Wednesday, April 3, 2013

మా రామ్మూర్తి మాస్టారు



ఆకుండి రాజేశ్వరరావు                                   కృష్ణాపత్రిక ;23-07-1960

సాయంత్రం -------- నగరం కలవరిస్తోంది….



ఏనాడో మానవత్వాన్ని పొట్టనబెట్టుకున్న నగరం-----నగరం నడిగర్భంలో నరులంతా ......ఉరకలు వేస్తూ.... ఆశలు మేస్తూ,....గతాన్ని నెమరేస్తూ.... మెడమీద కఱ్ఱవేసి గెంటుతున్నట్లు........వింతభయం తరుముతున్నట్లు .....నడుస్తున్నారు.

               నేను ------- అనవసరంగా బయల్దేరాను........ ఒంటరిగా .......కాదు......... తెల్లారని సమస్యలపై రేగిన ఆలోచనలు తోడురాగా........

              నడుస్తున్నాను........జనాన్ని చీల్చుకుంటూ, నా వెనుక నవ్వులు--------నా ముందు నవ్వులు ,నా హృదయంలో గులాబీముళ్ళు,... నామీద కేంద్రీకృతమవుతున్నాయి... నికృష్ట జీవుల వెలుగారిన కళ్ళు..

              అడుగడుగునా రాసుకుపోతున్న కార్లని తప్పుకుంటూ . ........నడుస్తున్నాను.

               లాగూలేని అబ్బాయి...

               లాల్చీలేని అబ్బాయి..

               ఆ రెండూ లేని అబ్బాయి.... అద్దాల అవతల లడ్డూలను విడివిడిగా చూస్తూ ఉమ్మడిగా గుటకలు మింగుతున్నాడు.అద్దాలు యీ జీవితంలో........ అడ్డం...........తొలగవు  ఎవరో పిలచినట్లయింది.....వెనక్కి తిరిగి చూసాను ...అనంతజనవారాసి.......పిలచినవారెవరు..

               ఎవరూ కనిపించలేదు...కుంటికుక్క ఒకటి మొరిగింది...తిరిగి నడక సాగించేను....జోరుగా గుండెపాడే విషాదగీతికకు లయగా ...అడుగులు వేస్తూ..

                  నగరం --------కనుమరుగయింది,....జీవనము లేక నిర్జీవంగా పడివున్న కాలువగట్టు పైనుంచి అడుగులు వేస్తున్నాను.

               దైవం ----- అనుగ్రహించినా, పూజారి ఆగ్రహాన్ని, నిగ్రహించుకుని , అనుగ్రహం ప్రసాదించనట్లు......ఎండ తీక్షత తగ్గినా , గాలి వాడి, వేడి తగ్గలేదు.

                 నగరానికి కట్టెలు మోసుకుపోతున్న కూలీలు నన్ను తప్పుకుపోతున్నారు, కట్టెల్లో కలిసేవరకూ వీరికి కట్టెల మోత తప్పదు.

                   పడమటి ఆకాశమైదానంలోని .......రంగుల్లా .....నా ఆలోచనలు క్షణక్షణానికి రంగులు మారుతున్నాయి,

                యింకా కష్టపడు పైకొస్తావు....... తర్వాత సుఖపడుదువుగాని అంటున్నాడు... మేనేజరు.

                  అట్టే... కష్టపడకు.... విశ్రాంతి తీసుకో  అంటున్నాడు... డాక్టరు.

                    ఏ మాటకు విలువివ్వాలి...

                   యింకా యీ కష్టం చాలదా .....యింకా ఎన్ని గంటలు కష్టించాలి....    సుఖం చవి చూడ్డానికి...

                  కష్టంలోనే... కన్నుమూస్తానేమో….!

                   కష్టంలోనే .....సుఖం  గర్భితమై వుందేమో...!

                     ప్రకృతి గాలిని కట్టగా కట్టేసి తాకట్టు పెట్టింది. శరీరం ఘర్మజలంలో స్నానం చేసింది ..పచ్చని లేత చెట్టుకు ఎండిన ముండ్ల తీగలు--- పెనవైచుకున్నాయి.రేగినజుట్టుతోడి నిర్జీవ మానవాకారాల్లా , నిటారుగా నిల్చున్నాయి దూరంగా తుమ్మచెట్లు..

           సంభ్రమ సముత్సతత్ఫతంగ కుల కలవరాన్ని అరతులమైనా తగ్గించలేకపోయింది. పచ్చని గడ్డికోసం చుట్టూ పరీక్షించాను ..కానీ ప్రయోజనం లేకపోయింది.

          ఇసుక మీద కూర్చున్నాను, ఇసుక నిట్టూర్పు ఆవిరి విడుస్తోంది.

          జీతానికి ...జీవితానికి ...అవినాబావ సంభందముంది. జీతం ..పెరగలేదు, పెరుగుతుందనే ఆశ కూడా సుదూరాన కనిపించడంలేదు. జీవితమధురిమ ఏనాడో తరిగిపోయింది. ఇంత విశాల నగరంలో ...ఇల్లు కాదు ,,..గది ..గాలి ..వెలుతురు వచ్చే గది అద్దెకు దొరకలేదు ..నీళ్ళు దొరకవు..కన్నీళ్ళు ఎప్పుడో జీవిత ఘర్షణకి ఆవిరైపోయాయి..యెంత బోధించినా శ్రీమతి ఖర్చులు తగ్గించదు..... ఆదాయం పెంచుకుందా మనుకున్నా ... అవకాశం కనిపించదు..డబ్బు పంపించమంటున్నారు ..నాన్న..నాకూ పంపించాలని వుంది...కానీ ...నెలనెలా పంపుదామను కుంటున్నాను.. పంపలేకపోతున్నాను...నేను తల్లిని ..తండ్రినీ ..మరచిపోయానని.. తమ కోడలు ..నా మెదడు చుట్టూ దడి కట్టేసిందనీ ..వారి అబిప్రాయం.

          ఎలా వారి అభిప్రాయాన్ని మార్చగలను….?  చుట్టూ గిరిగీసుకుని గిరిలోపల మనసుకి ఉరి వేస్తూ , పరుగులెత్తడమేనా ...జీవితం...

          జీవితానికి పరమార్ధం .....ఏది..,,?

          అతి సూక్ష్మ,సునిశిత కంటకావృత..మార్గంలో పయనిస్తూ , జీవితగమ్యం ఏనాటికైనా చేరుకోగలనా..

          ఆరంభించిన ప్రతిపనీ ..అసంపూర్తిగా ..అంతమవుతూంది...

          ఆలోచనలనుంచి తప్పించుకునేందుకు , యిక్కడకు చేరినా తప్పించుకోలేకపోతున్నాను..నన్ను నా నుంచి ఎలా తప్పించుకోగలను...?

          కాలువ గుండెలు..బీటలు వారింది..

          కాలువ గట్టున , ఎండినగడ్డిపోచలు ... గాలికి వూగిసలాడు తున్నాయి..

         ఈ సమయంలో ... నేను తలెత్తేసరికీ శుష్కించిన మానవాకారం, నా కట్టెదుట నిలబడి చేయి... ముందుకు చాచింది..

         జీర్ణవసనాలు, జరాధూసరమైన రోమసంతతి ,వయసు వాలింది ...నడుము వంగింది...నుదుటిరేఖలు వక్రంగా , స్పష్టంగా కనిపిస్తున్నాయి.

         గుంటలుపడ్డకండ్లలో...అనంతమైన కాంతి, పెరిగిన మీసాలు గడ్డంమధ్య..కలత నిదురలోని పసిపాప నవ్వులా ..విరిసిన చిరునవ్వు.

         ఆ నిమిషంలో.. మా మనసులు మాట్లాడుకున్నాయి. మనసులు పలికేచోట.....మాటలకు విలువేముంది,

         .......బిక్షాం...........దేహి...

         ఆ..కండ్లకాంతి ఆ చిరునవ్వు....నాకు అపరిచితమైనది కాదనిపించింది.... అయినా జ్ఞప్తికిరాలేదు.

         కళ్ళు గట్టిగా మూసుకున్నాను.

         మనసు..తెరిచి వెనుకకు, జ్ఞాపకాల జాడలకు, వాడలకు, పరుగెత్తించాను.

         గుండె కొట్టుకుంది నా మనోనేత్రం ముందు గజిబిజిగా , కొన్ని దృశ్యాలు గబగబా సాగిపోయాయి,తరువాత స్పష్టంగా దృశ్యాలు కనిపించసాగాయి.

         చిన్ననాడు పుట్టిపెరిగినవూరు చీకుచింతలేని జీవితం...ఆటలు, పాటలు, అర్ధంలేని, అర్ధం తెలియని మాటలు, ఓనమాల.....నామాల మాస్టారు...రామ్మూర్తి మాస్టారు....రామం జేబులో గోలీకాయలు     ...నేను దొంగతనం చేయటం...నామాల మాస్టారు తంతారేమోనని  ......నా భయం..., నా భయానికి , భిన్నంగా, నామాల మాస్టారు..చిరునవ్వు నవ్వుతూ, గోలీలు కొని యివ్వడం...

            ఆ ....అదే.... చిరునవ్వు....అదే ...ఆ అనంతకాంతి....ఆ...అతనే ....అతనే ..కళ్ళు తెరిచాను...కళ్ళు ఛీకట్లు కమ్మాయి..

         నా ముందు ..............శూన్యం...

         పగిలిన ...కాలువగుండె.........పరిహాసంగా  నవ్వింది...దూరాన నగరం....కాలువ....కలుసుకునే మలుపు దగ్గర మానవాకారం. ...ఊతకర్రతో...ఊగుతూ ..సాగిపోతోంది...

         మాస్టారూ....నా సర్వశక్తినీ ..కేంద్రీకరించి....కేక వేశాను..రోదశి ప్రతిధ్వనించింది...తిరిగి..నా పిలుపు ..గుండెల్లో దిగిపోయింది.

         ఊగుతూ, సాగిపోతున్న.....రామ్మూర్తి మాస్టారు...నా కంటికి దూరమయ్యారు...

         ఎలుగెత్తి కేకేస్తూ., కాలుకొద్దీ పరుగెత్తాను...మనసు ..ఉక్కిరి బిక్కిరయింది..

         రామం చెప్పినమాటలు...నా మరపు తెరలను చీల్చుకుని తలెత్తాయి..

         మాస్టారు ..రిటైరయ్యారు...ముప్పదిఏండ్ల తన జీవితానికి..బడికి గల ముడి విడిపోయింది...బడే ..తను...తనే బడి..అయిన  మాస్టారు జీవితంలోంచి అతని యిష్టానిష్టాలతో నిమిత్తంలేకుండా ..బడిని విధి బలవంతంగా ఊడ బెరికి, మరొకరికి కట్టబెట్టింది...

         తన ఆశలకు..ఆశయాలకు..ఆలయమైన... విద్యాలయానికి.. .చివరిసారిగా, అశ్రుపూరిత నయనాలతో ..అవలోకించి..నమస్కరించి, మాస్టారు...నిష్క్రమించారు..శాంతి...కాంతి.. లేని ..విశ్రాంతి ...తీసుకునేందుకు. ఆయన రిటైర్ అయే సమయానికి, ఆయన ఆస్థి..పెళ్ళికి తయారుగా వున్న ముగ్గురు కూతుళ్ళు..మూడు వందల అప్పు..

         ఆయన వయసు చరమాంకంలో..సాగిపోతున్నా జీవితం తిరిగి ప్రధమాంకంలో ..........కాలూనింది..తిరిగి..బ్రతుకుతెరువు కోసం...ఉద్యోగ ప్రయత్నాలారంభించారు...కొన్ని చోట్ల తన శిష్యులతోనే పోటీలుపడి ..ఓడిపోయారు..

         బ్రతుకు బరువయింది..ఆశ ..సన్నగిల్లింది..,విశ్వానికి..విజ్ఞాన భిక్ష ప్రశాదించిన ..మహాత్మునకు..నట్టనడివీధిలో భిక్షాటన..అబ్బ..బుఱ్ఱ బద్దలయిపోతే బాగుండుననిపించింది...కాలం కలియుగాంతానికి, కదలి, ప్రళయం..యీలోకాన్ని..యిప్పుడే ముంచేస్తే బాగుండును..

         రొప్పుకొంటూ..వెర్రి ఆవేశంతో..నగరంలో ప్రవేశించాను...

         పిల్లల నవ్వులు...కన్నెపిల్లల..ఒంపులు,సొంపులు..

         యేవీ కనిపించలేదు   ....వినిపించలేదు..నా ధ్యాసంతా నాకు ఓనమాలు నేర్పిన మాస్టారిమీదనే కేంద్రీకృతమైంది.

         ప్రస్తుతం...ఆయన నొసట నామాలు లేవు..

        సమాజం...పవిత్రమైన ఆయన నామాల్ని ఊడబెరుక్కుని ...అపవిత్రంగా వాడుకొంటూంది..

        నా శక్తి నంతటినీ వెలుగుగా మార్చి, కండ్లలోనుంచి ..... చిరునామాలేని నిర్భాగ్యజీవులు..విశ్రమించే స్థలాలు..పార్కులు..పేవ్ మెంట్లు..రైలు స్టేషన్లు..కూలిన ఇంటి ...అరుగులు..అన్నీ ఎన్నోసార్లు శోధించాను...

         విజ్ఞానభిక్ష ప్రసాదించిన..... ప్రత్యక్షదైవం.....మానవాకృతిని నిలిచిన ..సత్యస్వరూపం..

         ఆయన పాదాలపైబడి..గుర్తుపట్టలేనందుకు క్షమించమని..వారి సేవను గుర్తించలేని, సభ్యత నెరుగని..సమాజంలో..సభ్యుడుగా..కూడా సమాజాన్ని క్షమించమని అర్ధిస్తూ..



         నులివెచ్చని , కన్నీటి..స్రవంతితో..ఆయన పాదపద్మాలు కడిగి..నా పాపం క్షాళితం.. చేసుకొందామనుకున్నాను..కాని..కాని... ....!!!!!

                


       
                         
                 

2 comments:

K V V S MURTHY said...

BAAVUNDI SAILAJA GARU..!

sailaja said...

నా బ్లాగు కు సుస్వాగతం... ఈ ఆపాత మధురాలను అందరికీ అందించాలనే నా ఆకాంక్ష.. ఆదరించినందులకు ధన్యవాదాలు..శైలజ