Saturday, January 28, 2012

బి లిస్టు




బి లిస్ట్ప్రచురణ ఆంధ్ర ప్రభ 12-5-65 వారపత్రిక
నల్లని తార్రోడ్డు మీద నడుస్తున్నాయి శక్తిలేని కాళ్ళు, ఎర్రని ఆకాశంమీదకు పరిగెడుతున్నాయి అదుపులేని ఊహలు.
అతను తొడుక్కున్నవి నీలి చొక్కా, తెల్లలాగు, పెట్టుకున్నది నల్లకళ్ళజోడు,.ఈడు పాతికపైనే, అయినా అయిదేళ్ళ క్రిందటి నడకలా, నడుస్తున్న గజంలా, అడవిలోని మదగజంలా, పదవిలోని రాజకీయవేత్తలా,మొదటిరీల్లో తెలుగుసినిమా హీరోలా,నడుస్తున్నాడు, నడుస్తూనే మలుపు తిరిగాడు.
ఏడుపు నటిస్తున్న ముష్ఠివాడు,వయ్యారం ఒలికిస్తున్న ముద్దరాలు, ముష్ఠివాడి పక్కనుంచి కసిగా లేస్తున్న కంపు, ముద్దరాలి సిగలో నుంచి మత్తుగా వస్తున్న మల్లెల ఘుమాయింపు, ఒకవంక చల్లని చెట్టునీడ, మరొకవంక నడ్డిబద్దలుకొట్టే ఎండ,- ఇవేవీ అతన్ని చెదరగొట్టలేదు, . ఎక్కడికో చూస్తూ అలానే నడుస్తున్నాడు.
దారి తరుగుతున్నది, నీలి షర్టు ముందుకు జరుగుతున్నది, చివరకు ఎండతాగుతున్న అరటిమొక్కల చిగుళ్ళు , ఆ వెనుక దాక్కోలేని రాతిగోడల పగుళ్ళు, నల్లద్దాలను దాటుకుని అతని కంట్లోపడ్డాయనడానికి నిదర్శనంగా పెదవులు వణికాయి, కాళ్ళు చల్లబడ్డాయి, ఒళ్ళు చెమటపోసుకుని వాసన వదిలేసింది.
కళ్ళజోడు తీసేసాడు, ఎర్ర దుమ్ము గుప్పున రేగి పగవాడిలా కంట్లోపడింది, కళ్ళు నీళ్ళు తిప్పుకుంటూ గరగరలాడాయి.అప్పటికతను తుప్పుపట్టన ఇనపగేటు దగ్గరకు చేరుకున్నాడు, ఒక్కక్షణం ఆగి అరుగుమీద అడుగేసేసరికీ, అమాయకంగా ఊగుతున్న అరటిమొక్కలు స్వాగతంపలికినట్లు, రాతిగోడలు చేతులు చాచి కౌగలించుకోబోయినట్లు, అనిపించి మెట్లుదాటి,వసారామీద అడుగులేశాడు,కుడిఎడమల అరటిమొక్కలు, రాతిగోడలు, పదిఅడుగులేసి ఆగాడు,
ఎదుట గోడకు బిగించిన నల్లటి బోర్డు , బోర్డు నడుమ కాగితాలు, వాటిపైన పేరుకున్న దుమ్ము, నీలి చొక్కాలో మునిగిన చెయ్యి దుమ్ము దులిపింది , అరసెకెండులో సగంకాలం – కాలం అక్కడే నిల్చుండిపోయి, తెల్లలాగులో వణుకుతున్న కాళ్ళను చూసి నవ్వేసుకుంది, అది చప్పుడుకాని నవ్వు, చచ్చినవాని నవ్వు.
నల్లకళ్ళజోడులేని కళ్ళు కాగితాలమీదకు పరిగెత్తాయి, మీదనుంచి కిందకు, కిందనుంచి మీదకు, పది – వంద – వందన్నరసార్లు, పరిగెడుతూ చదివాయి. ఎ . వి రాజారావు , సి . హెచ్ విశ్వనాధం, సి . బలరాం ......అలసిపోయాయి, తేలిపోయాయి, చివరకు చీకట్లో మునిగిపోతూ, రెప్పలను కిందకు దించేసుకున్నాయి.
మూసుకున్న కళ్ళు , ములిగిపోతున్న కళ్ళు, తనపేరు లేదని మూలుక్కున్నాయి, నీలిచొక్కా తూలుతూ జరిగి, గజం దూరంలోవున్న అరుగుమీద కులబడింది.
నీలిచొక్కా , తెల్లలాగు, నల్లకళ్ళజోడు, సొంతదారుడూ, అనుభవిస్తున్నవాడు వెంకట్రావు, ఆర్జించినవాడు వాళ్ళనాన్న మంగపతి.
మంగపతకి ఒక్కగానోక్క కొడుకు వెంకట్రావు, అతనికి ఒకేఒక్క ఆశ – ఉద్యోగం దొరకడం, తర్వాతనే భోజనం, నిద్ర, ప్రేమ వగైరా.
వెంకట్రావు కళ్ళు ఉద్యోగంమీద, మంగపతి కళ్ళు అది తెచ్చే డబ్బు మీద, లోకం కళ్ళు ఈ వెధవకెక్కడ ద్యోగం దొరికిపోతుందో అన్న భయంమీద.
లోకం నాకు ఉద్యోగం దొరకడం చూడలేకపోతోంది, బతికివుండే లోపున కొడుకు తెచ్చే డబ్బు లెక్కపెట్టుకోలేను కాబోలు,..ఈ మాటలనే అయుదారు ఎండాకాలాలనుంచి అనుకుంటూ వస్తున్నారా తండ్రీకొడుకులు.
ఆ మాటే బద్దలయిన అరుగుమాద కూర్చుని అనుకున్నాడు వెంకట్రావు, అయితే బిగ్గరగా ,కసిగా అన్నాడారోజున, అంతే తేడా.
చివరకు చచ్చు మాస్ఠరీ ట్రెయినింగ్కుకూడా సీట్ దొరికిందికాదు. దురద్రుష్ఠవంతుల జాబితాలో మొదటివాడు తను, విధి నాలుగుపక్కలనుంచి తన అద్రుష్ఠాన్నినొక్కి పారేస్తున్నది, తన్నుతానే నిందించుకున్నాడు వెంకట్రావు.
అరటి మొక్కలు పీకెయ్యాలని, బిగ్గరగా ఏడవాలని , అరవాలని,అన్పించింది, కానీ ఏడుపుకూడా వచ్చిందికాదు, అంతలోనే అడుగుల చప్పుడు విన్పించింది.

.......సశేషం

Saturday, January 7, 2012

ఋణం










బరువు మోయడం ఎవరికీ ఇష్టం ఉండదు. గాడిద కన్నా హీనమైన స్థితిలో ఉంటే తప్ప నిర్భంధం వల్ల మనిషి బరువు మోయడం జరగదు. అన్నిటికన్నాభాధ్యత ల బరువు గొప్పది. దాని నుంచీ తప్పించుకోవడానికే మనిషి, ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. మరి విలువలు ఎలా నిలుస్తాయి?.





ఋణంఆంధ్రప్రభ – 17-2-1965కోడిక్కూఝూము అయి వుంటుంది. అదే అనుకున్నాడు కళ్ళు నులుముకుంటూ లేచిన సీతయ్య,ఒక్క క్షణం,ఒళ్ళు విరుచుకుని, కిందవున్న కుంపటి లాగి,చుట్టముట్టించి ,చూరు కిందనుంచి తొంగిచూసాడు. మేఘాలు ఆకాశాన్ని బంధిస్తున్నాయి.
“ఇంకా ఒగ్గలేదు” అని అనుకుంటూనే అడ్డపొగవేసి, దుప్పటి మరంత ముందుకులాక్కున్నాడు. ఒంటరితనం సీతయ్య మనసును తిరగేసింది, ధ్యాస తండ్రి వైపు మళ్ళింది, తెల్లదనం పులుముకుంటున్న వేకువ, భయాన్ని రేపింది. గట్టిగా కళ్లు మూసుకున్నాడు, కొత్తనీటి పొంగు లాంటి ఉరుకుతో , కడియాల సవ్వడి తోడుగా, వేకువతో ఇల్లు చక్కబెట్టుకుంటున్న చంద్రి బొమ్మలే మూసుకున్న అతని కళ్ళలో తిరిగాయి, ఇక కూర్చోలేకపోయాడు,మెల్లగా లేచి చూరున వున్న పుల్లతీసి నోట్లో ఇరికించి , అడుగులు వేశాడు.
ఆ గుడ్డివెలుతురులో సీతయ్య కాళ్ళు ఒకసారి మేకపిల్ల మీద పడింది, మరోసారి బురదగుంటలో పడింది.
సీతయ్య పుల్ల పారేసి, ముఖం, కాళ్ళు చేతులు కడుక్కుని, అప్పల్రాజు పాకలోకి నడిచాడు, కుడుముల వాసన వస్తోంది,ఆలోచనలను చెదరగొట్టి,రెండు కుడుంముక్కలందుకుని, బల్లమీద కూలబడ్డాడు.
సీతయ్య సగం కుడుంముక్క లేదనపించేసరికీ, మరో నాలుగు బుర్రలు లోపలికి దూరాయి,అందులో సింగడు మహా వెటకారం మనిషి, క్షణం నోరు మూతపడదు, వస్తూనే సీతయ్యను చూసి, “ఏందిరోరి,.. కుడుంముక్కలు మహబాగా మరిగావే”,.. అన్నాడు, ఆవిసురుకు మిగిలిన తలకాయలు ఇకిలించాయి.
నిజానికి, - చంద్రితో గొడవ వచ్చినప్పటినుంచే, సీతయ్య కాఫీ పాకల్లోకి దూరడం ప్రారంభించాడు, అంతకుముందు వాటి ముఖంకూడా తెలియదు.
సీతయ్య టీతాగడం, చుట్టముట్టిస్తుండగానే అప్పల్నాయుడు,తడువుకుంటూ వచ్చి ఎదురుబల్ల మీద బైఠాయించాడు,సీతయ్య కంటపడగానే ముఖం అదోలా చేసుకుని , “నీ యెవ్వారంబాగోలేదురా, ఇంతకూ, సెంద్రికీ, నీకూ ఎందుకు బెడిసినట్టు?” అంటూ నిగ్గదీసాడు.
సీతయ్య నోరు పెగలలేదు.
“ఏటి వుంటేగదారా,.. యీడుఅన్డానికి , గ్రహ పట్టింది , అంతే!” తేల్చేశాడు వీరప్ప.
“ఆ! .. పడద్ది,.. దాని రాతకాకుంటే ,బండెడునగలు దిగేస్తామని దాని కొంగొట్టుకుని, బతిమిలాడిన కుర్రాళ్ళని ఇదిలించేసి,యీడికి మనువెళ్తాదా?.. కర్మరా!”,.. నొసలు బాదుకున్నాడు అప్పల్నాయుడు.
ఏటొడ్డున లేచిన బంతిపవ్వులాంటి చంద్రివెంట ఎంతమంది కుర్రకారు పడేవారో సీతయ్యకు తెలుసు, అయినా వాళ్ళందరనూ కాలదన్ని, తననే ఎందుకు కట్టుకుందో సీతయ్య ఏనాడూ ఆలోచించలేదు. సరికదా ఈనాడుకూడాను.
అవి మూడేళ్ళకిందటి ముచ్చటలు, ఉన్న ఒక్క మేనత్త కన్నుమూస్తూ వదిలేసిన అప్పుకోసం , సీతయ్య మన్నులో మన్నయి, చెమట ఒలికిత్తున్న రోజులు.
ఒంటరి వాడైన సీతయ్య ఎప్పుడు మరగబోసుకునేవాడో తెలీదు, ఎప్పుడు చూసినా పొలంలోనే పడి వుండేవాడు, చంద్రి ప్రతిరోజూ తన పొలానికి చల్దులు తీసుకుపోయే దారి కూడా అదే, సీతయ్యనూ, అతని అవస్థనూ, చూసేసరికీ ఆమె హ్రుదయం చెమ్మగిల్లేది.
ఒకనాడు సీతయ్య ఒంటిచేత్తో మిరపపెరడుకు నీరు తోడటంచూసి, ఏంమావా,.. అంది.
సీతయ్య క్రితంరోజు దెబ్బతిన్న చేయి చూపించాడు, చంద్రి మనసు చివుక్కుమంది.
“పోనీ నువ్వు ఏతాం పట్టు,నే గెడేస్తా”,..అంటూనే కోక బిగించి గెడ అందుకుంది.
పాతాళంలోని నీరు దోనెలో పడి వురకలు వేసింది.
మరోకనాడు,చంద్రి తన పోలానికి చల్దులు తీసుకునిపోతూ, సీతయ్య పోలం దగ్గరకు రాగానే అతను చల్ది తెచ్చుకున్నాడో లేదో, అని పరకాయించి చూసేసరికి ఆమె మనసు నీటులోపడ్డ మట్టిపెళ్ళలా కరిగిపోయింది.
ఏరలా ఒగ్గేసిరా,.. కాసింత దప్పిక తాగుదువుగానీ” అని పిలిచింది.
తల్లి పిలుపులోని మమత ఆ పిలుపులో నిలిచింది.
సీతయ్య ఒక పక్క గోంగూర పచ్చడి నంజుకుంటూ , మరొకవంక చల్దిలగాయిస్తూ, “అమ్మీ,..అదుట్టం అంటే ఏటో” అన్నాడు,..
తెలియదన్నట్లు చంద్రి కాటుకకళ్ళు కదిలాయి.
“నా కెదురుగా నువ్వు, నీ కళ్ళలోని పుచ్చపువ్వులు చూస్తూ,దప్పికతాగడమే మరిసిపోయిన నేను, మనల్ని చూసి మతిపోగొట్టుకున్న యీ పొలం”.
“ఛా! పోత్రం మాటలు, ముందు తినవేం”,.. మూతి ముడిచేసుకుంటూ, చెయ్యి గాలిలోకి విసిరింది చంద్రి.
గాజులు గలగల మన్నాయి, దూరాన చెరకు తోటలోని చేకులు రెపరెపలాడాయి.
చంద్రి, గిన్నె తొలుస్తుంటే కాసిన్ని బంతిపూలు కోసి,రెండు మాత్రం చాటుగావచ్చి,ఆకాశం చీకటిలాంటి జుట్టును సవరించి వేసుకున్న చంద్రి సిగలో ఉంచాడు సీతయ్య.
చంద్రి అదోలా ముచ్చటగా గునిసింది, తేలిపోతున్న తన కళ్ళను మూస్తూ, “మావా,..సంబరమంటే ఏదో”,..అన్నది చంద్రి, అంటూనే సీతయ్య చేతిలోని బంతిపూలను లాగేసుకుని , ఒక్కసారి అతని మీద కుమ్మరించి , ముఖంలోని సిగ్గును చేతులతో కప్పుకుని , పరిగపిట్టలా పరుగు తీసింది.
ఆ తర్వాత ఎందరు ఎన్ని విధాల చెప్పినా వినక సీతయ్యతో మనువుకు అంగీకరించింది.
కాఫీ హోటల్లోని అందరూ సీతయ్యను పట్టుకుని చింతకాయలు దులిపినట్లు దులిపడం ప్రారంభించేసరికి సీతయ్య ఇక వుండలేకపోయాడు.
“ఆపండర్రా! ,.. దాని సంగతి మీకేటి తెలుసు?... ఆడదానికి అంత అహంకారమేటి?”, పిచ్చిగా కేక వేశాడు.
అంతలో సింహాద్రి రాకుండా వున్నట్లయితే, ఆ గొడవ ఎంతవరకు వెళ్ళేదో, మరి! సింహాద్రి ఆ వూరికి ప్రెసిడంట్, సంతకాలు మటుకు ఆయనవి, చలాయింపు మాత్రం కొడుకు చిన సింహాలుది, సింహాద్రికి తన ఇంట్లో కొత్తగా వేయించుకున్న ఎలక్ట్రిక్ లైట్ల గురించి, పొలంలో వుంచిన పంపుసెట్ల గురించి చెప్పుకోవడం తప్ప , ప్రస్తుతానికి మరోపని అంటూ లేదు.
చిన సింహాలుకి మాత్రం, అటు ప్రభుత్వం,వద్దనుంచి, ఇటు రైతుల దగ్గరనుంచి, ఎన్ని విధలుగా వీలైతే అన్ని విధలుగా అప్పులు తేవడం, వీలైనంతవరకు వాటిని ఎగవేయడం సరదా, శ్రమదానాలు, చేయించి, ఆ పనులకు తన పేర బిల్లు చేయించుకోవటం అలవాటు.
సింహాద్రి రాగానే ఒక్కరొక్కరే మెల్లగా జారుకున్నారు, సీతయ్య కూడా వాళ్ళతో పాటే బయటపడి ఇంటికి నడిచాడు, తలుపు తీసేసరికల్లా మాగిన చోడివెన్నుల వాసన గుప్పుమంటూ కొట్టింది, సీతయ్య విసుగ్గా కుక్కిమంచంలో కూలబడ్డాడు, ఇల్లంతా బావురుమంటూంది, బుంగలేసిన మడిలోని నీరులా, అనేకవిధాలు గా ఆలోచనలు జారసాగాయి.
అంతకుముందు ఒక రైతు అన్నమాటలు జ్ఝప్తికివచ్చి, “నిజంగా తను చిన సింహాలు నుంచే చెడిపోతున్నాడా?”,.. అని తనలోతాను ప్రశ్నించుకుని , ‘లేదు’,.. అని సమాధానం చెప్పుకున్నాడు.
అయితే బాగుపడుతున్నట్లా?,...
‘ఎందుకుకాదు?’, సమర్ధించుకున్నాడు, కానిఎక్కడో వెలితి తొంగి చూసింది, తన ఎరికలో బాగుపడ్డవాళ్ళందరినీ తీసుకుని వాళ్ళంతా ఎలా, ఎలా బాగుపడ్డారో తరిచిచూసాడు.
వాళ్ళంతా న్యాయమార్గాన బాగుపడలేదు, అంటే బాగుపడ్డానికి న్యాయానికు జత కుదరదన్నమాటేగా,.. బాగుపడ్డానికి ప్రయత్నించడం సహజం , అయితే కొందరికి అవకాశం రాదు, కొందరికి అవకాశం వచ్చినా అందిపుచ్చుకోలేరు, అందుచేత వున్నచోటనే పడి వుంటున్నారు. అంతేకానీ న్యాయం మీద విశ్వాశంతో కాదు. ఈ భావనలు సీతయ్యలో హుషారు పెంచాయి.
“ఇంతకూ తను చేసిందేమిటి? , కొంతవరకు పరసునాయుడి భార్య ను మోసగించాడు తను, ..అంతేకదా?..
పరసునాయుడు మార్రం తను అతని వద్ద పాలికాపుగా వుంటున్న రోజుల్లో మోసం చేయలేదా?,.. ఏనాడైనా తన శ్రమకు తగ్గ ఫలితం చ్చాడా?,.. ఎవరినీ ఎలానూ మోసం చేయకుండా అంత ఆస్తి ఎలా సంపాదించాడు,.. ఈ లోకంలో ప్రతి ఒక్కడు తోటివాళ్ళను మోసగిస్తూనే జీవిస్తున్నాడు. తనూ చిన సింహాద్రి ,పరసునాయుడు అంతా అంతే,...
తను పరసునాయుడి వల్ల నూటికి అర్ధ రూపాయి వడ్డీ చొప్పున వెయ్యి రూపాయలుతీసుకుని ప్రొనోట్ వ్రాసాడు, మరో ఆరు మాసాలకు కన్నుమూసాడు పరసునాయుడు, అతను పోగానే నోటు తగవుల్లో పడింది, పరసునాయుడు అప్పట్లో తనను ఆదుకోకపోతే పల్లం, మడి, తనకు దక్కేవికావు, అయితే తను పకారం చేసినవాడికే అపకారం చేసాడా,..
సీతయ్య మనసు ఒడ్డునపడిన చేపలా కొట్టుకుంది, ఒక్కక్షణం, తరువాత, తను మాత్రం పరశునాయుడికి ఉపకారం చేయలేదు కనుకనా,.. హాస్పిటల్ లో దిక్కులేక పడివుంటే కన్న కొడుకు కంటే ఎక్కువ సేవ చేసాడు, దానికీ ,దీనికీ, చెల్లు అని సర్ది చెప్పుకున్నాడు సీతయ్య.
ఇంతకూ చిన సింహాలు – నువ్వలా వుండు, నేను సూసుకుంటా సంగతి, అని చెప్పేదాకా తనకు ఆ ఉద్దేశమే లేదు, తరువాత మాత్రం తను ఆమైనా ప్రమాణం చేశాడా,.. ఏమా లేదు, అంతా అతనే చూసుకున్నాడు, ఎంత చక్కగా చెప్పాడు, ఒక్కడూ నోరెత్తలేకపోయాడు.
ఇప్పుడందరూ నూరు రూపాయలు బదులిచ్చి, రెండొందలు ఇచ్చినట్లు , నోటు కట్టించుకుంటున్నారు కదా,.. ఎందుకనీ,.. రెండు ,రెండున్నర వడ్డీలు నోటుల్లో పడడానికి వీల్లేదు, రూలొప్పుకోదు, రేపు పొద్దున్న, కోర్టుల్లో పడితే , గవర్నమెంటు రేటుకు తెగ్గోసిపారేస్తారు, అందుకనే ముందు జాగ్రత్తగా ఎక్కువ వడ్డీ అంతా అసల్లోనే కుక్కి, వంద ఇస్తే రెండొందలికి, రెండొందలిస్తే, నాలుగొందలికి వ్రాయించుకుంటున్నారు. ఇదే రివాజయింది, అలానే పరశునాయుడు కూడా సీతయ్యకు అయిదొందలిచ్చి, రెండు రూపాయలు వడ్డీ ఖరారు చేసుకుని , నోటు మాత్రం, వెయ్యి రూపాయలకు , అర్ధరూపాయి వడ్డీ చొప్పున వ్రాయించుకున్నాడు, ఇదీ జరిగిన సంగతి, యదార్ధం అంతే అయివుండాలి, పరశునాయుడు జారిపోబట్టి, సీతయ్య ఇరుకున పడ్డాడు, ఇప్పుడు పరశునాయుడి పెళ్ళాం నోటుపట్టుకుని వెయ్యిరూపాయలు , వడ్డీ రావాలంటే ఎలా,.. అని గట్టిగా చినసింహాలు నిలవకపోతే , పరశునాయుడి పెళ్ళాం, వూరుకునే బాపతేనా,...
తింటే తను వందరూపాయలు తినుగాక, దాదాపు నాలుగు వందలు లాభం చూపించాడు, ఎవరు చేస్తారు అంతపని, సీతయ్య మనసులోనే సింహాలును కీర్తించాడు, ఆ సమయంలో చంద్రి చేసిన పాడుపని జ్ఞప్తికి వచ్చి , కోపం మంటలా లేచింది.
అవసరం వచ్చి మగవాడు అడ్డమైన గడ్డీ కరిస్తే కరుస్తాడు, మధ్యన దీనికేం, భాధ,.. హద్దుమీరిన ఆడదాన్ని, ఎముకలు విరగ్గొట్టి బయటకు ఈడవాల్సిందే, పాపం లేదు, ఇలా సీతయ్య తనను తాను చాలాసేపు సమర్ధించుకుంటూ కూర్చున్నాడు, ఈ ఆలోచనలనుంచితెప్పరిల్లేసరికి, బారెడు పొద్దెక్కింది.
మబ్బువిడిన ఎండ, పొర విడిచిన పాములా పాకుతోంది, సీతయ్యకు ఇక ఇంట్సో కూర్చోవడం విసుగెత్తింది, కోడెలను తోలుకుని పొలానికి బయలుదేరాడు.
చంద్రి గడపమీద రాట కానుకుని స్తబ్దంగా కూర్చుంది, అలా కూర్చోవడం ఆమెకెన్నడూ అలవాటు లేదు, సరిగ్గా మూడు నెలలక్రిందట , అర్ధరాత్తి, సీతయ్య ఆమెను చావదన్ని బయటకు ఈడ్చివేశాడు, చంద్రి ఒక్కమాట కూడా ఎవరితో నూ చెప్పకుండా పుట్టింటికి వచ్చేసింది, అప్పటినుంచి అదే వరస, ఎవ్వరేమి చెప్పినా వినిపించుకోదు, పల్లెత్తి ఒకరితో తన గొడవ చెప్పుకోదు.
నందివర్దనాలమీద నిలిచిన నీటిబిందువులను గాలితెర సుతారంగా దులుపుతూంది, బొడ్డూడని మేకపిల్ల లోకాన్ని వింతగా చూస్తూంది, చంద్రికి వీటిమీద దృష్ఠేలేదు, ఆమె చూపులు కొత్త నీటితో , కనకాంబరం రంగు చీర కట్టుకున్న చూలాలిలా వున్న చెరువు మీదకు సాగిపోతున్నాయి.
నిన్నటివరకూ దానిలో ఒక్క నీటిబొట్టు లేదు, కాని ఈరోజున ,.. కాలం ఎంత చిత్రమైనది, ఇదే భావన ఆమెలో సుళ్ళు తిరగసాగింది, ఈ భావనలో మునిగిపోయిన చంద్రి పరిచితమైన మువ్వలసవ్వడి వినిపించేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి వీధివైపు చూసింది, కోడెలు ఒక్క క్షణంలో ఆమెను చుట్టుముట్టి , ఆనందంతో చిందులు తొక్కుతూ ఆమెను నాకడం ఆరంభించాయి, వాటి మూగ మమతకు ఆమె విచలిత అయ్యింది, ఒక్క అదటున ఇంట్లోకి పరుగెత్తి, చేటనిండా తవుడు తీసుకువచ్చింది, మళ్ళీ చాలారోజులకు ఆమె చేతిమీదుగా కమ్మని తవుడు దొరకడంతో అవి ఒళ్ళు మరిచిపోయాయి. ఒకే తొందరలోతినసాగాయి.
వెనుకనుంచి వస్సున్న సీతయ్యకు ఈ దృశ్యం చూసేసరికి కోపం పుట్టుకొచ్చింది, గట్టిగా ఉక్రోషంతో అదిలించాడు, కోడెలు కదల్లేదు, సరికదా మోర కూడా తిప్పలేదు, దానితో సీతయ్య మరీ రెచ్చిపోయి, వెనకా ముందూ చూడకుండా వాటిని బాదుతూ , ఆ సమయంలోనే ఒడుపుచూసి చంద్రిని కూడా ఒక్క దెబ్బవేశాడు.
అమ్మా,.. అంటూ చంద్రి భాధగా అరిచింది, అంతే కోడెలు మోదలు ఎగేసి, కళ్ళవెంట నిప్పులు రాలుస్తూ, బుసలుకొట్టాయి. అందులో ఒకటి సీతయ్యను బారెడు దూరం పడేట్టు ఎగరవేసి అతడు కిందపడేసరికల్లా కుమ్మడానికి ఉరికింది.
చంద్రి పిచ్చిదానిలా అరుస్తూ, సీతయ్యను చుట్టేసుకుంది, ఆ కేకకు చుట్టుపక్కలవాళ్ళు పెద్దగా అరుస్తూ వచ్చిపడ్డారు.
చంద్రిచుట్టుకోవడంతోను, చుట్టుపక్కలవాళ్లు చేరడంతోను, కోడెలకు సీతయ్యను వదలక తప్పిందికాదు, అవి దూరంగా తొలగిపోయాయి.
సీతయ్య చెక్కుచెదరలేదు, చంద్రికి మాత్రం సృహ పోయింది, తలమీద తగిలిన దెబ్బనుంచి రక్తం ఆగకుండా కారుతోంది, ఆ రక్తమే సీతయ్య గుండెలమీదపడి అతను తొడుక్కున్న బనియన్ అంతా రక్తసిక్తమైంది.
గాయానికి పంచదార వేసి కట్టుకట్టారు, ముఖంమీదనీళ్ళు జల్లసాగారు.
ఆడి చేతిదెబ్బతిని ఆడి పాణానికే అడ్డుపడింది , లేకుంటే కోడెలు బతకనిచ్చేవేనా,.. అన్నది ఒకామె ఆ గుంపులోంచి.
పాపం,.. ఒట్టిమనిషి కూడా కాదు, ఆడికి చేతులెలా వచ్చాయో అంత దెబ్బెయ్యడానికి, మరొకామె ఈసడించింది, ఆ మాట వినేసరికి సీతయ్య కు ఒక్కసారి గుండె ఆగినట్లయ్యంది, ఇక మరేమాటా అతడికి వినిపించలేదు, ఒక పక్క అనంతమైన ఆవేదన , మరొకవంక అనిర్వచనీయమైన ఆనందానుభూతి అతణ్ణి పెనవేసుకుపోయాయి.
మరికొంతసేపటికి చంద్రికి , స్పృహ వచ్చింది, స్పృహ రాగానే ఆమె ఆడిన మాట “మావ ఏడీ?”,.. అని,..
సీతయ్య బావురుమంటూ ఆమెను చుట్టుకుపోయాడు,
మళ్ళా సీతయ్య ఇల్లు , చంద్రి కడియాల సవ్వడితో కలకలలాడసాగింది.
“నాకు తెలుసు మావా,.. నువ్వు మంచోడివని , కానీ నా మాట వినకుండా , తప్పుదారిపోతుంటే చూస్తూ ఎట్టా వూరుకునేది, ఈ ఇంట సిరి నిలవద్దూ?,.. అప్పటికే అవునా, కాదా అని అనుమానం”, సిగ్గు తెరలు చంద్రిని ముంచివేశాయి.
“అందుకే నువ్వేటి చేసినా భరించడానికి సిధ్ధమయ్యే , పెట్లోని నాలుగొందలు పైచిలుకు పట్టుకెళ్ళి పరశునాయుడి పెళ్ళానికి చ్చేశాను, కరణమయ్యే లెక్క కట్టినాడు, అంతయినా ఇంకా ఓ యాభై రూపాయలు సాలినాయి కావు”, అన్నది చంద్రి, సీతయ్యకు అన్నం వడ్డిస్తూ, “అదీ యిచ్చేద్దాం, మనకెందుకాపాపం”, అన్నాడు సీతయ్య.
కోడిక్కూఝాము అయి వుంటుంది, సీతయ్య యాభై రూపాయలు రొంటిన దోపుకుని “పట్నమనగా ఎంత! చిటికెలో ఎల్లి ఆళ్ళ డబ్బు ఆళ్ళ పాదాల దగ్గరుంచి దండం పెట్టి రానూ!”,.. అంటూ చంద్రి చెంపమీద చిటికెవేసి బయలుదేరాడు.
ఏ జనమలో ఋణమో ,.. లేకుంటే చంద్రి లాంటి ఆడది నాకు దొరుకుద్దా!,.. అని అనుకున్నాడు అడుగుల జోరులో .
కోడికూసింది. సన్నని వెలుగురేఖలు దిక్కులను ఆవరించుకున్నాయి.