Friday, April 5, 2013

అదృశ్య బంధాలు

అకుండి రాజేశ్వరరావు 
   
               కృష్ణా పత్రిక   తే 12-01-1963 దీ ప్రచురితము



క్షణకాలం టైపు చేయవలసిన కాగితాలు చూసుకుని, సన్నగా తనలో తానే నవ్వుకున్నది- రమణి
          పిరికివాడి గుండెలా మిషను దడదడ మంటూ పనిచెయ్యడం ఆరంభించింది.
ఎందుకోయీ అర్ధం లేని కరెస్పాండెన్స్... ఉత్తకాలయాపనకు కాకపోతే...పాపం  ఎవడో అభాగ్య, అధ్యాపకుడు...రిటైరయి ఆరు సంవత్సరాలు కావస్తున్నా—అవనికి రావలసిన పి.ఏఫ్.పారీరు. అంతకంతకూ, యీ ఆఫీసుల్లో కుళ్ళు పేరుకు పోతూంది.  ప్రతీ వాడూ తడుముకుందుకే తాపత్రయం,-- ఊ... యీ తప్పుడు పనుల్లోంచీ --- ఎప్పుడు తప్పుకుంటారో వీళ్ళంతా....తెలీదు. చిరాగ్గా టైపు చేస్తూనే ఆలోచిస్తూంది.
          యింతకు పూర్వం ఏ ఆలోచనా లేకుండానే, యంత్రవతుగా, తన పని తాను చేసుకు పోయేది ---పమణి.  కాని యిప్పుడు ఎందుకో ప్రతీ చిన్ విషయంకూడా, ఆమెలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.  ఆఫీసంతా శ్మశానంలా నిశ్శబ్ధం గా ఉంది.
          టైపు మిషను మాత్రం దయ్యంలా రొద చేస్తున్నది..  యింతలో ---స్వింగ్ డోర్సు తెరుచుకుంటూ—కమీషనర్ ప్రవేశించాడు.   కాస్త యిబ్బంది గానే లేచి నిలబడింది - రమణి
అయిపోవచ్చిందా.... అందినంత వరకూ జాకెట్టు క్రింద వంపులను చూస్తూ ప్రశ్నించాడు – కమీషనర్.  ఆఁ . . . . .దాదాపు.
వెధవ . . . . . . పనితో అలసి పోతున్నావు కదూ!”...
తప్పదు కదా...
ఏమయినా   నీబోటి దానికి యీ పాడు పనేం లాభం లేదు.
పెదవి వడిచి – పొడిగా నవ్వాడు.
రమణి నవ్వుదామనుకుని మానేసింది.
చూడు రమణీ   నీతో ఒక విషయం మాట్లాడాలి అనుమతిస్తావు కదూ!..
అపరిచిత సంబొఘనకు తెల్లబోయింది ----రమణి.
నా మాటలను అర్ధం చేసుకోగలవనే నమ్మకంతోనే వివరిస్తున్నాను అని ఉపోద్ఘాతం పలికి ప్రారంభించాడు కమీషనరు.
యింతవరకూ --- ఎలానో జీవితం నడచిపోయింది, నాయిష్టా యిష్టాలతో నిమిత్తం లేకుండానే, యిక యీ జీవితం అందిచ్చే అనుభవాలను భరిండచేందుకు శక్తి చాలటం లేదు, స్త్రీ సహాయం అవుసరమని పిస్తోంది.  అలాఅని ఎవరో ఒక అపరిచితమైన స్త్రీ ని కట్టుకుని మరికొన్ని చిక్కులను తెచ్చుకోవాలని లేదు, యీనాడు నాక్కావలసింది, లోకానికి, కాలానికి లొంగిపోయే బలహీనమైన స్త్రీ కాదు.  నా జీవిత గమనాన్ని తీర్చిదిద్దుతూ, శాసిస్తూనే, లాలిస్తూ—జీవితపు లోతుల వరకూ నడిపించగల స్త్రీ కావాలి.
వింతగా మెరిసి పోతున్న అతని కళ్ళలోకి చూస్తూ మనసు తెరచి, అతను వెలువరిస్తున్న ప్రతి మాటనూ అత్యంత శ్రధ్ధాశక్తులతో వింటూ నిలబడింది రమణి, ఏనాడూలేని యీ మాటలతీరు ఆమెకు అంతు పట్టడం లేదు. చాలా ఆశ్చర్యపడసాగింది.
రమణీ నాక్కావలసిన గుణాలన్ని నీలో ఉన్నాయి. నువ్వు నా జీవితంలో తారసిల్లడం నిజంగా నా అదృష్టంగా ---నా జీవితంలో పాలు పంచుకుంటూ, నడిపించగలవా.  అని అభిప్రాయాన్ని తెలియబరచాడు.
ఉన్నట్టుండి రమణి మాత్రం ఏమని సమాధానం చెప్పగలదు ఏమీ పాలు పోక   చీరచెంగు వ్రేలికి చుట్టబెడుతూ నిలుచుంది  --- రమణి.
మరేం తొందర్లేదు... నిదానంగా ఆలోచించి   నీ నిర్ణయం తెనియజేయి.  యిటువంటి విషయాల్లో తొందర మంచిది కాదు కూడా.. అని అన్నాడు.... గాలికి ఊగుతూన్న ఆమెకురులను చూస్తూ.
అలానే. అని ముక్తసరిగా అంటూ...తలఊపింది..రమణి.
తృప్తిగా చిన్నచిరునవ్వు నవ్వి ఎంత హఠాత్తుగా వచ్చాడో, అంత హఠాత్తుగానే నిష్క్రమించాడు – కమీషనర్.
కొద్ది నిమిషాలు అలానే నిలబడి పోయింది. రమణి.
ఎంత సూటిగా, తన అభిప్రాయాన్ని తెలియచేసాడు  యింతకాలంగా పరిచయమున్న  అతని మనస్సులో యిలాంటి అభిప్రాయామున్నా  అతని మనస్సులో యిలాంటి అభిప్రాయం ఉన్నట్లు రేఖామాత్రంగా నైనా తాను తెలుసుకో లేక పోయింది.
ఇంతలోకి హెడ్ క్లర్క్ వచ్చి ---అర్జంటుగా టైపు చెయ్యాలంటూ ఒక లెటరూ --- ఇదిగో –చిత్తగించు అంటూ ఒక కరపత్రం విసురుగా అందిచ్చాడు.
ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి.  టైపు చేయాల్సిన లెటరు ఓసారి చదివి పడేసి ---కరపత్రం తీసింది.  అటూ అటూ తిరగేసి ఊహూఁ అని కోపంగా మూలిగి –ట్రేలి విసిరేసింది.
హెడ్ క్లర్క్- ఆమె మొఖంలో మారిన రంగులను చూసి అదోలా నవ్వాడు. రమణి మనసు లోనే అసహ్యించుకొంది.  ఏదో కలుగ చేసుకుని మాట్లాడబోయేడు. హెడ్ క్లర్కు అలవాటు ప్రకారం. ఆమె వినిపించుకోకుండా, టైపు చెయ్యడం ప్రారంభించింది.  ఆమె తలబిరుసు తనానికి మంటపుట్టుకొస్తున్నా - - - - కనుపిస్తున్న ఆమెఅందానికి మెత్తపడిపోయి - - రెండు గుటకలు మింగి - - -కాళ్ళకు బుద్ది చెప్పాడు.
వ్రేళ్ళు నడుస్తునే వున్నాయి.  రమణి మదిలో ఆలోచనలు ముసురుకుంటూనే ఉన్నాయి.  వేటిదారి వాటిది.  యిటువంచి నాటకాల పిచ్చి వాడు ఉద్యోగం చేసేదేమిటి- - పుచ్చిగాని. దుకే కాబోలు నాలుగు రోజుల నుంచీ స్థిమితంగా ఒక్కనిమిషం కూడా సీటులో లేడు – విశ్వం.
నాటకమంటే చాలు - నిద్రాహారాలు మాని అఘోరిస్తాడు. కాని ఆఫీసు పనంటే మాత్రం ఎక్కడలేని బధ్ధకం. పోనీ సవ్యంగా, నమ్రతగా ఉంచాడా...అదీ లేదు. కమీషనర్ నుంచీ, బిల్ కలక్టరు వరకూ ప్రతీవాడితోనూ తగవులే. ఒకసారి సస్పెండు, మరొకసారిడిస్మిస్ అయ్యేవరకూ వచ్చ్దింది. అయినా బుద్ధి ఉంటేగా.  యింకా ఎంత కాలానికి తెలుస్తుంది బతకడం.
ఫైల్సు మధ్య పోర్షన్ కాగితాలుంచుకుని ఆఫీసులో బట్టీ పెడుతుంటే ఎవరు మాత్రం ఎంతకాలం ఊరుకుంటారు.  ఏదో కమీషనర్ మంచివాడు కాబట్టీ కొంతలో కొంత సరి పోతూంది.
యివతల తన పని చూసుకుంటూనే, విశ్వం సీటు కూడా చూసుకోవలసి వస్తూంది.  ఏంమనిషి ఎంత చెప్పినా వినిపించుకోడేం. చెప్తున్నంతసేపూ ఒకటో క్లాసు కుర్రాడిలా బుధ్ధిగా వింటాడు.  ఒక క్షణం దాటితే మరలా యధాప్రకారం తయారు.  సరిగ్గా అయిదు సంవత్సరాలు యీ సీటులోకి వచ్చిందితను.  అప్పటినుంచీ యిదే వరుస. కాగితాల అర్ధంతో నిమిత్తం లేకుండానే – ఉన్నదున్నట్లు టైపు చేసి పారెయ్యడం, విసుగనిపిస్తోంది తనకు.  సుఖంగా జరిగిపోవలసిన జీవితంలో అయిదు సంవత్సరాలు యీ సీటు క్రిందే ముక్కలయ్యాయి.యిక యీపని మానెయ్యడం మంచిది. ఉత్త చెత్త బ్రతుకు, ఎంత కాలం చూసిన, అరుగు తూన్న కీబోర్డు, ఊగుతూన్న సీటు—పాపంలా పేరుకు పోతూన్న కాగితాలు, తనూనూ... ఛ...ఛ...ఖర్మ.  
గతాన్ని వర్తమానాన్ని,   ముడి వేస్తూ ఆలోచనలు అలసిపోతున్నాయి ఆమె చిన్న మెదడులో... తనకూ అందరిలానే ఘనం గా పెళ్ళి జరిగింది – ఒక లాయరుతో, సుఖించింది కొద్ది కాలం.ఒకే ఒక సంఘటనతో తన జీవితమంతా తల్లకిందులైంది.
ఆరోజున అల్లాడిందనితను. ఎంత శూన్యంగా అగుపించింది కాలం.  ఒక్కరూతన్ను అర్ధం చేసుకో లేక పోయారు.. ఆఖరుకు కట్టుకుని, కాపురం చేసినవాడు కూడా,కసాయి వాడుగా మారిపోయాడు.  యింతకూ తను చేసిన తప్పేముంది.  ఒకరు చేసిన పాపాన్ని కళ్ళారా చూడటం- చూసినది ఉదారంగా దాచుకుని కాపాడటం తప్పించి.
అంతమంచితనానికి సమాజం అందిచ్చే ప్రతిఫలం ఇదా..... కాదు......నిజంగా తప్పేచేసింది తను.....ఆడాక్టరు భార్య అవినీతిగా, కంపౌండరు కౌగిట్లో కులుకుతూ ఉంటం......చూసిన వెంటనే, నిర్దయగా ఆమెపరువు రచ్చకెక్కించవలసింది.  కాని తానలా చెయ్యలేదు. ఒక పచ్చని సంసారం .పాడుచెయ్యడం యిష్టం లేకనే ఊరుకుంది. ఆ డాక్టరు భార్యకు విశ్వాసం ఉండాలా...
తానెక్కడైనా బైటపడి అల్లరి చేస్తాననే భయంతో .....ఆమె పాపం తనతలమీదకు నెట్టింది.తనకూ – కంపౌండరుకూ – అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేసింది.  ఆడది చేయవలసిన పనేనా...... కట్టుకున్నవాడూ, యిరుగు పొరుగులూ, అత్తమామలు----అంతా ఆవిషప్రచారానికి లోబడిపోయారు.....
యింతచేసినా ఆమె ఏవినీతిని తను బయట పడెయ్యలేదు... ఆరోజుతోనే అన్నిసంబంధాలూ తెగి పోయాయి ఏకాకిగా మిగిలి పోయింది.  తను తరువాత ఎన్నిచోట్ల తిరిగిందని.... ఒక్కచోట కూడా పట్టుమని పదిరోజులుగడవలేదు, జీవితం మీద మమత తగ్గి పోయింది.  కావాలనే మరీ నాశనమయింది.  ఒక్కొక్కరోజున ఒక్కొక్కడితో పరిచయం.  యీరోజున వాళ్ళముఖాలు లీలగా నైనా గుర్తుకు రావటం లేదు.
సర్వం నాశనం చేసిన సమాజం చెడిపోయానని వేలెత్తిచూపి నవ్వింది.  ఈ కుళ్ళిన సమాజ హృదయంప్రళయం తర్వాత  కూడా బాగు పడదు కాబోలు. ఇక చెడడానికికూడా దారి రొరక్క పోవడంతో – తన జీవితంపై తనకే అసహ్యం వేసి మనసుమరలించుకుని గిరులు గీసుకుని మళ్ళీ నిలకడలోకి వచ్చింది మనస్సు.  యిష్టం వచ్చినట్టు తిరగడం మానుకుంది.  ఎన్ని అనుభవాలు.  కొన్ని తీయనివి. కొన్ని చేదువి.కొన్ని నిరంతరం ఊగించేవయితే మరి కొన్ని అనవరతమూ కదిలించేవి.  యీ చిన్ని జీవితం ఎంత బలమైన సత్య పూరితమైన పాఠాలు నేర్పించింది.  కనీసం తనకు నేర్చుకుందామనే ఆసక్తి లేకపోయినా.. ఎందుకు సుఖపడలేకపోతోంది  యీ జీనితంలోనే సుఖం లేదా.. తెలీదు.  తెలుసుకోలేదు తను.  తెలిసినవారు – తెలిసినట్లు – అందరికీ అర్ధమైటట్లు చెప్పిచావరూ, చచ్చిన వాళ్ళు కూడా తెలిసినట్లు చెప్పిచావలేదాయె. ఎందుకీ...గానుగెద్దు లా బ్రతుకు.. యీలోకంలోకి వచ్చినట్టు ఎవర్ని నిలదీసి అడిగినా సమాధానం రాదు. యిక తనతుతానే తెలుసుకోవాలి కాబోలు. ఎందుకో .... ఎన్న డూ లేనంతగా....శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోతూంది తను. వ్రేళ్ళు నొప్పి పడ్డాయి.
కాగితాలు కట్టకట్టి సొరుగు లో కుక్కి వేసింది. – రమణి
అఫీసు వదిలేసింది.  ఆలోచనలు మాత్రం ఆమెను వదలలేదు.  విశ్వం మద్యహ్నం నుంచి కంటబడలేదు.  ఎక్కడ తిరుగు తున్నాడో, ఏమో.  అయినా విశ్వం – అంటే అంత అపేక్ష ఎందుకు  తన మాట ఒక్కటీ వినడు, పైగా వింటున్నట్టు నటిస్తాడు, వింటున్నానంటాడు.   అంతే...... అందుకనే అంత జాలి పుట్టుకొస్తుందా-----తనకు  లేక పోతే...........
తనలాగే జీవితం అంటే ఖాతరు లేకుండా గడిపేస్తున్నాడనా.   అదలించి – ఆదరించే వారెవరూ లేరనా.. ..చెడిపోతున్నాడనా  వీటి లో ఏది కారణం  లేక అన్నీనా.... అయినా తనకెందుకీ అక్కరలేని తగులాటకం.  అతనెలా పోతే మాత్రం తనకెందుకు.  ఉద్యోగం ఊడి బ్రతుకు అల్లరిపాలైతే ---అతనే అఘోరిస్తాడు.  
ఆమె నడుస్తూనేవుంది. రకరకాల మనుషులు ఆమెను తప్పుకు పోతున్నారు.వింతసందడి చెవిన పడుతోంది.  కొందరు భవిష్యత్తు మీది ఆశ తో అడుగు లేస్తున్నారు, మరికొందరు గతాన్ని తలచుకుంటూ ఏడుస్తున్నారు.  యీనిన్న రేపటులగురించి ఎందుకో అంత ఆందోళన   యీ ఆందోళనే మానవజీవిత సుఖాన్ని దొంగిలించేస్తూంది.
ఇంతలో పబ్లిక్ వర్కు మేస్త్రీ పలకరించాడు.
రమణి ఆలోచనల వలల్లోంచీ బయటపడింది. తరువాత అప్రయత్నంగా అడిగేసింది...  విశ్వం ----కనిపించాడా అని,
యీ రోజు నాటకం కదమ్మా..... అతనెక్కడ కనిపిస్తాడు,  అని జవాబిచ్చి జారుకున్నాడు.
మరల ---రమణికి- ఎందుకో విశ్వం పైనజాలికలిగింది.  ఏమైనాసరే ---..ఈనాటకాలు మానిపించాలి, ఆఫీసు ఎగ్గొట్టడం మాట అటుంచి ఒళ్ళు చెడగొట్టు కంటున్నాడు. ఏమైనా ఒంటికివస్తే, దిక్కా మొక్కా.! ఎవరు చేస్తారు ?
ఎందుకొచ్చిన కళా సేవ, అయినా యిదికళా సేవో,కాంతా సేవో – ఎవరికి తెలుసు
ఎవరో – సిగ్గు, లజ్జ లేని ఆడాళ్ళను తీసుకొచ్చి వారితో సమానంగా – వెధవగంతులు. పోనీ---తనకెందుకు ---అని అనుకుంటూనే తాళంతీసి యింట్లో దూరింది – రమణి.  అనాధ లాంటి శూన్యత్వం ఆమెను ఆహ్వానించింది.  ముఖం కడిగి---చీర మార్చేసుకుని ---ఫ్లాస్కులో –కాఫీ –గొంతులో పోసుకుని—పాతకుర్చీలో కూలబడి -  అలాంటిదే ఓ పాత పత్రక తీసి పేజీలు తిరగెయ్యసాగింది. కధలో ఒక్క ముక్కా తనకు అర్ధం కాలేదు.  ఆమె ప్రయత్నించనూలేదు కూడా...
ఇంతలో కమీషనరు మాటలు జ్ఞప్తికి వచ్చాయి.  పుస్తకం మూసి తీరుబడిగా ఆలోచనలో పడింది.   ఎంత అందంగా,నిర్మలంగా మాట్లాడేడు,ఏమాత్రం ఉద్రేకం  లేకుండా .. అతని సుచన అంగీకరిస్తే  జీవితగతే మారిపోతుంది.  అందమైన బంగళా---ఫర్నిచరూ – పిలిచేసరికి పలికే బంట్రోతులు –చేతినిండా డబ్బు –వెనక కావలసినంత గౌరవం.....
విలాస జీవితం కొంతకాలం తను రుచిచూసి వదిలేసిందే..  వాటిలో మాత్రం ఏముంది కలుక,అదంతా ఉత్తసుఖాభాస మనల్ని మనం మోసగించుకోవడం-.... . . . .  అందుకనే కాబోలు యీ పేద జీవితంలో కూడా విలాసాల వైపు మనసు పోలేదు.
నిజానికి యీనాడు తన వద్ద కొంత పైకం లేక పోలేదు.  అడపా, తడపా—విశ్వానికి అప్పు యివ్వడానికే పనికి వస్తోంది.  అతడు తిరిగి యిచ్చేది లేదని తేలిసి కూడా.   అప్పు తీసుకోవడానికి వచ్చి నపుడు ఎన్ని లయలు వేస్తాడు, పసివాడిలా, నిజానికి అతను పసివాడే—వయసు తో పాటు –మనసు ను పెంచలేదు.—కాలం . . .యిష్ఠం వచ్చినట్ట్లు మా ట్లాడతాడు ---చిత్తం పరుగెడతాడు ఎదురు దెబ్బలు తగులుతాయనే భయమైనా లేదు.  ఆ అమాయకపు ప్రవర్తనే తన్ని బంధిస్తోందా!...
పక్కవాటాలోంచీ కొత్త దంపతుల కేరింతలు వినిపించాయి  తనగది అంత ఆనందాన్ని ఒక్కనాడూ పొందలేదు. 
ఎంత కాలమీ ఒంటరి తనం?.  ఎందుకు బ్రతుకు తున్నట్లు?  విశ్వం కోసమా?  అతని కోసమూ కాదు. ఎవరి కోసమూ కాదూ  -కేవలం తనకోసం. . . . .
ఇక భరించలేకపోయింది. . . ఆలోచనలతో తల వేడెక్కి పోయింది. . . విసురు గా లేచి - - - కేరియరు ఊడదీసి భోంచేసింది.  చేతులు తుడుచుకుంటూ - - - ఉండగానే...తలుపు వారగా - - నీలంరంగు కవరు కనిపించింది.   తీసి చూస్తే . . . ఆహ్వానమూ, కాంప్లిమెంటరీ టిక్కట్టూ అందులో ఉన్నాయి.  తలుపు సందుల్లోంచీ విసిరేశాడు కాబోలు. . విశ్వం...అని అనుకున్నది.  ఆమెకు నాటకాలంటే సరదా ఏమీ లేదు.  ఇంతకు పూర్వం కేవలం విశ్వాన్ని  సంతోషపరచడం కోసం వెళ్ళేది.  ఏఁమిటో యీరోజు విశ్వంపైన కొంచం చిరాకు పుట్టుకొచ్చింది. మనస్సు కూడా చాలా అలజడి గా ఉంది.  లేకపోతే వెళ్ళేదేమో.
పడుకుందామని ప్రయత్నించిందిగాని. . . నిద్ర ఆమె దరిదాపులకు కూడా చేరలేదు.  మనోయవనికపై. . . అనేక బింబాలు అల్లరి చిల్లరిగా పడసాగాయి.  నున్నటిగడ్డం విశాలమైన నుదురు సహనాన్ని సూచించే కళ్ళు - -బాగానే వుంటాడు- - కమీషనరు- -అనుకున్నది- - రమణి.
తను యీవాతావరణాన్ని యిక భరించలేదు.  యిక యీ జీవితానికి తెరవాల్చి- - మరో జీవితానికి తెరెత్తాలి.  ఆనాడు సుఖశాంతులు లభిస్తాయి. కమీషనరు తో సంసారిక జీవితం- - ప్రశాంతంగా ఉంటుంది.  కొద్దికాలం లోనే---అతనిలో తాను లీనమైపోగలదు.  తన వ్యక్తిత్వం దెబ్బతినకుండానే. .  పోతే విశ్వాన్ని ఆదుకునే వారెవరూ ఉండరు. పోనీ- తనకేం.
ఆఖరుకు - - - కమీషనరుతో కలసి శేషజీవితం సుఖమయం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చింది-రమణి.  రేపు ఉదయం - - - తన నిశ్చయాన్ని తెలియచేయాలనుకుంటూనే - - -నిద్రలో పడింది.
·         *
ఎనలేని ఉత్సాహం తో - - తన నిర్ణయాన్ని చెప్పి కమీషనర్ ని సంతోషంలో ముంచెయ్యాలి- అని
 అనుకుంటూ నే-  - - కమీషనర్ గదిలోకి అడుగు పెట్టింది – రమణి.
చూశావా—ఏంచేసాడో ఆ అభాజనుడు.  అని ప్రారంభించాడు కమీషనరు ఆమెను చూడగానే.   ఏమీ అర్ధం కాక తెల్లబోయింది.  పె ద్ద –చిన్న-తన అంతస్తు- ఏఁమిటో తెలుసుకుని, ఒళ్ళు దగ్గరుంచుకోనక్కరలేదూ- - ఆ ఛైర్మన్ ఖారాలూ, మిరియాలూ, నూరుతున్నాడు- - యిక విశ్వాన్ని రక్షించడం ఎవరితరమూ కాదు. –నువ్వు వాడ్నివెనకేసుకు రాబట్టే వాడిలా తయారయ్యాడు.-
కమీషనర్ మాటలు చాలా బాధ కలిగించాయి- రమణికి. వినయంగానే---యింతకూ – విశ్వం ఏంచేసాడని.  అంతకోపానికి. అన్నది.    
మెల్లగా అంటావేం!- -  ఛైర్మన్ రోడ్లకోసం తెప్పించిన సిమ్మెంటు మింగేశాడని—కంట్రాక్టర్ల దగ్గర సొమ్ము గుంజుకుంటున్నాడని – హాస్పటలు నర్సులతో ప్రేమకలాపం సాగిస్తున్నాడని – యివికొన్ని . . .యింకా యిలాంటివి ఎన్నో - - -రాత్రి నాటకంలో ---ఛైర్మన్   పాత్రను సృష్టించి – దానిద్వారా – మన ఛైర్మన్ బండారం బయటపడేశాడట.  దాంతో హాల్లో చప్పట్లవర్షం కురిసిందట.  ఖర్మంచాలక ముందు సీట్లోనే కూర్చన్న మన ఛైర్మన్ గారు ముఖం ఎత్తు కో లేక పోయాడట.
ఇంతకూ అవన్నీ మన ఛైర్మన్ చేసినవని ఎందుకనుకోవాలి?  ఆనాటకంలో అలాంటి పాత్ర ఉందేమో! దానికి వాళ్ళేం చేస్తారు.మనలో మన మాటగా అనుకుంటే – మన ఛైర్మన్ గారు మాత్రం- ఆ అఘాయిత్యాలన్నీ జరిపించలేదా?.
అదిగో    ఆ ప్రసక్తి మనకు అనవసరం మనం తలమ్ముకున్నవాళ్ళం.  లోకాన్ని మరమ్మత్తు చెయ్యాల్సిన వాళ్ళం కాదు., నీమీద ఉండే గౌరవం కొద్దీ –నీవు చెప్పింది విని ---యింత వరకూ విశ్వాన్ని సపోర్టు చేస్తూవచ్చాను.  యిక నా తరం కాదు.  ఆఛైర్మను యీ అభాగ్యుడి ఉద్యోగానికి ఎసరుపెడతాడు...తప్పదు.....యికనువ్వూ, నేనూ  చేసేదేమీలేదు
యీ స్థితిలో రమణికి   తన నిర్ణయాన్ని కమీషనర్తో చెప్పి ఆయనకు సంతోషం కలిగించాలనే కోరిక సన్న గిల్లిపోయింది.  మాట్లాడకుండా బైటకు వచ్చేసింది.
*
తరువాత తమణి ఆఫీసుకు రానూ లేదు.  కమీషనర్ ని కలుసుకోనూలేదు.
ఎందుకూ పనికిరాని మాటకాల పిచ్చివాడిని కట్టుకుని ----వాడితో పాటే తనూ నాటకాలు వేసుకుంటుందా!  --యింతమంచి ఉద్యోగమూ,చక్కటి బంగళా, సభ్యమనుషుల్లో గౌరవమూ అన్నీ వదులుకుని దారిద్ర్యాన్ని వెంట బెట్టుకుంది. . . .దురదృష్టవంతురాలు.  అనుకున్నాడు కమీషనరు.
తెలివితక్కువది కాకపోతే యీ నాటకాలు వేసే పిచ్చాడు తనని ఉధ్ధరిస్తాడనుకుందా. .  లేవదీసుకు పోయింది.  అని ఏక గ్రీవంగా తీర్మానించారు ఆఫీసులో పని చేస్తున్న తోటి గుమస్తాలు.
ఎప్పుడైనా ఆమెకనుపిస్తే ఉచితంగా యివ్వడానికి తలా ఒక సానుభూతి వాక్యాన్ని జాగ్రత్తచేసి ఉంచుకున్నారు.
కాని,
ఆమె కనుపించ లేదు.

No comments: