Thursday, November 10, 2011

నీట కలిసిన త్యాగం

శ్రీ ఆకుండి రాజేశ్వరరావు కధలు

నీట కలసిన త్యాగం


శ్రీ మలబార్ కేఫ్ కనిపించేసరికి కాఫీ తాగాలనిపించిది. కాఫీ తాగి చాలా రోజులయింది, జోరుగా అడుగులు పడుతున్నాయి, వెంటనే జ్ఞాపకం వచ్చింది, సడన్ బ్రేక్ పడింది, తూలిపడతానేమో అనుకున్నా, ఛీ.. ఏంపని ఈమాత్రం మనసు అదుపులో వుంచి,లాకప్పులో బిగించకపోతే పొదుపు ఉద్యమం నిర్వహించేదెలా, కేక లేస్తున్నా వినక , కోరికను అమాంతం సెడపచ్చి , లోపలకి కుక్కి ఒక్క కసురు కసిరి, విసురుగా నడక సాగంచాను.
అందరికీ తెనుగు సినిమా హీరో అంత మంచివాడుగా కన్పిస్తున్నా, మా ఆవిడకు మాత్రం చెడ్డవాడుగా ఎలా కన్పిస్తున్నానో, అనే విషయం త్రీవ్రంగా ఆలోచించినా తేల్చుకోలేకపోయాను, నేను తేల్చుకోలేని అనేకవిషయాల్లో అది కూడా ఒకటి. అప్పటినుంచి ఇంటికిపోయేకన్నా పార్కులో ఒంటిగా ఒక గంట గడపటం ఒంటికి మంచిదనిపించింది. అనేక అవసర అనవసర విషయాలు వరుసక్రమంలేకుండా అల్లరు, చిల్లరిగా షికార్లు కొడ్తుంటే పార్కులో ఓ మూలనున్న సిమెంటు బెంచీమీద ఒళ్ళు విరుచుకుని ఒకసారి కళ్ళునులుపుకుని తీరుబాటుగా కూర్చున్నా, బట్టతలాయన , మీసానఆసామి , యిద్దరూ పచ్చని తివాచీలాంటి గడ్డిమీద కూర్చని విడివిడిగా ఆలోచించుకుంటూ ఉమ్మడిగా బఠానీలు నముల్తున్నారు. తాము నిన్న చూసిన సినిమాలో వున్న సందర్బంలేని అసందర్భపు సన్నివేశాలగురించి , సినీపరిశ్రమ ఉన్నత ప్రమాణాలు సాధించవలసిన ఆవశ్యకత గురించి తర్జనభర్జనలు పడ్తున్నారు. గులాబీమెక్క ప్రక్కన కూర్చున్న విద్యార్ధిబ్రుందం , రష్యన్ రాకెట్ కంటె రెండు రెట్లు వేగంతో ముందుకు సాగుతున్న ధరలగురించి ,దేశంలో విద్యాప్రమాణాలు పడిపోవటందాకా అనేకవిషయాలమీద చిన్నసైజులో హైవాల్యూమ్ లో లెక్చరిచ్చి, దేశంపాడైపోతున్నందుకు వీలైనంతవరకు విచారం అభినయిస్తున్నాడు, జరీకండువా పెద్దమనిషి ఆయనతడబడేటప్పుడల్లా మాట ఎదురిస్తూ సాయం చేస్తున్నాడు.పక్కనున్న మధ్యవయస్కుడు ,మిగతానలుగురూ
మంత్రముగ్ధుల్లా వింటున్నారు
నటులు కావలసినవాళ్ళు రాజకీయాలోలపడ్డారేమో అనిపించింది, నాకు వారిని చూడగా,రేడియోకమ్మనిసంగీతం సరఫరాచేస్తోంది,ఈగొడవలమధ్యనే పాటకూడావింటున్నా,పాటవిని ఎంతమంది ఆనందిస్తున్నారో , లెక్కెడితే బాగుండును, అని అనుకుంటుండగా ఒక ముసలాయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు, మాసినపంచ,దానితోపోటీపడుతున్న లాల్చీ, అరిగిన చెప్పులు,పెరిగిన గెడ్డం, విరిగిన కళ్ళజోడు, యిదీ ఆయన ఆకృతి.
సమాజపు నుదుటిరేఖల్లా ఆయన నుదుటిరేఖలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, లోతైన కళ్ళల్లోంచి చురుగ్గాదేనికోసమో లేక ఎవరికోసమో వెతుకుతున్నట్లు పార్కంతా కలయచూచి ద్రుష్టిని నామీద కేంద్రీక్రుతం కావించాడు. గొంతు సవరించి
ఈ వూరేనా .. నాయనా.. అన్నాడు,పలకరింపులో అప్యాయత పలికింది.
ఆ... అన్నా ముక్తసరిగా....
రైల్వేలో ఉద్యోగమా...ముసలాయన ద్వితీయ ప్రశ్న...
కాదన్నట్లు తల అడ్డంగా తిప్పి ....ఫ్రయివేట్ కంపెనీలో గుమస్తాగిరి ...అన్నా...ఆయన అదోలా నవ్వేడు, ఆ నవ్వులో ...నువ్వు ఎంత దురధ్రుష్టవంతుడివి ...అన్న భావం..పలికింది.
ఏ ఉద్యోగమైతేనేం బాబూ..మనిశికి కావలసింది మంచిమనసుకానీ, ధనం,హోదా కాదుగా, నశ్యంపీలుస్తున్న ముసలాయన సూత్రీకరణ..
మీరేదో పాతకాలంనాటి మాట అంటున్నారు కానీ, ...అర్ధం లేని బ్రతుకు వ్యర్ధంకదండీ...అన్నా ఆయన కండ్లలోతులను చూస్తూ...
నిజమే కానీ, ఆమాటే మా నూటొక్కసారి మా తోటల్లుడుతో చెప్పేను. అంగీకరించేడు కాడు,. ఆయనంటాడు అర్ధం జీవిత పరమార్ధమయితే జీవితం నిరరధకమై అర్ధవిహీనమవుతుందని ...ఆయనొక కవి కూడా.. అన్నాడు ముసలాయన సాగదీస్తూ..

ఈ ఉరే అనుకుంటా మీది,.. అన్నాను సంభాషణ మార్చే ఉద్దేశ్యంతో..ముసలాయన్ని..
కాదు బాబు.. పక్క పల్లెటూరు..
పని మీద పట్నం వచ్చేరా...
ఏమని చెప్పేది బాబూ...నా అవస్త..నిన్ను చూడగానే ఆత్మీయుడిని చూసినట్లు వుంది..కొంతవరకు మనసు విప్పి నీ ఎదుట చెప్పుకుంటే గుండె బరువు తరుగుతుందేమోననిపిస్తుంది.పాలకోసం ఏడ్చే చంటిది,పెద్దదై పంచవర్షాలు దాటినా పెళ్ళికాని పెద్ద కూతురు ,ఎప్పుడూ ఒంట్లో బాగుండని ఇల్లాలు, మందులు మాకులు అప్పులు ఎంతని చెప్పేది వచ్చేరాబడి దమ్మిడీలేదు, చావలేక బతికున్నా, కంఠం బొంగురుపోయింది. కనుకొలకుల్లోంచి రెండు అశ్రుబిందువులు జారి గడ్డంలో మాయమయ్యాయి. ఒకసారి కళ్లుతుడుచుకుని రోగాలకు పేదలంటే అనురాగం కాబోలు,దానికి అర్జంటుగా మందు కొనవలసి వచ్చింది, ఏంచేసేది... చూస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ వూరుకోలేంకదా, ఈ సమయంలో పరిచయస్తుడైన ఒకరి సహాయంకోసం వచ్చాను, కాని, విధి ఎదురు తిరిగింది,ఆయనకి బదిలీ అయ్యిందట మొన్ననే,.. ఇది నా ఖర్మ కాకపోతే యింకేమిటి.. ఇంకేదో చెప్పబోయి సంకోచిస్తు ఆగిపోయారాయన.
పాపం.. అనుకున్నా.. విధి ఎడా పెడా విసురుతున్న దెబ్బలకు తట్టుకుంటూ, కష్టాలపరంపరలో నికృష్ట జీవితం గడిపే ఆయన దురద్రుష్టానికి జాలివేసంది, జీవిత సంధ్యాసమయంలో ప్రశాంతత కరవైన జీవితం భరింపరానిదనిపించింది, .
ఆయన నావంక సందేహంగా చూస్తూ ..యీ స్తితిలో మరోలా అనపకోకుండా కొంచం సహాయం చేస్తే నీ మేలు ఈ జన్మ లో మరిచిపోలేను, ఎదుటి హృదయాన్ని అర్ధం చేసుకోగల ఆర్థతైన హృదయము కలవాడివి, ..అన్నాడు.
నా జవాబు కోసం ఆయన ఆశతో , ఆత్రుతతో ఊపిరి బిగబట్టి నిరీక్షిస్తున్నాడు, ఆలోచించాను నేను మాత్రం ఒకరికి సహాయం చేసే స్తితిలో వున్నానా..అని కాదు కానీ, ఆయన కన్నా మెరుగ్గా వున్నట్లనిపించింది నా స్తితి, తోటి మానవుడికి అందులోను వ్రుధ్ధుడికి , నోరు విడచి అర్ధించిన వానికి.. లేదని చెప్పటం ఎలా... సభ్యత సంస్కారం అడ్డు తగిలింది.
చూడండీ.. నేనేదో.. సహాయం చేస్తున్నాననుకోకండి, అవసరానికి యిది వుంచండి, అంటూ .. రెండు రూపాయలు అతని చాతిలో వుంచా...
ముసలాయన కళ్ళు మెరిసాయి, సంతసంతో ముఖం వికసించిది, అలముకున్న విషాదం అంతమసింది.
వెన్నలాంటి మనసు దాచుకున్నా దాగదని నాకు తెలుసు,..వెయ్యేండ్లు వర్ధిల్లు నాయనా అంటూ దీవించి వస్తాను బాబూ.. అంటూ లేచి మెల్లగా నడక సాగిచేడు,
అబ్బ,.. జీవితం ఎంత భయంకరమైనది.. పీడకల అనుకున్నా....
అరే,..యిక్కడా అఘోరిస్తున్నావు.. ఓరి ,.. చవటా... నీకోసం ఎంతని తిరగనురా,... అన్న శర్మ పొలికేకతో, ఊహాలోకంలోంచి ఇహలోకంలోకి వచ్చి పడ్డాను,...
ఇహ ..రా.. అలా వుందే ముఖం అడిగాడు శర్మ.. అబ్బే .. ఏంలేదు పద అన్నా లేస్తూ.. ఇద్దరం జనాన్ని చీల్చుకుంటూ నడుస్తున్నాము...మలబార్ కేఫ్ లోకి దారి తీన్తూ,.. వేడి కాఫీ పోస్తే కానీ నీకు చురుకు తగిలే టట్లు అన్నాడు శర్మ...నువ్వు తాగరా నేను మానేశాను,... అన్నా బతిమాలే ధోరణిలో ..
గుడ్లు తేలేసి ,... చూసాడు శర్మ, నావైపు అదోలా ....
ఒక నిమిషం తర్వాత తేరుకుని ఎప్పటినుంచి ఈ దురలవాటు అమలు.. అట్టే వాగక, ముందునడు అంటు జబ్బుచ్చపకున్నాడు శర్మ నే చెప్పేది వినకుండా..రాక్షసుడిలా నాచే వ్రతభంగం చేయిస్తున్నశర్మను పబ్లిక్గా తిట్టలేక లోలోన తిట్టుకున్నాను,.
ఇద్దరం చరో కుర్చీమీద కూర్చున్నాం, ఇందాకటి పల్లెటూరి ముసలాయన కాఫీ ముగించేసాడు. శర్మ కాఫీకి ఆర్డరిచ్చాడు, 75 నయాపైసలు బిల్లు ముసలాయన ముందుంచాడు సర్వర్,బిల్లు చూసేసరికి నా ముఖం నయాపైసంత అయ్యింది, ముసలాయన బిల్లు చెల్లించి దాటిపోతున్నాడు,ఆయనవైపే వెఱ్రిగా చూస్తున్నా నేను.
ఏమిటీ,.. ఆ ముసలాయనవైపే అలా చూస్తున్నావు.. కొంపతీసి నువ్వేమి సమర్పించుకోలేదు కదా,..అనుమానంగా నావైపు చూస్తూ అన్నాడు శర్మ..
అబ్బెబ్బె,..అన్నా..అభధ్ధమాడేస్తు,..
ఒరేయ్,.. చవటా.. నీకు అభధ్దమాడటం చాతనయితేయింకేం...చెప్పు..ఎంత సమర్పించుకున్నావు,..అని నిలదీసాడు శర్మ..టేబిల్ పై వున్న కాఫీ వంక చూస్తూ ఏదో కొంచెంలే ...అని గొణిగాను..
ఏడవలేకపోయావు..కసిరాడు శర్మ..అర్దంకాక అయోమయంగా చూసాను శర్మ వైపు..
ఆ ముసలాయన సంగతి నీకు తెలియదురా,....నిన్ను, నన్నే కాదు , మనలాంటి వాళ్ళని పదిమందిని కొనేయగల స్తితిపరుడు,.. పల్లెటూర్లో పదెకరాల పొలం, తోట,దొడ్డీ,వడ్డీ వ్యాపారం,అన్నీ వున్నాయి, ఇద్దరు కొడుకులు , ఒకరు డాక్టరు,రెండోవాడు ఇంజనీరు, అన్నాడు శర్మ,..కాఫీ ముగిస్తూ,...అంతులేని ఆశ్చర్యంతో,..ఒక్కగుక్కలో కాపీ తాగి శర్మననుసరించాను,..
నా అనుమానం నివ్రుత్తి చేసుకునే వుద్దేశ్యంతో అయితే అతనికా ఖర్మెందుకు,..అన్నా బిల్లు చెల్లిస్తున్న శర్మతో...
అదా,...అది ఆయన వ్రుత్తిట, ఒక వింత ప్రవ్రుత్తి,...నీలాంటివాళ్ళని వుధ్ధరిస్తుండటం నిత్యక్రుత్యం,..ఎవరేమనుకుంటే అయనకేం....అని మెట్లు దిగుతున్నాడు శర్మ...
కిల్లీకొట్టు దగ్గర కిల్లీ నముల్తు,..పొడుగాటి చుట్ట తెగ కాలుస్తున్న ముసలాయన్ని చూసి,ముఖంతిప్పుకుని,విభిన్నమైన భావతరంగాలు ఉవ్వెత్తుగా లేచి విరిగిపడుతుండగా తడబడే అడుగులతో శర్మ ననుసరించాను.....