారిసంతాపంలో పాలుపంచుకుని,చెమర్చాయి.          ఆ తప్త హృదయాలకు---ఆరాత్రి ఒక దు:ఖతపస్సు·            *    *ఈ విషాధ సంఘటన రెండు బృందాలకు మహత్తరమైన అవకాశం కల్పించింది. ప్రధమ బృందం-----మనసుకు రంగేసుకుని, అనుక్షణం నటించే, ప్రజాబాంధవ వినాయకరావు—ముఠా.ద్వితీయబృందం    మనసుకూ ముఖానికి, రంగేసుకునే ఔత్సాహిక నాటక సమాజం. సదరు బృందాల అధినేతలు, యీ అమూల్యావకాశాన్ని సద్విని యోగపరచుకునేందుకు,సమగ్ర పధకాలు,తృటిలో రూపొందింపచేశారు.          ఏమైనా ----ఈ వేడి మీదే –ప్రదర్శన ఇచ్చి తీరాలి. నా నిర్ణయానికి సవరణ ప్రతిపాదించకు, నీ పుణ్యముంటుంది. పోర్షన్సు --ఇంతకు ముందు కొంచెం – నలిగినవేకదా—మరేం –ఫర్వాలేదు. నువ్వు మాత్రం శల్యసారధ్యం చేయకు—నీ నీతులు,ధర్మాలూ కట్టి,బెట్టి, కట్ట కట్టి, తలకింద ఉంచుకో.  నాటకం తప్పకుండా విజయవంతం అవుతుంది. అదంతా----ఆ తరువాత సంగతి.---నాటకం ప్రదర్శించామా లేదా అన్నదే మనకు ముఖ్యం.          నువ్వూ—నేనూ, నాటకం వేస్తే టిక్కట్టు కొని వచ్చేవాడెవడు.          అందుకే మన బోటి ఔత్సాహిక నాటక  ప్రదర్శనాలకు –ఏ కరువులో ఉత్సవాలో, స్వతంత్ర దినోత్సవాలో, బ్యాక్ గ్రౌండులో ఏడవాలి.---బలంగా..-అప్పుడు కంపల్సరీ బుకింగుచేయొచ్చు. కానీ ఖర్చు చేతికి తగలదు- మన కండూతీ దివ్యంగా తీరుతుంది.రాక రాక మహత్తరమైన అవకాశం మనల్ని వరించి వచ్చింది.  అవకాశం అడుగడుగునా అప్పులవాళ్ళలా ఎదురవదు. అరుదుగా ఋణదాతలాగా తొంగి చూస్తుంది. ఆ అదను, పదనూ పోకుండా,వినియోగించుకోవడంలోనే ఉంది –మన ఉపజ్ఞ – అంతా.స్వార్ధం అంటావ్ --- అంతేనా  నీ బుఱ్ఱలో మట్టి చేరిందని అర్ధం.  యీ లోకంలో, కాలం లో స్వార్ధం లేనివాడెవడూ..ముఖానికి రంగేసుకోనివారే నటిస్తున్నారే......మనం నటించడం లో తప్పేముంది.    చూడు...ఆ వినాయకరావు  ...మనలా ముడుచుకు పోయి కూర్చోలేదే..బృందాన్ని చేరదీసి, కాఫీలు పోయించి, బాజాలు మోగించేస్తున్నాడు. వాడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి బాగు పడాలంటే. యిలా ధర్మోపదేశం, గీతోపదేశం చేశాడు.  కర్తవ్యమూఢుడై అర్జునిలా ఎదురు తిరిగిన సమాజంలో ఒక ప్రధాన సభ్యుడికి----సమాజ దర్శకుడు, నిర్వాహకుడు.
ఏమైనాసరే ----పోర్షనైనా నోటికి రానిదే, రంగేసుకుని, రంగస్థలాన పడితే...... మనం ప్రదర్శించింది నాటకమనిపించుకోదు.---- మన అవివేకం,స్వార్ధం ప్రదర్శించి నట్టవుతుంది.  అని సలహాయిచ్చాడు ఆసభ్యుడు –కర్కశంగా. . . .
ఆరిన బీడీఅంటించు కుందికినానిన అగ్గిపెట్టెతో తంటాలు పడుతున్న - - -ప్రాంప్టరు
చేయి వేస్తేచాలు ---తన జీవితంలానే అపశ్రుతులు పలికే హార్మణీవైపు తదేకంగా చూస్తోన్న . . .----హర్మోనిష్టు.మదిని తెరచి, ఒళ్ళు విరుచుకున్న తీయని ఆశల్ని ఆకశంలోకి వదిలేసి, అవి అక్కడ ఆర్కెష్ట్రా మినహా, హాయిగా సోలో పాడుకుంటుంటే -----కళ్ళు మూసుకుని చూస్తూ, మత్తుగా నవ్వుకుంటున్న ---హీరో,ఏకాంతంగా, నిలుచున్న ఎదురింటి అమ్మాయికి --- కిటికీలోంచీ, ప్రేమ సందేశాన్ని, సాంకేతికంగా ప్రసారం చేస్తున్న ---సపోర్టింగ్ హీరో-----అంతా ఒక్కసారి ఉలికిపడి, తరువాత కుదుటపడి, దర్శకుని అమూల్యాభిప్రాయాలకు మద్దతు యిచ్చి, దుర్మార్గంగా ఎదురిస్తున్న ఏకైక ---సభ్యత నెరుగని, సభ్యుని నోరుమూసి పీకనులమడానికి ప్రయత్నించారు.---యిక విధిలేక పాపం ఆ ఒక్కడూ, అమాయకుడూ, తన ఒప్పు, తప్పేనని ఒప్పేసుకుని---చెంపలేసుకున్నాడు చప్పుడు కాకుండా....వినాయకరావు, భారీఎత్తున సంతాప సభ జరిపించి రెండు మైకుల మధ్య కడివెడు కళ్ళ నీళ్ళు ఒంపేసి -----జరిగి పోయిన దారుణ విషాధ సంఘటనకు నా గుండె కరిగిపోయింది.అని నటించి---అగ్ని బాధితుల సహాయార్ధం, సహృదయులైన ప్రజలు, విరివిగా విరాళాలు యీయవలసినదిగా విజ్ఞప్తి చేసాడు.ఇకపోతే—ఔత్సాహీక నాటక బృందం –అతనికి తీసికట్టు కాకుండా, పోటీపడకుండా కనుపించిన ప్రతీ వ్యక్తి చేతిలోనూ అగ్ని బాధితుల సహాయార్ధం మహోజ్వలనాటక ప్రదర్శన ---అంతా యింతే--- అన్న కరపత్రం ఉంచేరు---చిరునవ్వుతోగత గోదారి వరద బాధితుల సహాయార్ధం తయారు చేయించిన డబ్బాలు చాలవని ---కొత్తవి పురమాయించి----పాతవాటికి మూతలు అతికించి ---ఎదురు తిరగబోయే, ప్రతి కక్షులమూతులు కూడా బిగించేశాడు.  వినాయకరావు.ఔత్సాహిక నాటక బృందం---ఉరకలు వేసే ఉత్సాహంతో, కనుపించిన ప్రతి వాడికీ టిక్కట్టు అంటకట్టి –నాటకం చాల బాగుంటుందని తమకు తామే చెప్పేసుకుని, తప్పక రావలసిందని గట్టిగా నొక్కి చెప్పేరు, ఈ సందర్భంలో రిహార్సలు మాటే మరచి పోయారు.·         *    *అంతా యింతే--- నాటక ప్రదర్శనవేయవధి లేని కారణంగా చేత—యింకా అనేక కారణాంతరాలచేత అనుకున్నంత గొప్పగా ప్రదర్శించ లేకపోయినందుకు మన్నింప ప్రార్ధన అని నాటకాంతాన్ని ముచ్చటించి, ప్రేక్షకులచేత తిట్లనుంచి బయటపడడానికి ప్రయత్నంచి విఫలమయ్యారు...ప్రదర్శకులు.          ఆ మరునాడు---నాటకం జమా ఖర్చులు నిద్రలేని కళ్ళతోనే లెక్క వేయడం జరిగింది. కలక్షను –250 రూపాయల చిల్లర, సదరు లెక్క ప్రకారం పదిరూపాయల పైచిల్లర – మిగులు తేలిందని ---తేలింది.  కానీ యదార్ధం గా చిల్లర తప్ప  పది రూపాయల బాలెన్సు చేతిలో కనిపించలేదు. ఎక్కడో తథావతు వచ్చి ఉంటుందని – సర్దేసుకుని, కళ్ళు పడి పోతున్నాయని చిల్లర డబ్బుల  తోలు చప్పరిచారు.  నాటక సమాజం నిర్వాహకులు  --- సభ్యులు.          అనంతరం మనం చేయ గనిగిన దంతా చేశాం, వారి ఖర్మకు మనం కర్త లం కాదు గదా  అని పెదవి చప్పరించారు.          అవును..అగ్ని బాధితుల పేరుతో సహృదయులైన ప్రజలనుంచి ధనాన్ని వసూలు చేసి, మన సరదాలకోసం, స్వార్ధం కోసం, తగలేసి—మనం చెయగలిగినదంతా చేశాం – యింకేం చేయాలి.  ఒక్కపైసా కూడా ఆ అభ్యాగ్యుల కందలేదు...పాపం వారు మనమేదో ఒరగ బెడతామని ఆశతో ఎదురుచూస్తున్నారు---ఛీ . . . మన కన్నా చీడపురుగులు మరొకరుండ బోరు  అని దురుసుగా అనేసి విసురుగా లేచి పోయాడు  ---ఆది నుంచీ నాటకం ప్రతిపాదనకు ఎదురు తిరుగుతున్న – సహృదయ సమాజ సభ్యుడు.          వినాయకరావు చేతి మీదుగా వసూలయి న చందాల మొత్తం లో, ఎన్నో వంతు అగ్ని బాధితులకు  అందచేయ బడిందో    ఎవరకూ తెలియదు.------ కానీ ఓ చిన్న మేడ అర్ధాంగి పేర రిజిష్టరుచేయించాడు వినాయకరావు అన్న నీలి వార్త చెదరుగా వినిపించింది.          ఈ వార్తను వినాయక రావు, అభిమానులు, అనుయాయులు ఖండిచనూ లేదు,ధృవపరచనూ లేదు.·         *    *యింకా కాలి పొగచూరిన గోడలు, వాడలూ, పగిలిన గుండెలతో పగలబడి సమాజాన్ని చూస్తూ పరిహాసంగా నవ్వుకుంటున్నాయి.యీ నవ్వులు  ---    మూసుకొని స్వార్ధపు ప్రహారీలను దాటి, మాసి పోతున్న సమాజ హృదయానికి వినిపిస్తున్నాయా.  ఎందుకో    నేడు  సానుభూతిలో కూడా ఇంత స్వార్ధం తొంగి చూస్తూంది...సమాజానికి అవసాన కాలం సమీపిస్తున్నది కాబోలు-----అంతే....అంతే అయి ఉంటుంది...... 
          సహాయానికి,సందేహం దేనికి ?... అభాగ్యులనూ, ఆర్తులనూ, ఆదుకోవలసిన సమయంలో....అలా...ముడుచుకు పోయినిలబడతారేం ?....          ఇవన్ని అర్ధంలేని ప్రశ్నలు.....చచ్చు ప్రశ్నలు... వారికి అవసరం లేదు... కాలుతున్నవి వారి కొంపలు కావు.....అంతే .....అదే దాని అంతరార్ధం.          ఆ అనంత జనంలో, శతాంశం ముందుకురికితే, మంటలు ఏనాడో ఆరేవి., మాటలతో మంటలెలా ఆరుతాయి..          వారంతా ----------నాగరీకులు. గాబర్డీను ప్యాంటు, అమెరికన్ షర్టులతో కుళ్ళిపోతున్న గుండెల్ని కప్పుకుని----మానవాకృతిని నిలిచిన మృగాలు,సృగాలాలు.          మంటలంబరాన్ని, అంటుతున్నాయో లేదో నని అంచనా కట్టుకుంటున్నారు.అగ్గి ఉద్భవించడానికి కారణాలు, శోధిస్తున్నారు.          మంటలు ఒక ఇంటి మీదనుంచీ,మరొక ఇంటి మీదకు అడుగులు వేస్తూ పైశాచిక నృత్యం చేస్తూ కడుపు కట్టుకుని,ఆర్జించిన, నికృష్ట కష్టజీవుల,నిక్షిప్త వస్తు సంచయాన్ని కడుపున పెట్టుకుని----త్రేన్చుకుంటున్నాయి.
ఈ ప్రళయ నృత్యం చూసిన కొందరి హృదయాలు కథాకళి నృత్యంచేసాయి.ఎందుకో?          విధి వెలిగించుకుంటున్న దీపావళిని వింతగా, చోద్యంగా, చూస్తున్న ఆర్ద్రతలేని హృదయాలకు,అభాగ్య జీవుల ముఖాలను పట్టుకుంటున్న శోకాంధ తిమిరావళి........ఎలా కనిపిస్తుంది.          ఆకష్టజీవుల కళ్ళనుంచి కారుతున్నది---కన్నీరు కాదు---రుధిరస్రవంతులు,అయినా.....అవి రేగుతున్న మంటలను ఆర్పలేకపోయాయి.          కారి,కారి,కన్నీళ్లు ఆఖరయి---యిక కారడం మానుకున్నాయి, చారికలు మాత్రం, పొగచూరిన ముఖాలమీద,ఎండిన మహానదుల్లా,స్పష్టం గా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  అగ్నికి ఆకలి తీరింది. ఎవరి ప్రయత్నము అక్కరలేకుండానే, తగ్గిపోయింది.          గృహస్తుల కండ్ల వెలుగూ ఆరింది కాని ఆ అభాగ్యుల హృదిలోని మంటలు, నాలుకలు కీడుతూ, తడుముతూనే ఉన్నాయి.          దుష్టశక్తులు వేసుకున్న చలిమంటలో, తమ చలిని కూడా  పొగొట్టుకున్న జనం.........సంతాపం ఒలికించి,నటించి
జారుకున్నారు ఒక్క రొక్కరే కాలిన తమ యిండ్లను చూసుకుని గుక్కపట్టి ఏడ్చిన, దురదృష్టవంతులు—అలా ఏడ్చి, సొమ్మసిల్లి, పోయారు.          మృత్యువులాంటి చీఁకటి తలుపు తెరుచుకుని          , లోకాన్ని ఆక్రమించింది.                    హృదయాలు పగిలే నీరవనిశ్శబ్ద నిశీధినిలో ----నిరాశ్రయులు బూదిప్రోగులైన తమ చిరాశ్రయాలను వీడి-----చెట్లను ఆశ్రయించారు.          చెట్లు విలవిలలాడి, ఆకులు కదలటం మాని, మూగగా వారిసంతాపంలో పాలుపంచుకుని,చెమర్చాయి.          ఆ తప్త హృదయాలకు---ఆరాత్రి ఒక దు:ఖతపస్సు·            *    *ఈ విషాధ సంఘటన రెండు బృందాలకు మహత్తరమైన అవకాశం కల్పించింది. ప్రధమ బృందం-----మనసుకు రంగేసుకుని, అనుక్షణం నటించే, ప్రజాబాంధవ వినాయకరావు—ముఠా.ద్వితీయబృందం    మనసుకూ ముఖానికి, రంగేసుకునే ఔత్సాహిక నాటక సమాజం. సదరు బృందాల అధినేతలు, యీ అమూల్యావకాశాన్ని సద్విని యోగపరచుకునేందుకు,సమగ్ర పధకాలు,తృటిలో రూపొందింపచేశారు.          ఏమైనా ----ఈ వేడి మీదే –ప్రదర్శన ఇచ్చి తీరాలి. నా నిర్ణయానికి సవరణ ప్రతిపాదించకు, నీ పుణ్యముంటుంది. పోర్షన్సు --ఇంతకు ముందు కొంచెం – నలిగినవేకదా—మరేం –ఫర్వాలేదు. నువ్వు మాత్రం శల్యసారధ్యం చేయకు—నీ నీతులు,ధర్మాలూ కట్టి,బెట్టి, కట్ట కట్టి, తలకింద ఉంచుకో.  నాటకం తప్పకుండా విజయవంతం అవుతుంది. అదంతా----ఆ తరువాత సంగతి.---నాటకం ప్రదర్శించామా లేదా అన్నదే మనకు ముఖ్యం.          నువ్వూ—నేనూ, నాటకం వేస్తే టిక్కట్టు కొని వచ్చేవాడెవడు.          అందుకే మన బోటి ఔత్సాహిక నాటక  ప్రదర్శనాలకు –ఏ కరువులో ఉత్సవాలో, స్వతంత్ర దినోత్సవాలో, బ్యాక్ గ్రౌండులో ఏడవాలి.---బలంగా..-అప్పుడు కంపల్సరీ బుకింగుచేయొచ్చు. కానీ ఖర్చు చేతికి తగలదు- మన కండూతీ దివ్యంగా తీరుతుంది.రాక రాక మహత్తరమైన అవకాశం మనల్ని వరించి వచ్చింది.  అవకాశం అడుగడుగునా అప్పులవాళ్ళలా ఎదురవదు. అరుదుగా ఋణదాతలాగా తొంగి చూస్తుంది. ఆ అదను, పదనూ పోకుండా,వినియోగించుకోవడంలోనే ఉంది –మన ఉపజ్ఞ – అంతా.స్వార్ధం అంటావ్ --- అంతేనా  నీ బుఱ్ఱలో మట్టి చేరిందని అర్ధం.  యీ లోకంలో, కాలం లో స్వార్ధం లేనివాడెవడూ..ముఖానికి రంగేసుకోనివారే నటిస్తున్నారే......మనం నటించడం లో తప్పేముంది.    చూడు...ఆ వినాయకరావు  ...మనలా ముడుచుకు పోయి కూర్చోలేదే..బృందాన్ని చేరదీసి, కాఫీలు పోయించి, బాజాలు మోగించేస్తున్నాడు. వాడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి బాగు పడాలంటే. యిలా ధర్మోపదేశం, గీతోపదేశం చేశాడు.  కర్తవ్యమూఢుడై అర్జునిలా ఎదురు తిరిగిన సమాజంలో ఒక ప్రధాన సభ్యుడికి----సమాజ దర్శకుడు, నిర్వాహకుడు.
ఏమైనాసరే ----పోర్షనైనా నోటికి రానిదే, రంగేసుకుని, రంగస్థలాన పడితే...... మనం ప్రదర్శించింది నాటకమనిపించుకోదు.---- మన అవివేకం,స్వార్ధం ప్రదర్శించి నట్టవుతుంది.  అని సలహాయిచ్చాడు ఆసభ్యుడు –కర్కశంగా. . . .ఆరిన బీడీఅంటించు కుందికినానిన అగ్గిపెట్టెతో తంటాలు పడుతున్న - - -ప్రాంప్టరుచేయి వేస్తేచాలు ---తన జీవితంలానే అపశ్రుతులు పలికే హార్మణీవైపు తదేకంగా చూస్తోన్న . . .----హర్మోనిష్టు.మదిని తెరచి, ఒళ్ళు విరుచుకున్న తీయని ఆశల్ని ఆకశంలోకి వదిలేసి, అవి అక్కడ ఆర్కెష్ట్రా మినహా, హాయిగా సోలో పాడుకుంటుంటే -----కళ్ళు మూసుకుని చూస్తూ, మత్తుగా నవ్వుకుంటున్న ---హీరో,ఏకాంతంగా, నిలుచున్న ఎదురింటి అమ్మాయికి --- కిటికీలోంచీ, ప్రేమ సందేశాన్ని, సాంకేతికంగా ప్రసారం చేస్తున్న ---సపోర్టింగ్ హీరో-----అంతా ఒక్కసారి ఉలికిపడి, తరువాత కుదుటపడి, దర్శకుని అమూల్యాభిప్రాయాలకు మద్దతు యిచ్చి, దుర్మార్గంగా ఎదురిస్తున్న ఏకైక ---సభ్యత నెరుగని, సభ్యుని నోరుమూసి పీకనులమడానికి ప్రయత్నించారు.---యిక విధిలేక పాపం ఆ ఒక్కడూ, అమాయకుడూ, తన ఒప్పు, తప్పేనని ఒప్పేసుకుని---చెంపలేసుకున్నాడు చప్పుడు కాకుండా....వినాయకరావు, భారీఎత్తున సంతాప సభ జరిపించి రెండు మైకుల మధ్య కడివెడు కళ్ళ నీళ్ళు ఒంపేసి -----జరిగి పోయిన దారుణ విషాధ సంఘటనకు నా గుండె కరిగిపోయింది.అని నటించి---అగ్ని బాధితుల సహాయార్ధం, సహృదయులైన ప్రజలు, విరివిగా విరాళాలు యీయవలసినదిగా విజ్ఞప్తి చేసాడు.ఇకపోతే—ఔత్సాహీక నాటక బృందం –అతనికి తీసికట్టు కాకుండా, పోటీపడకుండా కనుపించిన ప్రతీ వ్యక్తి చేతిలోనూ అగ్ని బాధితుల సహాయార్ధం మహోజ్వలనాటక ప్రదర్శన ---అంతా యింతే--- అన్న కరపత్రం ఉంచేరు---చిరునవ్వుతోగత గోదారి వరద బాధితుల సహాయార్ధం తయారు చేయించిన డబ్బాలు చాలవని ---కొత్తవి పురమాయించి----పాతవాటికి మూతలు అతికించి ---ఎదురు తిరగబోయే, ప్రతి కక్షులమూతులు కూడా బిగించేశాడు.  వినాయకరావు.ఔత్సాహిక నాటక బృందం---ఉరకలు వేసే ఉత్సాహంతో, కనుపించిన ప్రతి వాడికీ టిక్కట్టు అంటకట్టి –నాటకం చాల బాగుంటుందని తమకు తామే చెప్పేసుకుని, తప్పక రావలసిందని గట్టిగా నొక్కి చెప్పేరు, ఈ సందర్భంలో రిహార్సలు మాటే మరచి పోయారు.·         *    *అంతా యింతే--- నాటక ప్రదర్శనవేయవధి లేని కారణంగా చేత—యింకా అనేక కారణాంతరాలచేత అనుకున్నంత గొప్పగా ప్రదర్శించ లేకపోయినందుకు మన్నింప ప్రార్ధన అని నాటకాంతాన్ని ముచ్చటించి, ప్రేక్షకులచేత తిట్లనుంచి బయటపడడానికి ప్రయత్నంచి విఫలమయ్యారు...ప్రదర్శకులు.          ఆ మరునాడు---నాటకం జమా ఖర్చులు నిద్రలేని కళ్ళతోనే లెక్క వేయడం జరిగింది. కలక్షను –250 రూపాయల చిల్లర, సదరు లెక్క ప్రకారం పదిరూపాయల పైచిల్లర – మిగులు తేలిందని ---తేలింది.  కానీ యదార్ధం గా చిల్లర తప్ప  పది రూపాయల బాలెన్సు చేతిలో కనిపించలేదు. ఎక్కడో తథావతు వచ్చి ఉంటుందని – సర్దేసుకుని, కళ్ళు పడి పోతున్నాయని చిల్లర డబ్బుల  తోలు చప్పరిచారు.  నాటక సమాజం నిర్వాహకులు  --- సభ్యులు.          అనంతరం మనం చేయ గనిగిన దంతా చేశాం, వారి ఖర్మకు మనం కర్త లం కాదు గదా  అని పెదవి చప్పరించారు.          అవును..అగ్ని బాధితుల పేరుతో సహృదయులైన ప్రజలనుంచి ధనాన్ని వసూలు చేసి, మన సరదాలకోసం, స్వార్ధం కోసం, తగలేసి—మనం చెయగలిగినదంతా చేశాం – యింకేం చేయాలి.  ఒక్కపైసా కూడా ఆ అభ్యాగ్యుల కందలేదు...పాపం వారు మనమేదో ఒరగ బెడతామని ఆశతో ఎదురుచూస్తున్నారు---ఛీ . . . మన కన్నా చీడపురుగులు మరొకరుండ బోరు  అని దురుసుగా అనేసి విసురుగా లేచి పోయాడు  ---ఆది నుంచీ నాటకం ప్రతిపాదనకు ఎదురు తిరుగుతున్న – సహృదయ సమాజ సభ్యుడు.          వినాయకరావు చేతి మీదుగా వసూలయి న చందాల మొత్తం లో, ఎన్నో వంతు అగ్ని బాధితులకు  అందచేయ బడిందో    ఎవరకూ తెలియదు.------ కానీ ఓ చిన్న మేడ అర్ధాంగి పేర రిజిష్టరుచేయించాడు వినాయకరావు అన్న నీలి వార్త చెదరుగా వినిపించింది.          ఈ వార్తను వినాయక రావు, అభిమానులు, అనుయాయులు ఖండిచనూ లేదు,ధృవపరచనూ లేదు.·         *    *యింకా కాలి పొగచూరిన గోడలు, వాడలూ, పగిలిన గుండెలతో పగలబడి సమాజాన్ని చూస్తూ పరిహాసంగా నవ్వుకుంటున్నాయి.యీ నవ్వులు  ---    మూసుకొని స్వార్ధపు ప్రహారీలను దాటి, మాసి పోతున్న సమాజ హృదయానికి వినిపిస్తున్నాయా.  ఎందుకో    నేడు  సానుభూతిలో కూడా ఇంత స్వార్ధం తొంగి చూస్తూంది...సమాజానికి అవసాన కాలం సమీపిస్తున్నది కాబోలు-----అంతే....అంతే అయి ఉంటుంది......