Wednesday, May 1, 2013

సుందరి


ఆంధ్రప్రభ        తే10-8-1960దీ. ప్రచురితం

అతని పేరు బంగారయ్య.  అంతే...అతనింట్లో వెతికి చూచినా చిన్నమెత్తు బంగారం కనిపించదు.  కాని అతని కూతురు సుందరి మాత్రం బంగారం లాంటిది.  బంగారయ్య యేనాడూ చేతనైతే ఒకరికి సహాయంచేసాడే కానీ, ఒకరి సహాయానికి చేయి చాచలేదు.  యితరుల కష్టాలు విని సానుభూతి పడ్డాడే కానీ—తన విషాదాన్ని యే పరిస్థితిలోనూ పెదవిదాట నివ్వలేదు.

          యింతవరకూ బంగారయ్య జీవించి ఉన్నాడంటే అందుకు కారణం, అతని గుండెనిబ్బరం, తరగని ఆత్మస్థైర్యం.  మనసులో మనసై, కష్టసుఖాలలో భాగస్వామి అయిన భార్య, సుందరిని ప్రసవించి- సుందరి అందాన్ని చూచుకోకుండానే తనదారి తాను చూచుకొంది. వారి అన్యోన్య అనురాగం తెనిసినవారు బంగారయ్య హృదయం బద్దలయి పోతుందిఅనుకొన్నారు. కాని అంత విషాదాన్ని యెలా దిగమింగ గలిగాడో! బంగారయ్య.

          తగిలిన చోటే తిరిగి దెబ్బ తగలడం సహజం కాబోలు.. బంగారయ్య భార్య మరణించిన సంవత్సరం తిరక్కుండానే చేతికందుకొస్తాడనుకున్న చెట్టంత కొడుకు రైలు ప్రమాదంలో మట్టి కలిసిపోయాడు.  బంగారయ్య దుఁఖాన్ని  దిగమింగాడు. యింకా బంగారయ్య జీవితయాత్ర సాగిస్తున్నాడంటే, పుత్రశోకం అతన్ని కదిలించలేదు. అని భావించ నక్కరలేదు.  అనుక్షణం అతని హృదిలో ఆరని అగ్ని రేగుతూనే ఉంది.  విధికి ఎదురుగా నిలచి, మొండిగా బ్రతుకు సాగింపనారంభించాడు.

          తన ఆశలన్ని సుందరి పై కేంద్రీకరించి—తల్లి లేని సుందరిని సర్వమూ తానే అయి పెంచసాగేడు.  సుందరి ఆటపాటల్లో—అమాయకపు నవ్వులో---చిలిపి అల్లరిలో క్రమంగా తనకు తగిలిన గాయాల్ని మరచిపోయాడు.  విధి కలిగించిన గాయాలను –కాలమే మాన్పాలి.  సుందరి చిన్నతనంలో అల్లరికి, చిలిపితనానికి ప్రతిబింబం.  కాని కాలంతో పాటు ఎదుగుతున్న కొద్ది ఆమెలో అల్లరితనం తగ్గిపోయింది.
          సుందరి అందమైంది అంటే చాలదు, అందానికి సుందరి ప్రమాణం –అంటే అతిశయోక్తి కాదు.  ఆమె అందమంతా, నిర్మలమై, విశాలమైన ఆమెకళ్ళలో దాగిఉంది. వయసుతో పాటు,కోరికలూ ఆమెచుట్టూ పెరిగి పెనవైచుకున్నాయి.  తండ్రిగా బంగారయ్య సుందరిని ఓ అయ్య చేతిలో ఉంచి తన ధర్మాన్ని నిర్వర్తించుకుందామని ప్రయత్నాలారంభించక పోలేదు. అతని దరిద్రం-ఆశలకు-బంధాలు వేస్తోంది. అయినా అతడు ప్రయత్నం విరమించలేదు.
          సుందరి జీవితాన్ని గురించి అందమైన కలలు కనేది. పగలూ,రాత్రి కూడా, చాలావరకు తీరిక సమయాన్ని తీయని ఊహల్లో గడిపేది. ఆడదానిగా తన జీవితం సార్ధక పరచుకునేందుకు – ఆలంబన – అంతే ఆకాంక్ష. అందరు ఆడపిల్లల్లాగే - -తన అందచందాలకు యీడైన భర్త – ఆశలకూ, ఆశయాలకూ నీడైన భర్తతో – జీవితాన్నీ, మధువసంతంగా గడిపిముద్దుల పాపల ను కని అందరిలోనూ సుందరి ఎంత అదృష్టవంతురాలుఅని అనిపించుకోవాలని, తన అమ్మ, అమ్మమ్మల్లాగే సాధారణ సంసారిక జీవితంలో స్వర్గాన్ని సృజించుకొని అంచులదాకా నడవాలని కలలు కనేది.
          రోజులు దొర్లుతున్న కొద్దీ ఆమెలో అర్ధంకాని వెలితి ఆరంభమైంది.  క్రమంగా జీవితమవగతమవసాగింది. పగటికలలు – అసంతృప్తి అధికమయాయి.  ఒంటరితనం అలవాటయింది.  కిలకిలా నవ్వుతూ, ముద్దుగా మాట్లాడే సుందరి మూగబోయింది.  ఆమెకళ్ళలో ఆవేదన కాపురం చేయసాగింది. ఆమెలో మార్పు బంగారయ్య గుర్తించకపోలేదు.  చేతకాని వాడూ,కాసులేనివాడూ యేంచేయగలడు.  అహోరాత్రాలు,రెండోకంటికి తెలియకుండా తపించసాగాడు.  తిరిగి అతని గుండెల్లో మంటలు రేగాయి.
          తన దృష్టిలో నున్న పెళ్ళికొడుకు లందరి గడపలూ గంపెడంత ఆశతో ఎక్కి, మోయలేనంత నిరాశ తో దిగాడు. నా కూతురు అందమైందిఅన్నాడు బంగారయ్య.ఆడదాని అందం ఎంత కాలం నిలుస్తుంది అంది సమాజం.గుణవంతురాలు కూడా అని గట్టిగా అరిచాడు. గుణంకన్నా మాకు కట్నం మిన్న అని రెట్టింపుగా అరిచింది లోకం- సమాజ నగ్నస్వరూపం. బంగారయ్య ముందు నృత్యం చేసింది.  నిరాశాపూరితమైన బంగారయ్య హృదయం బ్రద్దలైంది.  దిక్కులు శూన్యం గా కనుపించాయి.  సుందరి కల్యాణం తను బ్రతికుండగా కలిసిరాదేమో!.  అని బావురుమన్నాడు. అతన్ని చూసి లోకం పాపం! బంగారయ్య అని విషపునవ్వు నవ్వింది.  నా పెళ్ళికోసం దిగులుపడకు ...నాన్నా!.నాకసలు పెళ్ళి చేసుకోవాలని లేదు. అని సుందరి తండ్రిని ఓదార్చడానికి యత్నించి ఓడిపోయింది.  పెరిగిన బంగారయ్య గడ్డంలో చిరునవ్వు విషాదంగా దూరి మాయమయింది.
బంగారయ్య యిష్టా – అయిష్టాలతో నిమిత్తం లేకుండా అతని చేతకానితనం – సుందరి పెళ్ళి ప్రయత్నాలను తాత్కాలికంగా విరమింపచేసింది.  ఓనాడు సుందరి పోరంటానికి వెళ్ళింది.  ఎదుటి హృదయాలను అర్ధం చేసుకోలేని – ఆడ వాళ్ళంతా తలో మాట అన్నారు.  యింకా ఎప్పుడు చేస్తాడే నీ పెళ్ళి - -మీ నాన్న యీసడించింది రంగమ్మ.
నలుగురి తోపాటు నారాయణ కట్నాలివ్వక పోతే పిల్లలు యిల్లు కదులుతారటే – యీ కాలంలో - - మీ నాన్న పిచ్చికానీ, అని నోరు నొక్కుకొని మరీ రిమార్కుచేసి - -యింకా చాలక చులకనగా సుందరివైపు చూసి నవ్వింది -  నరసమ్మ.
          సుందరి హృదయంలో ఈ మాటలు ఈటెల్లా తగిలాయి. యిక అక్కడ నిలబడలేక యింట్లోకి వచ్చి - -తలగడ తడిసేలా ఏడ్చింది.  అవును - -ఒకరిని అనవలసిన దేముంది.  రోజు రోజుకి వయసు పెరుగుతోంది.  ఆశ తరిగి పోతోంది. యింకా ఆలస్యమైతే తన్నిక ఎవరూ పెళ్ళి చేసుకోరేమో.  వింతభయం సుందరిని ఆవహించింది.
          తనకన్నా చిన్నదైన లక్ష్మికి ...ముగ్గురు పిల్లలు. మొన్నటి వరకూ చీరకూడా సరిగా కట్టుకోడంరాని - -కనకం – కొడుకు నెత్తుకుంది. తన జీవితం తీరని కోరికతో అంతమవవలసిందేనా?.   యీమరుభూమిలో విరులవాన ఎనాటికైనా కురియదా?.  యిలా అనేక ప్రశ్నలు తలయెత్తి ఆమెతలను బద్దలు చేయసాగాయి. సుందరి తపించిపోయింది.  అర్ధంకాని ఆవేదన ఆమెకళ్ళలో సుళ్ళు తిరిగింది. యిలా మూగతనం వహిస్తే ప్రయోజనం లేదు.  విషవలయంలోంచి విముక్తి కోసం తనకు తానై తెగించి సుఖం- చవిచూడాలి. అనేక రోజులు – సంఘంచే – మంచు చెడుగులుగా ఎంచబడ్డ విభిన్నభావ పరస్పర సంఘర్షణానంతరం – ఆమె యీ నిశ్చయానికి వచ్చింది.
స్త్రీకి సహజమైన సిగ్గు,బిడియాలను వదిలి పెట్టి, ఏకాంతంగా బొమ్మలు వేసుకుంటున్న నాగదిలో
అడుగు పెట్టింది. సుందరి. నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను.  ఆమెను ఆపాదమస్తకం పరిశీలిస్తూ అలానే నిలుచుండి పోయాను. మాయిద్దరి మధ్య భరింపరాని నిశ్శబ్ధం ఆవరించింది.  ఎలా సంభాషణ ప్రారంభించాలో – ఎలా పలుకరించాలో - -యింతకూ ఆమె ఎందుకు వచ్చిందో.. అర్ధం కాక నాలో నేను తికమక పడుతుండగానే - - నిశబ్ధాన్ని చీలుస్తూ..
          నా సాహసానికి మన్నించండి.  నాపరిస్థితే యీ సాహసానికి పురిగొల్పింది...నన్ను అపార్ధం చేసుకోక అర్ధం చేసుకోగలరన్న నమ్మకంతో యిక్కడకు వచ్చాను  అంది ఆమె.
          నేను నోరు విప్పి యేదో మాట్లాడబోతుండగానే...      అందరి లాంటివారే - -మీరు కారని - - నా మనసు మీకు మనవి చేద్దామని వచ్చాను  అంది.కాని బొటన వ్రేలితో నేలను రాస్తూ. శూన్యంలోకి చూస్తూ సుందరి.  యేమిటది.  అంతకన్నా యేమనాలో తెలియక అనేసాను.
          ఆ మె కొంచం సంకోచించి - - కానీ కట్నం యీయలేనిదానిని అని నిరసించక, నాయీ ఆత్మ సమర్పణను స్వీకరించండి. ---అంది. ఆమె స్వరం కంపించింది.  నాకు మతిపోయింది.  తనకు తానై వచ్చి సుందరేనా యీ మాటలు అంటున్నది. యిది కలా ...నిజమా...అని అనిపించింది...అంతులేని ఆశ్చర్యంలో పడ్డాను.
          యీ పేదదానికి మీ పాదసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి...ఉంటే ఎంతైనా కట్నం ఇచ్చేవాడే ...మానాన్న...కానీ మా పరిస్థితి మీకు తెలియంది కాదు.  ఆమె పెదవులు వణికిపోతున్నాయి. ఆమె ప్రతి మాట జాలిగా వినిపించింది నాకు. 
          ఆమె తన మనసు,వయసు నాముందు పరచింది. కళ్ళకు అద్దుకోవడమో,  కాళ్ళతో తన్నడమో ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి...నేను.ఆమె గుండెల మోత స్పష్టంగా నాకు వినిపిస్తోంది. సుందరి నానిర్ణయం కోసం ఊపిరి బిగపట్టి నిరీక్షిస్తోంది. యింత స్వల్పకాలంలో ...ఒక నిర్ణయానికి రావటం నా శక్తికి మించిన పని అనిపుంచి.....కొంచం ఆలోచించుకునేందుకు అవకాశం యివ్వండి అన్నాను.  అంగీకార సూచకంగా తలవూపి,  ఆశతో నన్నుచూసి వెళ్ళిపోయింది..ఆమె.
          ఒక రోజు కాదు - -కొన్ని రోజులు ఆలోచించాను- అందరినీ ఎదిరించి సుందరిని పెళ్ళాడితే ఎదురయ్యే మంచి,చెడ్డ లను గురించి... బుర్ర బద్దలవుతుందేమోననుకున్నాను... బద్దలయినా బాగుండుననిపించింది. నామనసు ఊగిసలాడుతూ రెండు కొండల మధ్య నలిగింది..   ఆలయం గోచరించిదేకానీ ...దారి దొరకలేదు. సుందరి కోసం, నాకోసం, ...తల్లి తండ్రులనేకాక, ప్రపంచాన్ని, విధినీ ఎదిరించాలని వెర్రి ఆవేశం కలిగేది.
          అంతలోనే వాస్తవిక ప్రపంచం గుర్తుకొచ్చి, కుప్పలా కూలిపోయేవాడిని... ఆమె నాకోసం ఆశగా ఎదురు చూస్తుంటుందని నాకు తెలుసు.  కానీ నేను ఎటూ తేల్చుకోలేక పోతున్నాను.  ఎన్నిరోజులిట్లా కాలయాపన చేసేది.
          నేను ఎంత మొత్తుకున్నా  -  మానాన్న, కట్నం పుచ్చుకోకుండా సుందరిని తన కోడలుగా చేసుకోవటం కల్ల. ఆయన మనసు మార్చే శక్తి నాకు లేదు.  ఎదురించి పోరాడే ధైర్యమూ లేదు. తల్లితండ్రులను విడిచి పెట్టి – తెగించి సుందరిని పెళ్ళి చేసుకునేంతటి ధైర్యము, ఆత్మ విశ్వాసమూ – నాకు కరవని నిశ్చయించుకున్నాడు.  తెలిసికూడా ...నాచేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఆమెతో చెలగాటాలాడటంకన్నా, తప్పుపని మరొకటి లేదనిపించింది.  నాదురదృష్టానికి విధిని నిందించాను.  నేనే సుందరిలాగ బీదతనంలో పుట్టి, ఉంటే తప్పక చేపట్టే అదృష్టం - - కలిగేదనిపించింది.  భాగ్యవంతుడుగా పుట్టించి. - - భగవంతుడు నన్ను భంగపరచాడని బావురుమన్నాను.  నోటితో చెప్పలేక కాగితం తీసుకుని. . . . నీవు నాకు అందని అందాలరాశివి.  - - అనుకుంటూ వచ్చాను. కాని యీనాడు నీవు అందబోతున్నా నిన్ను పొందలేని దురదృష్టవంతుడినయ్యాను.  నాకు గల సంపదను బట్టి సమాజం మాకు అందించిన హోదా . . .కట్నం పుచ్చుకోవడంలోనే హోదా. . నిలబెట్టుకోవాలన్న హృదయంలేని పెద్దల పట్టుదల - - నాకు శత్రవు అయ్యాయి.  నాజీవిత నిర్ణయం నా చేతిలో లేదు. నా యిష్ఠాయిష్టాలకు మార్జిన్ చాలా స్వల్పం. కష్టమైనా,నష్టమైనా నా తల్లితండ్రులు  నిర్ధేశించిన దారిని పోవటంకన్నా నేను చేయగలిగింది యేమీ లేదు.  నీకోసం కాకపోయినా, నాకోసం ...సమస్త శక్తిని కూడదీసుకుని ఎదిరించినా ఫలితం అంతంతమాత్రమే అయింది. .. రెండువేల వేలం పాటలో ఉన్నాను. నేను నీకు చేయగల సహాయం …. రెండు వేలకూ, రెండు వందల మినహాయింపు మాత్రమే..... యిక నీయిష్టం.  యేది ఏమయినా నీకు నా హృదయంలో పవిత్రమైన స్థానముంది.... అని రాసి ఆమెకు అందించాడు.  ఆమె జవాబుకు నేను ఎదురు చూడనూ లేదు....ఆమె నాకు జవాబు యీయనూ లేదు. .... ఆమె జవాబుని నేను ఊహించుకున్నాను....
          యింతలో కట్నాల్ని నిషేధించింది ప్రభుత్వం  అని పత్రికల్లో చదివి -  శాసనాల్ని తయారు చేసిన సహృదయులకు మనస్సులోనే నమస్కరించాడు---బంగారయ్య, పెద్దబరువు తలమీదనుంచీ దిగినట్లయింది.  అప్పుడే తన యింటి ముందు బాజా బజంత్రీలు వాగుతున్నట్లనిపించింది.  ఎనలేని ఉత్సాహం అతనిని పెనవేచుకొంది.
          తిరిగి సుందరి పెళ్ళి ప్రయత్నాలు ఆరంభించాకకాని - - సమాజ స్వరూపం అతనికి అవగత మయింది కాదు.  శాసనాల ప్రకారం ---కట్నం యీయనక్కరలేకుండా కూతురు కల్యాణం చేసే ప్రయత్నంలో కాళ్ళరిగేలా తిరిగిన అనంతరం--- శాసనాల అపాయం నుంచి ఉపాయంగా తప్పించుకునే చండశాసనులున్నారని,సమాజంలో పరివర్తన రానిదే శాసనాల ప్రయోజనం సిధ్ధించదని తెలిసికోగలిగాడు బంగారయ్య. అడవిలో దట్టమైన చీకట్లు అలుముకున్నాయి.  మరణోన్ముఖమైన జీవిత యాత్రలో అనుక్షణం తను ముందుకు పోతున్నాడు....యిక ఆలస్యం పనికిరాదని అర్ధశతాబ్ధం పైగా తన కుటుంబపు ఆశలు ---నిరాశలు చావులు—పుట్టుకలు, సంతోషాలు ---సంతాపాలకు సాక్షీభుతమైన యింటిని సుందరి మాటకను కూడా పక్కన నెట్టి, తాకట్టు పెట్టేడు.  అంతా పదిహేను వందలు.  వందసార్లు లెక్కించి మూటకట్టాడు.  అతని పెదవిపై అనిర్వచనీయమైన వింతనవ్వు విరిసింది.—తొలిసారిగా, తుదిసారిగా...
          పెళ్ళి ముడులు వేయించడంలోను...ముడి పడబోతున్న పెళ్ళిళ్ళు విడగొట్టడంలోనూ –సవ్యసాచి అయిన పేరిశాస్త్రి సహాయంతో ప్రక్కపట్టణం లోని విస్సయ్యగారితో వియ్యమందడానికి సిద్దపడ్డాడు బంగారయ్య.
          ప్రధాన సమయంలో గత అనుభవాల్ని కేంద్రీకరించుకొని పక్కావ్యాపారసరళి లో వ్యవహరించాడు. విస్సయ్య---
          యీనాడు ప్రభుత్వం శాసనం చేసిందని మన ఆచారాలు తరతరాలుగా వస్తూన్న సాంప్రదాయాలూ—చూస్తూ, చూస్తూ మనబోటి వాళ్ళం విడిచిపెట్టుకోలేంకదా...యేదో ఉభయతారకంగా కొంతతర్జుమా చేసుకోవాలి.  సుముహూర్త సమయంలో కట్నం మీరు యివ్వడానికి నేను పుచ్చుకోవడానికి వీలులేదు కనుక దుర్మూహూర్తం రాకపూర్వమే –యిప్పుడే ఆయిచ్చిపుచ్చుకునే వ్యవహారం అయిందనిపించుకోవటం మంచిది.  యేవంటారు.  అని బంగారయ్య ముఖంచూస్తూ హృదయాన్ని చదవడానికి ప్రయత్నించాడు విస్సయ్య.
          పెద్దలు నలుగురూ విస్సయ్య మాటలువేలకు విలువైనవి.  అంతటా యిప్పుడు యిలానే జరుగుతోంది.  అని సమర్ధించారు.  విస్సయ్య సమర్పించిన కాఫీలు సేవిస్తూ..   తన అనుభవాల్ని పేరిశాస్తి సలహాతో సరిచూచుకొని వెయ్యి రూపాయల కట్నం –వియ్యంకుడు విస్సయ్య చేతిలో పోసి చేయి దులుపు కున్నాడు బంగారయ్య.
తాంబూలాలు పుచ్చుకోవడం జరిగింది.  తధాస్తు అన్నారు పెద్దలు.  వ్యవధి తక్కువని పెళ్ళి యత్నాలు జోరుగా చేశాడు బంగారయ్య.   పది సంవత్సరాలుగా ముఖం కనపరచని బంధువులంతా ఒక్కొక్కరుగా బంగారయ్య యింటికి విచ్చేశారు.  సుందరి కండ్లల్లో వింతవెలుగు తొంగి చూసింది.  యింతకాలానికి తను ఎదురు చూసిన స్వర్గం దరి చేరబోతోంది.  అబ్భ...అనుకొని అరవిరిసిన మల్లెలా మురిసిపోయి. తన చుట్టూ తీయని గూడు కట్టుకొని విహరింపసాగింది.

          రైలు రెండు గంటలు లేటుగా వచ్చి  వెళ్ళిపోయంది, కానీ పెళ్ళి వారు మాత్రం దిగలేదు. పెళ్ళి వారెందుకు రాలేదో....ఎవరికీ అర్ధం కాలేదు.   యిక రావడానికి అవకాశం కూడా అంతగాలేదు.. బంగారయ్య యెటూ తెల్చకోలేక పోయాడు. తలో మాట అన్నారు.  యీరాత్రే లగ్నం...యింకా ఎప్పుడొస్తారు....ఏదో వేగిరంగా తేల్చకోవయ్యా బంగారయ్యా  అని హితవు  చెప్పారు బంధువులు.  బంగారయ్య పేరిశాస్త్రిని బంధువుల్లో ఘటికుల్ని తీసుకుని హుటాహుటిగా, టాక్సీ మీద ప్రయాణమయ్యాడు – విస్సయ్య గారింటికి.
          పెళ్ళి  వారిని చూసి—విస్సయ్య గొల్లుమని నెత్తినోరూ బాదుకుంటూ,కళ్ళ నీళ్ళు నింపుకుని, వరసవరుసల రాగాలతో అఘోరించాడే కానీ ఏంజరిగిందో చెప్పలేదు..... పేరిశాస్త్రి యేం జరిగిందో..చెప్పి మరీ ఏడవయ్యా  అన్న అనంతరం—రాగాలను ఒక అరశృతి తగ్గించి—యిష్టం లేదని వాడెంతమొత్తుకున్నా వినక, కట్నం ఆశించి వాడి మెడలు వంచాను  అని తిరిగి మొదటి సృతిలో రాగాలాపన ఆరంభించాడు.  తరువాత చుట్టూ చేరిన వాళ్ళలో బట్టతలాయన యేముందీ  -పరువు ప్రతిష్ట గంగలో కలిపి ఎదురింటి బాలవెధవముండని లేవదీసుకు పోయాడు.  పోయినవాడు పోతే బాగుండును—యింట్లో ఉన్న పిసరాపిప్పి పైసాపరకా,పెట్టెలు విరగ్గొట్టి వూడ్చి మరీ పట్టుకు ఉడాయించాడు  అని సశేషం పూర్తిచేసాడు.
అందరి ముఖాల్లోనూ కత్తివాటుకు నెత్తురుచుక్క లేకుండాపోయింది.  బంగారయ్య మదిలో భాషకందని భావాలు రేగాయి. ఆమూడు ముళ్ళూ పడ్డతర్వాత యీ ఘనకార్యం చేసి మాపిల్ల గొంతు కోయకుండా యింతటితో రక్షించాడు—మాసొమ్ము మాకు పారెయ్యండి పోతాం  అన్నాడు పేరిశాస్త్రి –ఉద్రేకంగా పళ్ళూ,పిడికిళ్ళూ బిగిస్తూ.  బంగారయ్య యేమీ అనకుండా వూరుకున్నాడు.  బంగారయ్య బంధువుల ఆసరాతో పేరిశాస్త్రి, విస్సయ్యతో వాగ్వాదానికి దిగాడు.కొంత సేపు తర్జన భర్జనలు పరస్పర దూషణలు-అనంతరం  నాదగ్గర చిల్లి గవ్వలేదు—మీరిచ్చిన సొమ్ముకు సాక్ష్యమాసంపన్నమా మీ యిష్టం వచ్చినట్టు చేసుకోండి అని మొండికెత్తేడు విస్సయ్య.  అంతా ముక్కుమీద వేలు వేసుకున్నారు.  
          యిక యీ స్థితిలో చేసేదీ, చేయగలిగిందీ యేమీలేదు కనుక – వసూలవుతుందని ఆశింపక పోయినా విస్సయ్య చేత యెలానో ప్రోనోటు వ్రాయించి బంగారయ్యచేతిలో పెట్టి  తన భాద్యత తీరిందని తృప్తి పడ్డాడు పేరిశాస్త్రి.  సుందరి, బంగారయ్యలను చూసి –చాటుగా నవ్వుకుని బాహాటంగా సంతాపం అభినయించింది సమాజం.  అంతా సవ్యం గా జరుగుతే సుందరి మెడలో తాళి పడేవేళకు –బంగారయ్య యింట్లో అంతా గొల్లమన్నారు - సుందరి నూతిలో పడింది.
యింకా కాళ్ళకు రాసిన పారాణి కరగ లేదు.  తీర్చిదిద్దిన కళ్యాణతిలకం చెదరనేలేదు.  కలువల్లాంటి సుందరి కనులు శాశ్వతంగా మూసుకు పోయాయి.  తరువాత బంగారయ్య యేమయ్యాడో యెవరికీ తెలియలేదు...
          అంతవరకూ తాను చిత్రిస్తున్న చిత్రాన్ని నాయెదుట ఉంచి  యీమె    ఆ అభాగ్యసుందరి.  అని బరువుగా నిట్టూరుస్తూ... ముగించాడీ జాలిగాధను...రాజు... నాకనులనిండా నీరు కమ్మింది.
 

No comments: